మైఖేల్ జాక్సన్ కూతురు పారిస్ జాక్సన్ మీద మనసు పారేసుకుని నిరంతరం ఆమెను వెంబడిస్తూ, ఓసారైతే.. ఆమె దర్శనం కోసం ఆమె రికార్డింగ్ స్టూడియో బయట పదిహేను గంటలపాటు వేచివున్న నికోలాస్ లీవైజ్ స్టీవెన్స్ అనే ఆగంతకుడిని మళ్లీ వచ్చే వాయిదా వరకు ఆమెకు కనీసం 91.44 మీటర్ల దూరంలో ఉండాలని కోర్టు ఆదేశించింది. పారిస్ జాక్సన్‌ను వెంబడించడమే కాక, ఆమె ఫొటోను ట్విట్టర్‌లో పెట్టి, ‘ఈమె నా ఆత్మసఖి’ అని నికోలాస్ కామెంట్ పెట్టడంతో భయపడిన పారిస్, అతడి నుంచి తనకు రక్షణ కల్పించాలని కోర్టును ఆశ్రయించారు ::: కోల్‌కతా నుంచి వస్తున్న ప్రముఖ గాయని సొమెరిటా మల్లిక్ ఈ నెల 14 సాయంత్రం 5 గంటలకు బంజారాహిల్స్ రోడ్ నెం.1 లోని ‘జీవీకే వన్’ మాల్‌కి ఎదురుగా ఉన్న ‘లామకాన్’లో తన సంగీత విభావరితో అలరించనున్నారు. రవీంద్రనాథ్ టాగోర్, ఖాజీ నజ్రూల్ ఇస్లాంల శ్రావ్యగీతాలకు తన గాత్రంలోని మాధుర్యాన్ని రంగరించి శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చెయ్యడానికి సంసిద్ధురాలైన మీదటే ఆమె హైదారాబాద్ వస్తున్నారు.
అమెరికన్ రియాలిటీ టెలివిజన్ పర్సనాలిటీ, మోడల్, ఆంట్రప్రెన్యూర్, సోషలైట్.. కైలీ జెన్నర్ అత్యంత ప్రమాదకరమైన ‘లిప్ చాలెంజ్’ని సోషల్ మీడియా మీదకు విసిరారు. చిన్న మూతి గల గాజు గ్లాసులలో, సీసాలలో పెదవులను చొప్పించి, వాటిని ఉబ్బించడమనే ఈ సాహసం విఫలమైతే పెదవులలోని రక్తనాళాలు ఉబ్బి, పెదవులు చిట్టి, రక్తం కారడమే కాకుండా, ఆ గాయం మానడానికి చాలా సమయం పడుతుంది కాబట్టే అదొక ప్రాణాంతకమైన సవాలుగా ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇరవై ఏళ్లకే తల్లి అయిన కైలీ జెన్నర్.. ఇంకా నడకైనా రాని తన ఐదు నెలల కూతురి కోసం 22 వేల డాలర్ల (15 లక్షల 17 వేల రూపాయలు) ఖరీదైన చెప్పుల్ని కొనడం కూడా మరొక విశేషం. ::: రాంచీలో ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’ నేతృత్వంలోని ‘నిర్మల్ హృదయ్’ హోమ్‌లో ఉంటున్న నన్.. సిస్టర్ కన్సీలియాను, అనిమా ఇంద్వార్ అనే ఒక సహాయకురాలిని పోలీసులు అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. హోమ్‌లోని ‘అవివాహిత తల్లుల వార్డు’కు పర్యవేక్షకురాలిగా ఉన్న సిస్టర్ కన్సీలియా.. హోమ్‌లో పుట్టిన ఒక శిశువును విక్రయించారన్న ఆరోపణలపై ఆమెతో పాటు, ఆమె సహాయకురాలిపై కేసు నమోదు అయింది ::: అమెరికాలో పుట్టిన స్విస్ సూపర్‌స్టార్ గాయని, గేయ రచయిత్రి, డాన్సర్, నటి, కథకురాలు 78 ఏళ్ల టీనా టర్నర్.. పుత్ర శోకంలో మునిగిపోయారు. రియల్ ఎస్టేట్ వ్యాపారిగా లాజ్ ఏంజెల్స్‌లో ప్రసిద్ధుడైన టీనా 59 ఏళ్ల కుమారుడు క్రెయిగ్ రేమండ్ దేహంలో బులెట్ దిగిన గాయం ఉండడంతో అతడు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు.
లాస్ వెగాస్‌లో ‘సూపర్ ఈటర్’గా ప్రఖ్యాతురాలైన మికీ సుడో అనే యువతి వరుసగా ఐదో ఏడాది కూడా ఆహార పోటీలలో విజేతగా నిలిచారు. ప్రసిద్ధ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్‌ల గొలుసు సంస్థ ‘నథాన్స్ ఫేమస్’ అమెరికా స్వాతంత్య్ర దినం అయిన జూలై 4న ఏటా నిర్వహించే ఈ ఈటింగ్ పోటీలలో ఈ ఏడాది.. పది నిముషాలలో 37 హాట్‌డాగ్స్, బన్స్ తిని టాప్ ప్రైజ్ గెలుచుకున్న మికీ సుడో గత ఏడాది 41 హాట్ డాగ్స్ లాగించారు ::: ప్రసిద్ధ వినియోగ వస్తూత్పత్తుల బహుళజాతి సంస్థ ‘యూనీలివర్’ చీఫ్ హెచ్.ఆర్. ఆఫీసర్ లీనా నాయర్ (49) నేతృత్వంలో ఆ కంపెనీ.. సామాజిక ప్రయోజనం కోసం ‘డిఫరబిలిటీ’ అనే డిజేబిలీటి కార్యక్రమాన్ని భారతదేశంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించబోతోంది. లీనా యూనీలివర్‌కు తొలి మహిళా చీఫ్ హెచ్.ఆర్. మాత్రమే కాదు, అతి చిన్న వయసులో ఈ స్థాయికి చేరుకున్న మహిళ కూడా ::: ట్రంప్ ‘జీరో టాలరెన్స్’ పాలసీలో భాగంగా అక్రమ వలసల నిఘా అధికారులు తల్లిదండ్రుల నుంచి వేరు చేసి నిర్బంధ శిబిరాలలో ఉంచిన బాలల సంఖ్య సుమారు మూడు వేల వరకు ఉందని తాజాగా ప్రకటించిన యు.ఎస్. హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్.. తొమ్మిది రోజుల క్రితం విడుదల చేసిన నివేదికలో ఆ సంఖ్య రెండు వేలు మాత్రమే ఉండడాన్ని బట్టి చూస్తే తల్లుల్నుంచి, పిల్లల్ని వేరు చేసే కార్యక్రమం మరింత ముమ్మరం అయిందని తెలుస్తోంది. (నిర్బంధ శిబిరం నుంచి 61 రోజుల తర్వాత విడుదలైన బిడ్డ, తన తల్లిని కలుసుకున్న దృశ్యాన్ని ‘తల్లీబిడ్డ’ అనే ఫొటోలో చూడవచ్చు).
Comments
Please login to add a commentAdd a comment