అత్యాచారం వల్ల గర్భం ధరించిన ఓ 18 ఏళ్ల కళాశాల విద్యార్థిని.. లైంగికదాడి కారణంగా తన ప్రమేయం లేకుండా, తనకు ఇష్టం లేకుండా తను గర్భం దాల్చానని, అది కూడా తను మైనరుగా ఉన్నప్పుడు జరిగిందని.. కాబట్టి తన 27 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతిని ఇవ్వాలని దాఖలు చేసుకున్న పిటిషన్‌ను విచారిస్తున్న సుప్రీంకోర్టు.. ఈ కేసులో గర్భస్థ పిండం హక్కులను కూడా పరిగణనలోనికి తీసుకోవలసి ఉంటుందని అభిప్రాయపడింది. ఎం.టి.పి. చట్టం (మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్టు) ప్రకారం 20 వారాల వరకు మాత్రమే గర్భవిచ్ఛిత్తికి ఆమోదం ఉన్నందున, ఆ బాధిత విద్యార్థినికి గర్భవిచ్చిత్తి జరిపించవలసిన అత్యవసర స్థితి ఏమైనా ఉందా అని నిర్థారించుకోవడం కోసం వైద్య నిపుణులతో కూడిన ఒక కమిటీని కూడా కోర్టు నియమించింది.
‘‘ఐ యామ్ సారీ. ఇక్కడంతా సెరెనా గెలుపును కోరుకున్నారు. కానీ, ఇలా అవుతుందని నేను అనుకోలేదు. అయితే గెలుపు, ఓటమి కాదు.. సెరెనాతో ఆడడం నా కల. అది ఇవాళ నెరవేరింది’’ అని సెరెనా విలియమ్స్‌పై యు.ఎస్. ఓపెన్ ఫైనల్స్‌లో గెలిచిన జపాన్ టెన్నిస్ క్రీడాకారిణి నవోమీ ఒసాకా.. టెన్నిస్ మైదానంలో ప్రేక్షకులందరికీ క్షమాపణ చెప్పి ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానుల మనసు దోచుకున్నారు. ఇరవై ఏళ్ల ఒసాకా ఒక గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను గెలవడం ఇదే మొదటిసారిగా కాగా.. గెలుపు అనంతర క్షణాలలో ఆమె ఏమాత్రం ఉద్వేగాన్ని ప్రదర్శించక, గ్రాండ్‌స్లామ్‌ల యోధురాలు సెరినా ముందు ఒద్దికగా, వినమ్రంగా నిలుచోవడం సెరెనాను సైతం ముగ్ధురాలిని చేసింది.
తిరువనంతపురంలోని మార్ ఐవేనియోస్ కాలేజీలో తన గర్ల్‌ఫ్రెండ్ అయిన చారులతను.. ఇండియన్ క్రికెటర్ సంజు వి.శాంప్సన్ ఈ ఏడాది డిసెంబర్ 22న వివాహమాడబోతున్నాడు. ఐదేళ్లుగా చారులతను తను ప్రేమిస్తున్నానని, తొలిసారిగా ఆమెకు 2013 ఆగస్టు 22న రాత్రి 11 గం. 11 నిముషాలకు ‘హాయ్’ చెప్పానని ఫేస్‌బుక్‌లో ఆదివారం శాంప్సన్ బహిర్గతం చేయగా.. ‘‘మా ఆమోదం పొందాకే పెళ్లి సంగతిని ప్రకటించాలని వాళ్లిద్దరూ అనుకున్నారని, తిరువనంతపురంలో జరిగే పెళ్లికి ఇప్పటికే ఫంక్షన్ హాల్ కూడా బుక్ అయిందని’’ శాంప్సన్ తండ్రి విశ్వనాథ్ నిర్థారించారు.
సెలవులో ఉన్న ఐ.సి.ఐ.సి.ఐ. బ్యాంకు సీఈవో చందా కొచ్చర్‌ను విచారణ నిమిత్తం ఏ క్షణమైనా సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) పిలిపించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘న్యూపవర్ రెన్యువబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్’ వ్యవస్థాపకుడైన చందా భర్త.. దీపక్ కొచ్చర్ వ్యాపార లావాదేవీల విషయంలో బ్యాంకు సీఈవోగా కొచ్చర్ ఆయనకు సడలింపులు ఇచ్చేందుకు నిబంధలను ఏమైనా అతిక్రమించి ఉండే అవకాశాలున్నాయా అనే కోణంలో సెబీ ఆమెను ప్రశ్నించవచ్చని భావిస్తున్నారు.
మహిళల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం 3 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రూపొందించిన మూడేళ్ల ప్రణాళిక (2018–19 నుంచి 2020–21 వరకు) లో భాగంగా త్వరలోనే దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, లక్నోలలో పబ్లిక్ ప్యానిక్ బటన్‌లు, ఆల్ ఉమెన్ పోలీస్ పెట్రోలింగ్ టీమ్‌లు ప్రారంభం కాబోతున్నాయి. హోమ్ శాఖ పర్యవేక్షణలోని ఈ ‘ఉమెన్ సేఫ్ సిటీ ప్రాజెక్ట్’.. దేశంలో మహిళల భద్రతకు ఉద్దేశించిన అన్ని సంస్థలతో సమన్వయం కలిగి ఉండడమే కాక.. మహిళలు, శిశువుల కోసం.. ప్రయాణ విరామ వసతులు (ట్రాన్సిట్ డార్మెటరీస్), శక్తిమంతమైన ఎల్.ఇ.డి. వీధి దీపాలు, ఆపదనుంచి కాపాడే కేంద్రాలు, నేర నిర్థారణ, సైబర్ క్రైమ్ సెల్స్ నిర్వహణను కూడా పర్యవేక్షిస్తుంటుంది.
ఎనిమిది దేశాల (శ్రీలంక, ఇండియా, వెస్ట్ ఇండీస్, దక్షిణాఫ్రికా – ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, పాకిస్తాన్, న్యూజిల్యాండ్) 2021 ఐ.సి.సి. ఉమెన్స్ వరల్డ్ కప్‌లో అర్హత కోసం జరుగుతున్న ఐ.సి.సి. ఉమెన్స్ చాంపియన్‌లోని మూడో రౌండ్‌లో భాగంగా నేటి నుండి ఈ నెల 16 తేదీ వరకు భారత మహిళా క్రికెట్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తుంది. శ్రీలంకలోని గాలాలో సెప్టెంబర్ 11న, 13న, కటునాయకేలో 16న శ్రీలంకతో వన్‌డేలో పోటీ పడనున్న భారత మహిళా జట్టుకు మిథాలీరాజ్ కెప్టెన్ కాగా, జట్టులో తాన్యాభాటియా, ఏక్తా బిష్త్, రాజేశ్వరీ గైక్వాడ్, ఝులన్ గోస్వామి, దయాళన్ హేమలత, మాన్సీ జోషి, హర్‌మన్‌ప్రీత్ కౌర్, వేద కృష్ణమూర్తి స్మృతి మంథన, శిఖా పాండే, పూనమ్ రనౌత్, జమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, పూనమ్ యాదవ్ ఉన్నారు.
మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశంగా అప్రతిష్ట మూట కట్టుకున్న ఇండియాకు.. సురక్షితమైన దేశంగా పునఃప్రతిష్ట తెచ్చేందుకు ఢిల్లీ పోలీసులు, ఢిల్లీలోని ఎన్జీవో సంస్థ ‘యునైటెడ్ సిస్టర్స్ ఫౌండేషన్’ కలిసి సోమవారం అర్ధరాత్రి ఢిల్లీ కన్నాట్ ప్లేస్‌లో నిర్వహించిన ఐదు కిలోమీటర్ల ‘ఫియర్‌లెస్ రన్’ విజయవంతమైంది. 200 మంది మహిళలు పాల్గొన్న ఈ ఫియర్‌లెస్ రన్‌ను ఢిల్లీ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అజయ్ చౌదరి; సోషల్ ఆక్టివిస్టు, ఆసిడ్ దాడి నుంచి బయటపడిన లక్ష్మీ అగర్వాల్ ప్రారంభించారు.
ఈ నెల 14న విడుదల అవుతున్న మలయాళీ రొమాంటిక్ కామెడీ చిత్రం ‘ఒరు అదార్ లవ్’ లోని ఒక టీజర్ సన్నివేశంలో కన్ను గీటి, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక్కసారిగా సోషల్‌మీడియాలో ప్రసిద్ధురాలైన బి.కాం. విద్యార్థిని ప్రియా ప్రకాష్ వారియర్ తాజాగా తన ఎరుపు రంగు దుస్తుల ఫొటో షూట్‌తో తన అభిమానుల హృదయాలపై పూల జల్లులు కురిపిస్తున్నారు! సరిగ్గా చిత్రం రిలీజ్‌కు ముందు ఒక స్థానిక మ్యాగజీన్ ప్రచురించిన ప్రియ ఫొటోలు.. ‘మనకు తెలియకుండా ఈ కొత్త నటి సినిమాల్లోకి ఎప్పుడొచ్చారబ్బా!’ అని ఆశ్చర్యంతో పాటు ఆహ్లాదమూ కలిగించేలా ఉన్నాయి.
స్త్రీలోక సంచారం
Published Tue, Sep 11 2018 12:05 AM | Last Updated on Fri, Nov 9 2018 6:39 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment