హాలీవుడ్ నటి కైరా నైట్‌లీ.. ‘డిస్నీ’ క్లాసిక్స్‌లోని కొన్ని సినిమాలు ఇంట్లో తన కూతురు కంటపడకుండా జాగ్రత్తపడుతున్నారు. ఆ ‘నిషిద్ధ’ సినిమాల్లో ఒకటి.. 1950లో విడుదలైన ‘సిండ్రెల్లా’. అందులో సిండ్రెల్లా అనే యువతి.. సంపన్నుడైన ఒక యువకుడు వచ్చి తనను రక్షించడం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ‘‘ఇలాంటి సన్నివేశాలున్న సినిమాలను ఆడపిల్లలకు చూపించకూడదు. రక్షణ కోసం ఒకరిపై ఆధార పడడం మంచి విషయం కాదనీ, ఎవర్ని వారే రక్షించుకోవాలని చిన్నప్పట్నుంచీ మనం మన అమ్మాయిలకు చెబుతుండాలి’’ అని ప్రసిద్ధ ‘ఎలెన్’ షోలో కైరా అన్నారు. ‘‘సిండ్రెల్లా నాకు ఇష్టమైన చిత్రమే కానీ, అందులో సిండ్రెల్లా తన రక్షణ కోసం ఒక పురుషుడిపై ఆధారపడడం’ నాకు నచ్చలేదు. ఆ ఒక్క కారణంతో ఆ చిత్రాన్ని నా కూతురికి చూపించలేకపోతున్నాను. అలాంటివే ఇంకొన్ని చిత్రాలను కూడా ఇంట్లో బ్యాన్ చేశాను’’ అని కైరా తెలిపారు. ఇప్పుడు ఆమె కూతురు వయసు మూడేళ్లు. ‘‘తను ఎలా ఉండాలనుకుంటే అలానే ఉంటుంది. అయితే స్వతంత్రంగా ఉండడం లైఫ్‌లో ముఖ్యం అని మాత్రం తనకు చెప్తాను.. అందుకు తగ్గ వయసు రాగానే’’ అని కైరా అన్నారు.
బ్రిటన్ రాకుమారుడు ప్రిన్స్ హ్యారీ, ఆయన సతీమణి మేఘన్ మార్కల్.. ఈ ఏడాది మేలో పెళ్లయినప్పట్నుంచీ పూర్తిగా టూర్‌లలోనే గడుపుతున్నారు. మధ్య మధ్య విరామాలలో సామాజిక కార్యక్రమాలకు కూడా జంటగా, విడివిడిగా తమ సేవలు అందిస్తున్న ఈ దంపతులు.. తాజాగా ఆస్ట్రేలియాలోని శివారు ప్రాంతమైన ‘దుబ్బో’ లో పర్యటిస్తున్నప్పుడు చిన్నపాటి భారీ వర్షం కురిసింది. కరువు పీడిత ప్రాంతమైన దుబ్బోలో వర్షం పడడం అంటే.. అదొక విశ్వాంతరాళ వింత అన్నట్లుగా ఉంటుంది. ప్రిన్స్ హ్యారీ దంపతులు అడుగుపెట్టడంతోటే వర్షం పడడంతో దుబ్బో మేయర్ బెన్ షీల్డ్స్ ఆనందంతో పరవశమై.. ‘మీ రాకతో నాలుగు చినుకులు పడ్డాయి’ అంటూ వారిపై ధన్యవాదాల వర్షం కురిపించారు. ఇంగ్లండ్‌లో వాతావరణం ఎప్పుడూ చలిచలిగా, తేమగా ఉంటుంది. అందుకు భిన్నంగా ఆస్ట్రేలియాలోని దుబ్బోలో, ఆ చుట్టుపక్కల వేడి తాండవిస్తుంటుంది. అందుకే మేయర్ గారు అలా రెండు ప్రాంతాలకూ పోలికలు తెస్తూ ఆ రాజకుటుంబ జంటకు అభివందనాలు తెలియజేశారు.
శ్రీలంకలో బికినీలు వేసుకుని బీచ్‌లో తిరగడంపై అనధికారికంగా నిషేధం ఉంది. ఇప్పుడా అనధికారిక నిషేధాన్ని శ్రీలంక ప్రభుత్వం రద్దు చేసే ఆలోచనలో ఉంది. లంక బీచ్‌లను సమీపించే కూడళ్లలో విదేశీ పర్యాటకులకు ‘నో బికినీస్’ అంటూ పెద్ద ఎర్ర గుర్తుతో సైన్ బోర్డులు కనిపిస్తుంటాయి. నిజానికి అవి పాలనా యంత్రాంగం అనుమతి తీసుకుని పెట్టినవి కావు. సంస్కృతి పరిరక్షణ ప్రియులెవరో వాటిని ఏర్పాటు చేశారు. దీనిపై పర్యాటకులు తరచు అసంతృప్తిని వ్యక్తం చేస్తుండడంతో విషయం పైస్థాయిలోకి వెళ్లింది. బికినీలను విహారానికి కాకుండా సంస్కృతికి ముడిపెట్టి నిషేధించడం ఏంటని పాశ్చాత్య దేశాల పర్యాటకలు చిరచిరలాడితే కనుక శ్రీలంకలో టూరిజం కుంటుపడే ప్రమాదం ఉందని తలపోసిన ప్రభుత్వం తక్షణం స్పందించి.. ‘మీ ఇష్టం వచ్చిన దుస్తులు ధరించండి’ అని బీచ్ అధికారుల చేత అనధికారికంగా చెప్పిస్తోంది. త్వరలోనే అధికారికంగా వెసులుబాటును ఇవ్వబోతోంది.
తమిళనాడు, కంచీపురంలోని కిళ్‌కొట్టయ్యూర్ గ్రామంలో ఒక మాతృమూర్తి ఆత్మహత్య చేసుకుంది. కొడుకు ఆత్మహత్యకు తనే కారణమన్న అపరాధ భావన ఆమెను అంతటి తీవ్రమైన నిర్ణయం తీసుకునేలా చేసింది. ఆ తల్లి పేరు ఇంద్రాణి. వయసు 45. నాలుగిళ్లల్లో పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. ఆమె కొడుకు గోవిందరాజన్‌కు 16 ఏళ్లు. ఎప్పటి నుంచో బైక్ కొనిమ్మని అడుగుతున్నాడు. అతడు కోరుకుంటున్న బైక్ ధర లక్షా యాభై వేలు. అంత పెద్దం మొత్త ఇంద్రాణికి తలకు మించిన బరువు. ఆ మాటే చెబుతూ వస్తోంది. చివరికి గోవిందరాజన్.. బైక్ లేకుండా తన జీవితం వేస్ట్ అనుకున్నాడో.. లేక, బైక్ కొనివ్వని తల్లిని చచ్చి సాధిద్దామని అనుకున్నాడో.. ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు. అప్పటి నుండీ తన కొడుకు మరణానికి తనే కారణం అని కుమిలిపోతూ ఉన్న ఇంద్రాణి.. ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుని ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకుని చనిపోయింది. ఆ ఘటన కిల్‌కొట్టయ్యూర్ గ్రామాన్ని దిగ్భ్రాంతిపరిచింది. గ్రామంలో విషాదాన్ని నింపింది.
తెలియని దెయ్యం కంటే, తెలిసిన దెయ్యం నయం అంటారు. కెరీర్ పీక్‌లో ఉన్న అమ్మాయిలు పెళ్లిని దెయ్యంలా భావిస్తారని అనుకుంటే కనుక.. అమెరికన్ సింగర్ లేడీ గాగా.. తెలిసిన దెయ్యాన్నే పెళ్లి చేసుకోబోతున్నారు! మ్యూజిక్ ఏజెంట్ క్రిస్టియన్ కారినోను తన ‘ఫియాన్స్’ గా ప్రకటించిన గాగా.. అతడితో తనకు ఎంగేజ్‌మెంట్ జరిగిన విషయాన్ని కూడా లోకానికి వెల్లడించారు. గాగా మంచి నిర్ణయమే తీసుకున్నారని అనుకోడానికి ఒక కారణం ఏంటంటే.. కారినో ప్రొఫెషనల్‌గా మాత్రమే కాకుండా.. ఎమోషనల్‌గా కూడా ఆమెకు ఒక మంచి ఏజెంటుగా ఉండడం.
స్త్రీలోక సంచారం
Published Sat, Oct 20 2018 12:34 AM | Last Updated on Sat, Oct 20 2018 12:34 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment