రెండో పెళ్లి (బిగమీ) కోసం హిందువులలో కొందరు ముస్లిం మతం స్వీకరిస్తున్న ధోరణì కి అడ్డుకట్ట వేసేందుకు చట్టపరమైన గట్టి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించిన ‘లా’ కమిషన్.. ఈ విధమైన పెళ్లిళ్లను చెల్లుబాటు కానివిగా పరిగణించాలని 2015లో మహిళా శిశు, అభివృద్ధి శాఖ ఒక నివేదికలో సూచించడాన్ని గుర్తు చేసింది. భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 494 ప్రకారం.. జీవిత భాగస్వామికి తెలియకుండా ఇంకో పెళ్లి చేసుకున్నవారికి ఏడేళ్ల వరకు, సెక్షన్ 495 ప్రకారం.. పెళ్లయిన సంగతిని దాచి పెట్టి ఇంకో పెళ్లి చేసుకున్నవారికి పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశాలు ఉండగా, శిక్షను తప్పించుకోవడానికి హిందువులు కొందరు.. ముస్లిం మతంలోకి మారుతున్నారని సామాజిక జీవన విధానాల పరిశీలకులు కొంతకాలంగా చెబుతున్న మాటను కూడా లా కమిషన్ తన సూచనల్లో ప్రస్తావించింది.
దత్తత తీసుకున్న తల్లిదండ్రులు వదిలేయడంతో ప్రస్తుతం స్పెయిన్‌లోని జర్గోజా ప్రభుత్వ శరణాలయంలో ఉన్న పదమూడేళ్ల బాలికను తక్షణం భారతదేశానికి తెప్పించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను జాప్యం లేకుండా పూర్తి చెయ్యాలని కేంద్ర స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ మంత్రి మనేకా గాంధీ స్పెయిన్‌లోని భారత రాయబారి డి.బి.వెంకటేశ్ వర్మకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది ఆరంభంలో ఇండియా వచ్చిన స్పెయిన్ దంపతులు భోపాల్‌లోని ‘ఉడాన్’ అనే అడాప్షన్ ఏజెన్సీ నుంచి ఆ బాలికను దత్తత తీసుకునే సమయంలో ఆమె వయసు ఏడేళ్లని అబద్ధం చెప్పి ఏజెన్సీ తమను మోసం చేసిందని స్పెయిన్ తిరిగి వెళ్లాక తెలియడం తో వారు ఆమెను వదిలేశారని పత్రికలో వచ్చిన వార్తతో కలత చెందిన మనేకా.. ‘ఏది ఏమైనా’ ఆ చిన్నారిని మన దేశానికి సురక్షితంగా తెప్పించి, తగిన సంరక్ష కల్పించాలన్న కృతనిశ్చయానికి వచ్చా0తరు.
మయన్మార్‌లోని రొహింగ్యా ముస్లింల ఊచకోతపై కథనాలు రాసిన వా లోన్, కా సో ఓ అనే ఇద్దరు జర్నలిస్టులను అధికార రహస్యాలు బట్టబయలు చేశారన్న నేరారోపణలపై అరెస్టు చేసిన అనంతరం, అక్కడి న్యాయస్థానం వారికి ఏడేళ్ల జైలు శిక్ష విధించడంతో.. ఆ దేశ సమరయోధురాలు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, ప్రస్తుత మయన్మార్ ‘స్టేట్ కౌన్సిలర్’ ఆంగ్ సాన్ సూచీకి హక్కుల పరిరక్షణ ఉద్యమకారిణిగా ఇంతవరకు ఉన్న పేరు ప్రతిష్టలన్నీ నీరుగారిపోయాయి. జైల్లో ఆ జర్నలిస్టుల పరిస్థితి ఏమిటన్న విషయమై సూచీని తను అడిగినప్పుడు వారిపై ఆమె ఎంతో ఆగ్రహం వ్యక్తం చేశారనీ, వారిని ఆమె దేశ విద్రోహులుగా అభివర్ణించడాన్ని బట్టి చూస్తే ఆ ఇద్దరి ప్రాణాలూ ప్రమాదంలో ఉన్నట్లు అర్థమౌతోందని మయన్మార్‌లోని యు.ఎస్. దౌత్య అధికారి బిల్ రిచర్డ్‌సన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
స్ట్రిప్ క్లబ్బులలో ‘ల్యాప్ డ్యాన్స్’ నిషేధానికి ఉన్న న్యాయపరమైన అవరోధాలను తొలగించేందుకు ఇజ్రాయెల్ ప్రభుత్వం నిపుణులతో కలిసి కూర్చొని చర్చలు జరుపుతోంది. స్ట్రిప్ క్లబ్‌లో బార్ డ్యాన్సర్‌లు ఒక్కో వస్త్రాన్నీ తొలగిస్తూ నృత్యం చేయడం అన్నది ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ.. ఇటీవల ‘స్ట్రిప్’ (బట్టలు తొలగించడం)తో పాటు ‘ల్యాప్’ (ఒడిలో కూర్చోవడం) డ్యాన్స్ కూడా తోడయిన కారణంగా ఆగ్రహించిన ఆ దేశ మహిళలు.. క్లబ్బుల బయట నిరసన ప్రదర్శనలు జరుపుతుండటంతో దిగివచ్చిన ప్రభుత్వం, ‘ల్యాప్ డ్యాన్స్’ను ‘వ్యభిచారం’గా పరిగణిస్తూ శిక్షను విధించే చట్టాన్ని తేవాలన్న ఆలోచనలో ఉంది.
భారతీయ రచయిత్రులు రాసిన 13 పుస్తకాలు ఈ నెలలో విడుదల అవుతున్నాయి! ఫెమినిస్ట్ రాణి (శైలీచోప్రా, మేఘనా పంత్), 54 రీజన్స్ వై పేరెంట్స్ సక్ అండ్ ఫ్యూ (డాక్టర్ స్వాతీ లోథా, స్వరా లోథా), బికాజ్ హి ఈజ్ (మేఘనా గుల్జార్), హౌ ఇండియా వర్క్స్ : మేకింగ్ సెన్స్ ఆఫ్ ఎ కాంప్లెక్స్ కార్పొరేట్ కల్చర్ (ఆర్తి కెల్షికార్), యాంబిగ్యుయిటీ మెషీన్స్, అండ్ అదర్ స్టోరీస్ (వందనా సింగ్), మహుల్దిహా డేస్ (అనితా అగ్నిహోత్రి), ది ఉమెన్స్ కోర్ట్‌యార్డ్ (ఖదీజా మసూర్), నాట్ క్వైట్ నాట్ వైట్ (షర్మిలా సేన్), ఎ షూటింగ్ స్టార్ : ఎ గర్ల్, హర్ బ్యాక్ పెయిన్ అండ్ ది వరల్డ్ (శివ్యానాథ్), ఎంప్రెస్ : ది ఆస్టానిషింగ్ రీన్ ఆఫ్ నూర్జహాన్ (రూబీ లాల్), సెర్చింగ్ ఫర్ హోమ్ : స్టోరీస్ ఆఫ్ ఇండియన్స్ లివింగ్ అబ్రాడ్ (శిమ్రాన్ చావ్లా), శ్రీదేవి (లలితా అయ్యర్), రెమ్నెంట్ ఆఫ్ ఎ సెపరేషన్ : ఎ హిస్టరీ ఆఫ్ ది పార్టిషన్ త్రూ మెటీరియల్ మెమరీ (ఆంచల్ మల్హోత్రా).. అనే ఈ పుస్తకాలను ప్రచురణకర్తల నుంచే కాకుండా, అమెజాన్ నుంచీ తెప్పించుకోవచ్చు.
చెన్నై నుంచి సోమవారం మధ్యాహ్నం తూత్తుకుడి వెళుతున్న విమానంలో ఉన్న లూయిస్ సోఫియా (28) అనే రీసెర్చ్ స్కాలర్.. అదే విమానంలో ఉన్న బి.జె.పి. రాష్ట్ర అధ్యక్షురాలు తమిళ్‌సై సౌందరరాజన్ మీదకు దూసుMðళుతూ బీజేపీ ప్రభుత్వ ‘నియంతృత్వ’ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారన్న నేరారోపణపై అరెస్ట్ అయ్యారు. కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ మాంట్రియల్‌లో చదువుతున్న సోఫియా ఇలా నినాదాలు చేయడాన్ని తేలిగ్గా తీసుకోవాలని పోలీసులు తమిళ్‌సైకి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఆమె వినకపోవడంతో సోఫియాపై సెక్షన్ 505 (1)బి (భయం కలిగించేలా అరవడం), సెక్షన్ 290 (పబ్లిక్ న్యూసెన్స్), సెక్షన్ 75(1)సి (ప్రజాప్రతినిధికి అవినమ్రంగా సమాధానం చెప్పడం) కింద కేసులు నమోదు చేసి పుదుక్కొటై్ట మహిళా పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రస్తుతం 12 రోజుల కైలాశ్ మానస సరోవర్ యాత్రలో ఉండగా, ఆయన నియోజకవర్గమైన అమేథీలోని అన్ని గ్రామ పంచాయతీలను 2018 చివరి నాటికి డిజిటలైజ్ చేసే ప్రాజెక్టులో కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతి ఇరానీ తలమునకలై ఉన్నారు. 2014లో రాహుల్ గాంధీ మీద అమేథీ నుండి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ, తరచు ఆ నియోజకవర్గంలో పర్యటిస్తూ వస్తున్న స్మృతి.. సెప్టెంబర్ 1న అమేథీలోని పిండారా ఠాకూర్ గ్రామంలో ‘డిజిటల్ గ్రామ్’ ప్రాజెక్టును ప్రారంభించారు.
ఒక బిడ్డకు జన్మనిచ్చాక కూడా కొంత విరామంతో తిరిగి బరిలోకి వచ్చి, ఉత్సాహంగా తన ప్రతిభను కనబరిచే ప్రయత్నం చేస్తున్న టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ తొలిసారిగా తన ఫిట్‌నెస్‌పై పెదవి విప్పారు. గర్భం దాల్చాక మునుపటి ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం అనుకున్నంత తేలిక కాదని.. ప్రస్తుతం యు.ఎస్. ఓపెన్‌లో ఆడుతున్న సెరెనా అన్నారు.
స్త్రీలోక సంచారం
Published Wed, Sep 5 2018 12:09 AM | Last Updated on Wed, Sep 18 2019 2:58 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment