స్త్రీలోక సంచారం | Womens empowerment:Kim Kardashian Says Sister Kourtney Is the Least Exciting to Look at on KUWTK | Sakshi
Sakshi News home page

స్త్రీలోక సంచారం

Published Thu, Aug 2 2018 1:21 AM | Last Updated on Thu, Aug 2 2018 1:22 AM

Womens empowerment:Kim Kardashian Says Sister Kourtney Is the Least Exciting to Look at on KUWTK - Sakshi

ఎయిర్‌ ఇండియాలో 38 ఏళ్లపాటు పని చేసి, మంగళవారం నాటి ముంబై–బెంగళూరు–ముంబై ఆఖరి ట్రిప్పుతో పదవీ విరమణ పొందిన క్యాబిన్‌ బృంద సభ్యురాలు పూజకు.. అదే ఫ్లయిట్‌లో కో–పైలట్‌గా ఉన్న ఆమె కుమార్తె అశ్రిత, మిగతా సిబ్బంది కలసి.. ముంబైలో ల్యాండ్‌ అవుతున్న ప్రయాణికుల సమక్షంలో ఉద్వేగభరితమైన వీడ్కోలు పలికారు. ఎయిర్‌హోస్ట్‌గా ప్రారంభమైన తల్లి కెరీర్‌లోని ఉత్సాహాన్ని, చురుకుదనాన్ని చిన్నప్పట్నుంచీ చూస్తూ పెరిగిన అశ్రిత.. తన తల్లిలాగే విమానయాన ఉద్యోగం చేయాలని ఆసక్తిని పెంచుకోవడంతో కూతుర్ని ఆమె చక్కగా చదివించి, పైలట్‌ను చేసిన నేపథ్యంలో.. తల్లి పదవీ విరమణ రోజు ఆమె ఉన్న విమానాన్ని స్వయంగా కూతురే నడపడం ఒక మరుపురాని సందర్భంగా నిలిచింది.  మౌనం వీడకుండా, మహిళలు మానసిక హింస (సైకలాజికల్‌ అబ్యూస్‌) నుంచి విముక్తి పొందలేరని ఫిక్కీ (ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ), ‘లేడీస్‌ ఆర్గనైజేషన్‌’ సభ్యులు హాజరైన సభలో ‘ది లివ్‌ లవ్‌ లాఫ్‌ ఫౌండేషన్‌’ చైర్‌పర్సన్‌ అన్నా చండీ అన్నారు. నటి దీపికా పడుకోన్‌ సంస్థ అయిన ‘ది లివ్‌ లవ్‌ లాఫ్‌ ఫౌండేషన్‌’.. డిప్రెషన్‌పై దేశంలోని వివిధ ప్రాంతాలలో తరచు ఇస్తుండే ప్రసంగాలలో భాగంగా హైదరాబాద్‌ వచ్చిన అన్నా చండీ.. కుంగుబాటుకు గురవుతున్న మహిళలు ఆ విషయాన్ని బయటికి వెల్లడించడం ద్వారా ఆ విషాదస్థితి నుంచి బయటపడే అవకాశాలు మెరుగవుతాయని సూచించారు. 

తెలంగాణలో 2 కోట్ల మంది మహిళలు ఉన్నప్పటికీ, కె.సి.ఆర్‌. మంత్రివర్గంలో ఒక్క మహిళ కూడా లేకపోవడాన్ని రాష్ట్రంలోని మహిళల దృష్టికి తేవడంతో పాటు, తెలంగాణలో కాంగ్రెస్‌ కనుక అధికారంలోకి వస్తే మహిళలకు ఏమేమీ వరాలు ఇవ్వబోతున్నదీ ఈ నెల రెండో వారంలో రాష్ట్రానికి వస్తున్న ఎ.ఐ.సి.సి. అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ రంగారెడ్డి జిల్లాలో జరిగే బహిరంగ సభలో ప్రకటించనున్నారని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఈ నాలుగున్నరేళ్లలో కె.సి.ఆర్‌. ఒక్కసారి కూడా మహిళా స్వయం సహాయక బృందాలతో సమావేశం కాలేదని ఆరోపిస్తూ, అసలు మహిళా సాధికారతపైనే ఆయనకు సదుద్దేశం లేదని ఉత్తమ్‌కుమార్‌ విమర్శించారు. ‘స్త్రీ ఒక బిడ్డకు జన్మను ఇవ్వొచ్చు కానీ, ఆలయంలోకి వెళ్లి ప్రార్థనలు జరపకూడదా!’ అని విశ్వహిందూపరిషత్‌ మహిళా నాయకురాలు సాధ్వి ప్రాచీ విస్మయం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌ జిల్లాలో ఇటీవల ఒక మహిళ ఆలయ ప్రవేశం చేసినందుకు, ఆలయ నిర్వాహకులు గంగా జలంతో ఆలయాన్ని శుద్ధి చెయ్యడంపై..మధురలోని బంకే బిహారీ ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా.. ప్రాచీ పై విధంగా వ్యాఖ్యానించారు.  ఆస్ట్రేలియాలో లిండా డోక్టార్‌ అనే 34 ఏళ్ల భగ్నప్రేమికురాలు, ఆ బాధనుంచి ఉపశమనం కోసం అక్కడి గోల్డ్‌కోస్ట్‌ తీరప్రాంతంలో బాగా సన్నిహితులైన ముగ్గురు స్నేహితుల సమక్షంలో తనని తను వివాహం చేసుకున్నారు! ‘సోలిగమీ’ అనే ఈ స్వీయవివాహ సంప్రదాయం ఆస్ట్రేలియాలో చట్ట విరుద్ధమే అయినప్పటికీ, ప్రేమ విఫలం అయిన అనంతరం సెల్ఫ్‌–లవ్‌ చాంపియన్‌గా మారిన లిండా.. నీలం, ఊదా రంగులు కలిసిన కొత్త గౌను ధరించి, చేత్తో అద్దం పట్టుకుని, అందులో తనని తను చూసుకుంటూ ‘నిన్ను ఎప్పటికీ వీడను’ అనే ప్రమాణంతో వివాహ తంతును పూర్తి చేసుకున్నారు. 

ప్రముఖ అమెరికన్‌ రియాలిటీ టెలివిజన్‌ పర్సనాలిటీ కిమ్‌ కర్దేషియాన్‌ (37) తన చెల్లెళ్లిద్దరితో కూర్చొని మాట్లాడుతుండగా, ‘నువ్వసలు తింటున్నావా? ఏంటలా చిక్కిపోయావ్‌?’ అని ఒక చెల్లి అడిగిన ప్రశ్నకు సమాధానంగా కర్దేషియాన్‌ పట్టలేనంత ఆనందంతో ‘ఓ మై గాడ్‌. థాంక్యూ’ అని అనడాన్ని.. సోషల్‌ మీడియాలో కర్దేషియాన్‌ పెట్టిన వీడియోలో చూసిన.. వైద్యనిపుణులు ఆమెపై విరుచుకుపడుతున్నారు. ఆ స్థాయిలో కర్దేషియాన్‌ వ్యక్తం చేసిన సంతోషం.. ఆమెను ఆరాధించి, ఆదర్శంగా తీసుకునే టీనేజ్‌ ఆడపిల్లల్ని ’అనొరెక్సియా’ (సన్నపడేలా చేసే) వ్యాధి వైపు నడిపించే ప్రమాదం ఉందని వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు మరమ్మతులు జరుగుతున్నప్పుడు వాహనదారులను అప్రమత్తం చేయడానికి ‘మెన్‌ ఎట్‌ వర్క్‌’ అని పెట్టే హెచ్చరిక బోర్డులను ఏడేళ్ల చిన్నారి అభ్యంతరం మేరకు ‘న్యూజిలాండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ’.. ఇక నుంచి ‘పర్సన్స్‌ ఎట్‌ వర్క్‌’ అని మార్చబోతోంది. గత నెలలో జో క్యార్యూ అనే పాప తన అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళుతూ, రోడ్డుపై కనిపించిన ‘లైన్‌మెన్‌’ అనే బోర్డును చూసి.. ‘లైన్‌ఉమెన్‌ కూడా పని చేస్తున్నప్పుడు లైన్‌మెన్‌ అని మాత్రమే బోర్డు పెట్టడం సమంజసం కాదని, స్త్రీ పురుషులిద్దరూ సమానమేనని’ ట్రాన్‌పోర్ట్‌ అథారిటీకి లేఖ రాయడంతో రోడ్డు నిర్వహణ అధికారులు ఈ విధమైన మార్పును చేయబోతున్నారు.  ప్రపంచవ్యాప్తంగా సహాయ, పునరావాస శిబిరాలలో మహిళలు లైంగిక వేధింపులకు, లైంగిక దోపిడీకి, అత్యాచార యత్నాలకు గురవుతున్నారని బ్రిటిష్‌ పార్లమెంటు కమిటీ నిర్వహించిన తాజా సర్వేలో వెల్లడయింది. అంతర్జాతీయంగా పెద్ద పెద్ద సహాయ సంస్థల్లో పనిచేసే అధికారులు, వారి సిబ్బంది.. లైంగిక కుంభకోణాల్లో ఉన్నారన్న ఆరోపణలు వస్తున్న క్రమంలో జరిగిన ఈ సర్వేలోని ఫలితాలు ఐక్యరాజ్యసమితిని సైతం దిగ్భ్రాంతికి లోను చేశాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement