డిసెంబర్ 3 మిథాలీరాజ్ పుట్టినరోజు. అయితే ఈ సంతోషకరమైన రోజు కూడా ఆమెను బాధించే పరిణామమే సంభవించింది. ఇటీవల వెస్టిండీస్‌లో జరిగిన ఐ.సి.సి. ఉమెన్స్ వరల్డ్ ట్వంటీ20 టోర్నమెంట్‌లోని కీలకమైన మ్యాచ్‌లలో మిథాలీని ఆడకుండా చేసి, ఆమెను అడుగడుగునా, అనేక విధాలుగా అవమానపరిచినట్లు రమేశ్ పొవార్ ఆరోపణలు ఎదుర్కొంటుండగా.. తిరిగి అతడినే తమ కోచ్‌గా కొనసాగించాలని అభ్యర్థిస్తూ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ బి.సి.సి.ఐ.కి ఈ–మెయిల్ పంపించారు! ఆమె అభ్యర్థనను బలపరుస్తూ వైస్ కెప్టెన్ స్మృతి మంధాన మరో ఈ–మెయిల్ పంపారు. కోచ్‌గా రమేశ్ రెండేళ్ల ఒప్పంద కాలపరిమితి నవంబర్ 30తో ముగిసింది. కొత్త కోచ్ కోసం బి.సి.సి.ఐ. దరఖాస్తులు కోరుతూ ప్రకటన కూడా జారీ చేసింది. ఈ దశలో ఈ అమ్మాయిలిద్దరూ మళ్లీ రమేశ్‌నే కోచ్‌గా తీసుకోవాలని కోరడం వెనుక రమేశ్ ప్రమేయం, ఒత్తిడి ఉన్నాయన్న అనుమానాలుతలెత్తుతున్నాయి.
పదీయాభై ఏళ్ల మధ్య వయసులోని మహిళలకు శబరిమల ఆలయ దర్శంనంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు ఈ ఏడాది సెప్టెంబర్ 28న ఇచ్చిన తీర్పు అనంతరం కేరళలో తలెత్తిన ఆధ్యాత్మిక, రాజకీయ సంక్షోభం మకర సంక్రాంతి వరకో, లేక మధ్యంతర ఎన్నికల్ని పీకమీదికి తెచ్చుకునే వరకో కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి! ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ హిందూ మత సంస్థలు ఏకతాటిపైకి వస్తుండగా, తాజాగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వచ్చే జనవరి 1న.. మానవహారంలా ఓ మహిళాహారాన్ని నిర్మించి, దానికి ఉద్యమరూపం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కసరగోడ్ జిల్లా కేంద్రం నుంచి కేరళ రాజధాని తిరువనంతపురం వరకు 600 కి.మీ. దూరం సాగే ఈ మానవహారంలోకి పార్టీలకు, మత సంస్థలకు అతీతంగా అందరినీ ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు. సమాజ నిర్మాణంలో మహిళలకున్న భాగస్వామ్యాన్ని విస్మరించి ముందుకు సాగలేమని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. కోర్టు తీర్పును శిరసావహించే బాధ్యతను నెరవేర్చే క్రమంలో ప్రభుత్వానికి ఎదురౌతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు అవసరమైన మద్దతును ప్రజల నుంచి కూడగట్టుకునే ప్రయత్నంలో భాగమే విజయన్ నిర్మిస్తున్న ఈ మహిళాహారం.
స్త్రీలోక సంచారం
Published Wed, Dec 5 2018 12:10 AM | Last Updated on Wed, Dec 5 2018 12:10 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment