స్త్రీలోక సంచారం | Womens empowerment:i had nervous breakdowns while filming Love Sonia | Sakshi
Sakshi News home page

స్త్రీలోక సంచారం

Published Tue, Sep 4 2018 12:34 AM | Last Updated on Tue, Sep 4 2018 12:34 AM

Womens empowerment:i had nervous breakdowns while filming Love Sonia - Sakshi

మైసూరు సమీపంలోని కృష్ణరాజనగర్‌ తాలూకా పరిధిలో గల ఎరెమనుగణహళ్లి గ్రామంలో ఉన్న 450 మంది జనాభాలో నయీమా ఖాన్‌ (8) అనే ఒక ఒక్క బాలిక ఆ గ్రామంలోని ప్రభుత్వ పూర్వ ప్రాథమిక పాఠశాలకు గత మూడేళ్లుగా క్రమం తప్పకుండా వెళుతుండగా.. ఆమె పట్టుదలను చూసి.. ఆ ఒక్క విద్యార్థిని కోసం.. ఉర్దూ బోధించడానికి సబియా సుల్తాన్, కన్నడ బోధించడానికి నాగరాజు అనే ఇద్దరు ప్రభుత్వ టీచర్లు ఏనాడూ గైర్హాజరు కాకుండా స్కూలుకు హాజరవుతున్న విషయం వార్తల్లోకి వచ్చింది. దళిత జనాభా అధిక సంఖ్యలో ఉన్న ఈ గ్రామంలో ప్రస్తుతం 40 ముస్లిం కుటుంబాలు ఉండగా, ఆ కుటుంబాలంతటికీ నయీమా ఖాన్‌ ఒక్కతే చదువుకుంటూ, ఆమె మూడవ తరగతి వరకు రావడానికి తోడ్పడిన ఈ పాఠశాలను ఉర్దూ భాష వ్యాప్తి కోసం ప్రభుత్వం 60 ఏళ్ల క్రితం స్థాపించింది.

మిస్‌ ఇంగ్లండ్‌ ఫైనల్స్‌లో తొలిసారి హిజబ్‌ ధరించి పాల్గొన్న యువతిగా శారా ఇఫ్తెఖర్‌ అనే విద్యార్థిని రికార్డు సృష్టించారు. మిస్‌ ఇంగ్లండ్‌  పోటీలలో గతంలో క్వాలిఫయింగ్‌ రౌండ్స్‌లో హిజబ్‌ ధరించి పాల్గొన్నవారు ఉన్నప్పటికీ, ఫైనల్స్‌లో హిజబ్‌తో పోటీకి నిలబడడం ఇదే మొదటిసారి.

ఏలీ ఫ్రేజర్‌ అనే స్కాట్లాండ్‌ యువతి.. తన బాయ్‌ఫ్రెండ్‌ ఆవు ఒంటి మీద, ‘నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని రాసి, ఆ ఆవును ఆమె దగ్గరికి తోలుకొచ్చి, తను ఆమె ఎదురుగా మోకాలిపై వంగి, ప్రపోజ్‌ చెయ్యడంతో ఆనందంతో పొంగిపోయి, వెంటనే ‘ఎస్‌’ చెప్పడం ఒక విశేషం అయింది. ఆమె ఈడు వాడే అయిన క్రిస్‌ గాస్పెల్‌ అనే 30 ఏళ్ల యువ రైతు, ఎంతో భిన్నంగా ఆలోచించి, తన మనోభావాలను ప్రియురాలికి వ్యక్తం చేసిన తీరుకు ముచ్చట పడిన ఇరువైపు స్నేహితులు కూడా అబ్బాయికి అమ్మాయి ఓకే చెప్పడంలో తగిన పాత్ర పోషించారు.

జీవితంలోని అన్ని దశల్లోనూ స్త్రీజాతి ఎదుర్కొంటున్న వివక్షల్ని, వరకట్న వేధింపుల్ని, లైంగిక హింసల్ని, అసమానతలను మనసుకు హత్తుకునేలా చిత్రీకరించి.. స్త్రీ తలచుకుంటే, స్త్రీ తిరగబడితే ఏ శక్తీ ఆమెను ఆపలేదని, ఆమె సహనాన్ని పరీక్షించడం మానవ జాతికే క్షేమకరం కాదనీ.. సందేశం ఇస్తూ.. తెలుగు బిగ్‌బాస్‌ 2 కంటెస్టెంట్‌ రోల్‌ రైడా (రాహుల్‌ కుమార్‌ వేల్పుల) దృశ్యీకరించి ‘అరుపు’ పేరుతో యూట్యూబ్‌లోకి ఆగస్టు 24 న విడుదల చేసిన వీడియో అమితమైన వీక్షకాదరణ పొందుతోంది. ఇప్పటి వరకు దాదాపు 20 లక్షల హిట్స్‌కు చేరుకున్న ఈ 6 ని. 58 సెకన్ల వీడియోకు పాట రాసి, పెర్ఫామ్‌ చేసింది రైడానే కాగా, మ్యూజిక్‌ను కమ్రాన్, గాత్రాన్ని మనీషా అందించారు. 

దగాపడి, పడుపు వృత్తిలో కూరుకుపోయిన ఓ అమాయకపు పల్లెటూరి అమ్మాయి జీవితం ఎన్ని మలుపులు తిరిగిందో, వాటిని ఆమె ఏ విధంగా ధైర్యంగా ఎదుర్కొందో చూపించే ‘లవ్‌ సోనియా’ చిత్రం ఈ నెల 14న దేశవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అయిన నేపథ్యంలో చిత్రంలో సోనియా పాత్రను పోషించిన మరాఠీ నటి మృణాళ్‌ ఠాకూర్‌ ప్రమోషనల్‌ ఇంటర్వ్యూలు ఇన్‌స్పైరింగ్‌గా ఉంటున్నాయి. ‘మౌనంగా ఉండమనీ, మౌనంగా భరించమనీ’ అమ్మాయిలకు నూరి పోయడం అంటే.. వారిని  చేజేతులా నరక కూపంలోకి నెట్టివేయడమేనని మృణాల్‌ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. 

జాతిపిత గాంధీజీ హత్యకు గురైనప్పుడు సంబరాలు జరుపుకున్నవారు ఇప్పుడు జాతిని పరిపాలిస్తున్నారని బాలీవుడ్‌ నటి స్వరాభాస్కర్‌ ఆలోచన రేకెత్తించే వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ముంబై, రాంచీ, హైదరాబాద్, ఫరీదాబాద్, ఢిల్లీ, థాణెలలో కొందరు హక్కుల కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసిన విషయమై న్యూఢిల్లీలో శనివారం జరిగిన ‘ఇండియ¯Œ  ఉమెన్‌ ప్రెస్‌ కోర్‌’ సమావేశంలో ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ వ్యాఖ్యను చేసిన స్వరా భాస్కర్‌.. చేతలకు శిక్ష విధించాలి కానీ, ఆలోచనలకు కాదు’ అని కూడా అంటూ హక్కుల కార్యకర్తలను సమర్థించడంతో పాటు, ఎన్డీయే ప్రభుత్వం వైఖరి మీద తన తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేశారు. 

అక్టోబర్‌ 12న విడుదల అవుతున్న బాలీవుడ్‌ రొమాంటిక్‌ మ్యూజికల్‌ డ్రామా మూవీ ‘జలేబీ’ పోస్టర్‌లో హీరోయిన్‌ రియా చక్రవర్తిని, కొత్త కుర్రాడైన హీరో వరుణ్‌ మిత్రా ముద్దు పెట్టుకుంటున్న సన్నివేశంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. బాలికలు, మహిళలపై అసంఖ్యాకంగా లైంగిక అకృత్యాలు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి పోస్టర్లు అబ్బాయిల్లో చెడు తలంపులకు కలిగించే ప్రమాదం లేకపోలేదన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

నాలుగిళ్లలో పని చేసి, ఏళ్ల పాటు రూపాయి రూపాయి కూడబెట్టుకుని లక్షా 39 వేలు పొదుపు చేసుకుని, నోట్ల రద్దుతో తీవ్ర మనోవేదనకు గురైన మీనాక్షి (41) అనే మహిళ ఆ నోట్లను గడువు లోపల మార్చుకోవడం తెలియక, వాటిని తీసుకెళ్లి హేమావతి నీటిలో కలిపి వేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సరిగా మాటలు రాని, ఏదీ వినిపించని మీనాక్షి.. తనకు బ్యాంకు అకౌంట్‌ లేకపోవడం, నోట్లు ఎలా మార్చుకోవాలో తెలియకపోవడం, అంతకన్నా కూడా తను డబ్బు దాచిన విషయం ఎవరికీ తెలియకూడదని అనుకోవడంతో చాలాకాలం పాటు సతమతమై, గడుపు తేదీ అయిన మార్చి 31 (2017) తర్వాత కూడా ఇంట్లో నోట్లుంటే నేరమని తెలుసుకుని, ఆఖరి ప్రయత్నంగా వాటిని మార్చుకునేందుకు మాజీ ప్రధాని దేవెగౌడను, బ్యాంకు అధికారులను కూడా కలిసి, ప్రయోజనం లేక ఈ వ్యవస్థపై కోపంతో తన కష్టార్జితాన్నంతా నీటి పాలు చేసుకుందని ఆమె తల్లి లక్ష్మీదేవి (70) కంట తడి పెట్టుకున్నారు. 
  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement