నటుడిపై నటి లైంగిక దాడి! | Womens empowerment: Asia Argento Denies She Had Sex With Young Actor | Sakshi
Sakshi News home page

స్త్రీలోక సంచారం

Published Wed, Aug 22 2018 1:49 AM | Last Updated on Wed, Aug 22 2018 11:10 AM

Womens empowerment:  Asia Argento Denies She Had Sex With Young Actor - Sakshi

ఏషియా అర్జెంటో

ఏడాది క్రితం హాలీవుడ్‌ దిగ్గజ నిర్మాత హార్వీ వైన్‌స్టీన్‌ లైంగిక అకృత్యాలపై తొలిసారి నోరు మెదిపి, ‘మీ టూ’ అనే ఒక మహోద్యమానికి ఆద్యులుగా నిలిచినవారిలో ఒకరైన ఇటాలియన్‌ నటి, డైరెక్టర్‌ ఏషియా అర్జెంటో ఇప్పుడు తనే స్వయంగా లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు! ఇంకో రెండు నెలల్లో 17వ పుట్టినరోజు జరుపుకోబోతాడనగా.. నటుడు, టీనేజ్‌ మ్యుజీషియన్‌ అయిన జిమ్మీ మెనెట్‌ను అప్పటికి 37 ఏళ్ల వయసులో ఉన్న ఏషియా అర్జెంటో 2013 మే 9న కాలిఫోర్నియాలోని ఒక హోటల్‌ గదిలో లైంగికంగా వేధించి, అతడిపై అత్యాచారం జరపడమే కాకుండా, అందుకు ప్రతిఫలంగా అతడికి 3,80,000 డాలర్లను (సుమారు 2 కోట్ల 64 లక్షల76 వేల 500 రూపాయలు) ఇచ్చినట్లు వచ్చిన ఆరోపణలపై న్యూయార్క్‌ మీడియాలో అకస్మాత్తుగా ఇప్పుడు వరుస కథనాలు మొదలయ్యాయి. అయితే, నటుడు జిమ్మి బానెట్‌పై తాను లైంగిక దాడి చేసినట్టు వచ్చిన ఆరోపణలను ఏషియా అర్జెంటో ఖండించారు. బానెట్‌ ఆర్థిక కష్టాల్లో ఉండటంతో వాటినుంచి గట్టెక్కించేందుకే అతనికి తన భాగస్వామి ఆంటోనీ బౌర్డెయిన్‌ ఆర్థిక సహకారాన్ని అందజేసినట్టు ఆమె తెలిపారు.

ఒంట్లో ఇనుప ధాతువు లోపం వల్ల ఏర్పడే రక్తహీనత (అనీమియా) గర్భిణులలో.. అది కూడా 20–30 ఏళ్ల వయసు గర్భిణులలో బాగా ఎక్కువగా ఉన్నట్లు హైదరాబాద్‌లోని వి.ఆర్‌.కె. ఉమెన్స్‌ మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్, షాదాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ల వైద్యులు కలిసి జంటనగరాలలోని ప్రసూతి ఆసుపత్రులకు వచ్చే గర్భిణులపై నిర్వహించిన సర్వేలో వెల్లడయింది. కాన్పునకు కాన్పునకు మధ్య తగినంత ఎడం లేకపోవడం, పెద్దగా చదువుకుని ఉండకపోవడం; స్త్రీ, పురుష అసమానతలు, పౌష్టికాహార లోపం, అనారోగ్యకరమైన జీవనశైలి.. వీటన్నిటి కారణంగా గర్భిణులు రక్తహీనతకు గురవుతున్నారని ‘ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ రీప్రొడక్షన్, కాంట్రాసెప్షన్, ఆబ్సెస్ట్రిక్స్‌ అండ్‌ గైనకాలజీ’లో ప్రచురితం అయిన ఈ సర్వే వివరాలను బట్టి తెలుస్తోంది. 

నేతాజీ సుభాస్‌ చంద్రబోస్‌ కుమార్తె అనితాబోస్‌ ఫ్యాఫ్‌.. తన తండ్రి అస్థికల్ని భారత్‌కు తెప్పించాలని ఇండియా, జపాన్‌ దేశాలకు పునర్విజ్ఞప్తి చేశారు. 1945 ఆగస్టు 18న తైవాన్‌ విమాన ప్రమాదంలో మరణించిన అనంతరం తన తండ్రి అస్థికలు 1945 సెప్టెంబరు నుండీ టోక్యోలోని రెంకోజి ఆలయంలో ఉండిపోయాయని గుర్తు చేస్తూ, స్వాతంత్య్రం వచ్చాకే తిరిగి తన జన్మభూమిలోకి అడుగుపెట్టాలని ఆకాంక్షించిన తన తండ్రి.. ఆ ఆకాంక్ష నెరవేరకుండానే చనిపోయినందున, ఆయన అస్థికలనైనా ఇండియాకు తెప్పించడం ఆయన ఆత్మకు శాంతినిస్తుందని అనితాబోస్‌ రెండు దేశాల ప్రభుత్వాలకు లేఖలు రాశారు.

కేరళ వరదల్లో కడలుండి నదీ తీరంలో ఉన్న ఇళ్లు మునిగిపోయి, ఇంట్లోని సర్వస్వం కోల్పోయి మలప్పురంలోని వరద బాధితుల పునరావాస కేంద్రంలో తన కుటుంబ సభ్యులతో పాటు తలదాచుకున్న అంజు అనే 19 ఏళ్ల యువతి, ఎనిమిది నెలల క్రితం చేసుకున్న నిశ్చితార్థానికి ఏమాత్రం విఘాతం కలగకూడదన్న కృతనిశ్చయంతో.. వధువు దుస్తుల్లో ముస్తాబై, ముందనుకున్న ముహూర్తానికే ఆదివారం నాడు అక్కడికి సమీపంలోని త్రిపురాంతకం ఆలయంలో వివాహం చేసుకోవడం రెండు వైపుల వారికీ కన్నుల పండుగే అయింది! ఘనంగా చేయాలనుకున్న వివాహం అనూహ్యంగా సంభవించిన వరదల వల్ల అవాంతరాలకు గురయినప్పటికీ, అంజు చూపిన చొరవ కారణంగా అనుకున్న రోజుకే జరగడం తమకెంతో సంతోషాన్నిచ్చిందని వరుడు షైజు (27) తల్లిదండ్రులు, బంధువులు వధువును ప్రశంసల జల్లుల్లో ముంచెత్తారు.

ఇంకో నెలలో కొత్త మిస్‌ అమెరికా రానున్న తరుణంలో.. ‘మిస్‌ అమెరికా ఆర్గనైజేషన్‌’ చేత గత 11 నెలలుగా తను వేధింపులకు గురవుతున్నట్లు మిస్‌ అమెరికా 2017 కారా మండ్‌.. 3000 పదాలతో కూడిన ఒక దీర్ఘ ప్రకటనను విడుదల చేశారు. ముఖ్యంగా ఆర్గనైజేషన్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ రెజీనా హాపర్‌ తనను నిరంతరం విమర్శిస్తూ ఉండేవారని, సోషల్‌ మీడియాలో తనను పోస్టింగ్‌లు పెట్టుకోనిచ్చేవారు కాదని, ఈవెంట్‌లలో పాల్గొనడంపైన కూడా అప్రకటిత నిషేధం విధించారని.. అసలు ఈ ఏడాదంతా టైటిల్‌ గెలిచిన సంతోషమే లేకపోగా.. ఒక బానిసలా, అన్నిటినీ సహిస్తూ తను జీవించానని’’ కారా మండ్‌ ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. 

పురిటినొప్పులు పడుతున్న మారియా డెల్‌ కార్మెన్‌ వెనెగాస్‌ (32) అనే కాలిఫోర్నియా మహిళను ఆమె భర్త జోయల్‌ అరోనా లారా (34) ఆసుపత్రికి తీసుకెళుతుండగా ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అతడిని అడ్డగించి, అరెస్టు చేసి తీసుకెళ్లడంతో ఆ మహిళే అతి కష్టం మీద కారును నడిపించుకుంటూ వెళ్లి ఆసుపత్రిలో చేరవలసి వచ్చింది. 12 ఏళ్ల క్రితం మెక్సికో నుంచి యు.ఎస్‌.కి వలస వచ్చిన వెనెగాస్‌ దంపతులకు, వారి ఐదుగురు పిల్లలకు యు.ఎస్‌. పౌరసత్వం ఉన్నప్పటికీ అధికారులు అడిగినప్పుడు వెనెగాస్‌ గుర్తింపు పత్రాలు తప్ప, ఆమె భర్తవి సమయానికి కారులో లేకపోవడంతో ఐ.సి.ఇ. (ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌) ఏజెంట్లు.. పక్కనే నిండు గర్భిణి అయిన భార్య ఉందని కూడా లేకుండా అతడి చేతికి బేడీలు వేసి మరీ తీసుకెళ్లారు. 


సెప్టెంబర్‌ 7న ఇజ్రాయెల్‌లో జరగబోతున్న ‘మీటియర్స్‌ ఫెస్టివల్‌’లో కచేరీ ఇవ్వాలని తను తీసుకున్న నిర్ణయం సరైనదేనని ‘లానా డెల్‌ రే’ గా ప్రసిద్ధురాలైన ప్రముఖ అమెరికన్‌ గాయని ఎలిజబెత్‌ ఊల్రిడ్జ్‌ గ్రాంట్‌.. తనని తను సమర్థించుకున్నారు. ‘వెలిదేశం’ అయిన ఇజ్రాయెల్‌లో ప్రదర్శన ఇచ్చేందుకు లానా డెల్‌ రే వెళ్లడం సరికాదని, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా 2005 నుంచీ ప్రచారోద్యమం చేపట్టిన  బి.డి.ఎస్‌. (బాయ్‌కాట్, డైవెస్ట్‌మెంట్, శాంక్షన్‌ – బహిష్కరణ, ఉపసంహరణ, ఆంక్షలు) అనే పాలస్తీనా సంస్థ అభ్యంతరం చెప్పడంతో లానా ఈ విధమైన ప్రకటన చేస్తూ, సంగీతానికి హద్దులు, సరిహద్దులు ఉండవని అన్నారు.

ఆస్ట్రేలియా పార్లమెంటులో సెనెటర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన  తొలి పాకిస్తాన్‌ సంతతి ముస్లిం మహిళ మెహ్రీన్‌ ఫరూకీ.. ప్రమాణ స్వీకారం చేసి వారమైనా కాకముందే, ముస్లింల వ్యతిరేకి అయిన క్రాస్‌బెంచ్‌ (విపక్ష / స్వతంత్ర) సెనెటర్‌ ఫ్రేజర్‌ యానింగ్‌కి పంచ్‌ ఇచ్చారు. ఎంత కఠినమైన నిర్ణయమైనా సరే తీసుకుని, ఆస్ట్రేలియాలోకి ముస్లింల వలసలను నివారించాల్సిన అవసరం ఉందని యానింగ్‌ అన్న మాటకు స్పందిస్తూ.. ‘‘ఏవేళనైనా సరే, ఆయన మా ఇంటి తలుపు తట్టి.. నాతో కొన్ని నిమిషాలు కూర్చోగలిగితే.. బహుళ జాతుల సహజీవనంలోని సౌందర్యం, సుసంపన్నతల గురించి రెండు మూడు విషయాలను ఆయనకు నేర్పి పంపుతాను’’ అని మెహ్రీన్‌ ఫరూకీ వ్యాఖ్యానించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement