ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ ‘పిత్ హెల్మెట్’ (బ్రిటిష్ టోపీ) పెట్టుకోవడంపై తాజాగా సోషల్ మీడియాలో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. వలస పాలనకు సంకేతమైన బ్రిటిష్ టోపీని.. అమెరికన్ ప్రథమ మహిళగా ఆమె ఎలా ధరిస్తారని నెటిజన్‌లు ప్రశ్నిస్తున్నారు. మెలానియా గత శుక్రవారం కెన్యా వెళ్లినప్పుడు తెలుపు రంగు పిత్ హెల్మెట్‌ను «ధరించి అక్కడి సఫారీ పార్కులో కొద్దిసేపు విహరించారు. మెలానియా ఇలా పొరపాటుగా ప్రవర్తించడం ఇదే మొదటిసారి కాదు. గత జూన్‌లో టెక్సాస్‌లోని వలస తల్లిదండ్రుల శిశు నిర్బంధ గృహాలను సందర్శించడానికి వెళ్లినప్పుడు మెలానియా ధరించిన జాకెట్‌పై ‘ఐ రియల్లీ డోన్డ్ కేర్. డు యూ?’ అనే అక్షరాలు ఉండడం వివాదాస్పదం అయింది. అక్రమ వలసల్ని నిరోధించేందుకు తల్లీబిడ్డల్ని వేరు చేసి, విచారణ జరిపేందుకు వీలుగా శిశు నిర్బంధ కేంద్రాలను ఏర్పాటు చేస్తూ తన భర్త తీసుకున్న నిర్ణయాన్ని ఆమె.. ‘నేను లెక్క చేయను, మీరు చేస్తారా?’ అని అనడం ద్వారా ధిక్కరించారని అమెరికన్ జాతీయవాదులంతా ఆమెపై విరుచుకుపడ్డారు. ఇప్పుడిక ఈ బ్రిటిష్ టోపీని ధరించడం, పైగా ఆఫ్రికాలో పర్యటిస్తూ ఆమె ఆ పని చేయడం.. ఏళ్ల పాటు బ్రిటిష్ పాలనలో మగ్గిన ఆఫ్రికన్‌లకు కూడా కోపం తెప్పించింది. ప్రస్తుతం ఆఫ్రికా దేశాల పర్యటనలో ఉన్న మెలానియాపై (నేటితో పర్యటన ముగుస్తుంది).. ఆఫ్రికన్‌లంతా ‘ఫ్లోటస్ ఇన్ సౌత్ ఆఫ్రికన్ బింగో’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్రోలింగ్ జరిగిపుతున్నారు. ఫ్లోటస్ అంటే ఫస్ట్ లేడీ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్. బింగో అంటే ఆట. ఆఫ్రికన్‌ల మనోభావాలతో మెలానియా ఆటలాడుతున్నారని విమర్శిస్తున్నవారు నెట్‌లో ఈ హ్యాష్‌ట్యాగ్ సృష్టించి ఆమెను తలా ఓ మాట అంటున్నారు.
అత్తాకోడళ్ల మధ్య కీచులాటల్నే మనం ఎక్కువగా చూస్తుంటాం. టీవీ సీరియళ్లు కూడా కీచులాటలు పెట్టడానికి సాధారణంగా అత్తాకోడళ్లనే ఎంచుకుంటాయి. నిజ జీవితంలో అందుకు భిన్నంగా ఓ అత్త తన కోడలికి కిడ్నీ ఇచ్చి ఆమె ప్రాణాల్ని నిలబెట్టింది. రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లా గాంధీనగర్‌లో ఉంటున్న గనీ దేవి (60) కోడలు సోనికా (32) ఏడాదిక్రితం వైద్యపరీక్షల కోసం ఢిల్లీలోని అపోలో ఆసుపత్రికి వెళ్లినప్పుడు ఆమె రెండు కిడ్నీలు చెడిపోయాయాయని, కనీసం ఒక కిడ్నీనైనా మార్చందే ఆమెను కాపాడుకోవడం అసాధ్యం అని వైద్యులు సోనికా కుటుంబ సభ్యులకు తెలిపారు. సోనికా తల్లి కిడ్నీ ఇవ్వొచ్చని వైద్యులు చెప్పారు కానీ, సోనికా తల్లి భన్వారీదేవి.. భయంతో అందుకు అంగీకరించలేదు. తమ్ముడి కిడ్నీ గానీ, తండ్రి కిడ్నీ గానీ పనికొస్తుందని తెలిసినప్పుడు వాళ్లిద్దరు కూడా కిడ్నీ ఇవ్వడానికి విముఖత చూపారు. చివరికి అత్తగారు ముందుకొచ్చి తన కిడ్నీ ఇస్తానన్నారు. ఆమె కిడ్నీ పనికొస్తుందని వైద్యులు చెప్పిన వెంటనే ఆమె తన కోడలికి కిడ్నీ ఇచ్చేందుకు ఎలాంటి సంకోచాలూ లేకుండా ముందుకు వచ్చారు. గత నెల 13న ఢిల్లీలో సోనికాకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉంది. సోనికా ఇద్దరు కూతుళ్లు సంతోషంగా ఉన్నారు. ‘మా అత్తగారికి నేను జీవితాంతం, జీవితానంతరం కూడా రుణపడి ఉంటాను’ అని ఆమెకు చేతులు జోడించి మరీ చెబుతోంది సోనికా. కిడ్నీ ఇచ్చిన విషయం అత్తగారు చెప్పుకోలేదు కానీ.. ఆసుపత్రిలోని వారెవరో మీడియాతో చెప్పడంతో ఈ అత్తగారి త్యాగ గుణం గురించి బయటికి తెలిసింది.
ప్రసవమంత అందమైన అనుభవం లేదని కొత్త తల్లులను మభ్యపెట్టే విధంగా బ్రిటన్ రాకుమారి కేట్ మిడిల్డన్ (36) తనకు కాన్పు జరిగిన ప్రతిసారీ హాస్పిటల్ నుంచి అందంగా తయారై, బిడ్డను చేత్తో పట్టుకుని నడుస్తూ టీవీలో కనిపించడం బాధ్యతారహిత్యమని హాలీవుడ్ స్టార్ కైరా నైట్‌లీ (33) కొత్తగా తను రాసిన ‘ది వీకర్ సెక్స్’ అనే వ్యాసంలో విమర్శించారు. ‘‘చూస్తున్నాను కదా. తన మూడు ప్రసవాలలోనూ కేట్ ఇలాగే చేశారు. జన్మనిచ్చాక కూడా తల్లులు ఇలాగే తాజాగా ఉంటారని అనుకునేలా ప్రసవం అయిన కొన్ని గంటలకే ముస్తాబై ఆసుపత్రి నుంచి బయటికి వచ్చారు. ఇదంతా నేను టీవీలో చూశాను. ఎందుకింత అబద్ధం. స్త్రీకి కాన్పు ఎలాంటిదో నాకు తెలుసు. ఆ షిట్టు, ఆ రక్తం, ఆ వాంతులు, ఆ కుట్లు.. అసలు జన్మనివ్వడం అనేది సాఫీగా, సవ్యంగా జరిగే విషయం కాదు. ఇవన్నీ ఎందుకు దాస్తున్నావ్ కేట్. అమాయకపు ఆడపిల్లలు నమ్మేందుకా? ఉన్న సంగతి చెప్పేందుకు బలం కావాలి. ఇప్పుడు చెప్పు.. ఒక బాధాకరమైన స్థితి గురించి అందమైన అబద్ధం చెబుతున్న నువ్వు వీకర్ సెక్సా? ఉన్నది ఉన్నట్లుగా బయట పెడుతున్న నేను వీకర్ సెక్సా?’ అని తన వ్యాసంలో కేట్‌కు ప్రశ్నలు సంధించారు కైరా. 2015లో ఒక బిడ్డకు జన్మనిచ్చిన కైరా.. తన దారుణమైన ప్రసవ వేదనను ‘ఫెమినిస్ట్స్ డోన్ట్ వేర్ పింక్’ (అండ్ అదర్ లైస్) అనే పుస్తకంలో వర్ణించారు. ఇప్పుడీ వ్యాసంలో ఆనాటి చేదు అనుభవాన్ని పునర్లిఖించారు.
Comments
Please login to add a commentAdd a comment