మూడేళ్ల పదవీకాలం ముగియడంతో గత ఏడాది సెప్టెంబర్‌లో ఎన్.సి.డబ్లు్య. (నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్) చైర్‌పర్సన్‌గా లలితా కుమారమంగళం తన పదవీ బాధ్యతల నుంచి వైదొలగినప్పటి నుంచీ, ఆ స్థానంలో అదనంగా విధులను నిర్వహిస్తూ వస్తున్న మహిళా కమిషన్ సభ్యురాలు రేఖాశర్మ (54) ఇప్పుడు పూర్తిస్థాయి ఎన్.సి.డబ్లు్య. చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. క్రైస్తవ సంఘాలలో కొన్నిచోట్ల ఉండే ‘ఒప్పుకోలు’ (కన్ఫెషన్) సంప్రదాయం మహిళల్ని బెదిరించడానికి ఒక ఉద్వేగ సాధనంగా దుర్వినియోగం అవుతోందని అంటూ, అందుకు ఉదాహరణగా కేరళలో జరిగిన ఒక ఘటనను నిదర్శనంగా చూపి, కన్ఫెషన్ సంప్రదాయాన్ని నిషేధించాలని రేఖాశర్మ వ్యాఖ్యానించడం ఇటీవల వివాదాస్పదం అయింది.
►ముంబైలోని ‘జిన్నా హౌస్’ వారసత్వ హక్కుల కోసం 2007 నుంచీ న్యాయపోరాటం చేస్తున్న ముహమ్మద్ అలీ జిన్నా కుమార్తె, ఆయన ఏకైక సంతానం అయిన డైనా వాడియా 2017 నవంబర్‌లో తన 98 యేట మరణించిన దాదాపు ఏడాది తర్వాత ఈ కేసును ఆమె తనయుడు నస్లీ వాడియా కొనసాగించడానికి ముంబై హైకోర్టు అనుమతించింది. దేశ విభజనకు పూర్వం 1936లో జిన్నా కట్టించిన ఈ ‘హౌస్’ను ఆయన స్మృత్యర్థం పాకిస్తాన్ కాన్సులేట్ ఆఫీసుగా మార్చుకునేందుకు అమ్మడం కానీ, లీజ్ ఇవ్వడం గానీ చేయాలని ఒకవైపు పాకిస్తాన్ ఏళ్లుగా అడుగుతుండగా.. హిందూ చట్టం ప్రకారం జిన్నా కూతురిగా జిన్నాహౌస్‌పై తనకు మాత్రమే హక్కు ఉందని డైనా వాడియా కోర్టును ఆశ్రయించారు.
►అసభ్యతను నియంత్రించే నెపంతో మహారాష్ట్ర ప్రభుత్వం ముంబైలో కనీసం ఒక్క డ్యాన్స్ బార్‌నైనా నడవనివ్వకపోవడం ‘నైతికనిఘా’కు (మోరల్ పోలీసింగ్) పాల్పడటమేనని సుప్రీంకోర్టు విమర్శించింది. ముద్దులకు, మానవ ‘కలయిక’కు సంకేతంగా సినిమాల్లో పూలను, పక్షులను చూపించే కాలం నాటి నుంచి అసభ్యతకు ఒక పరిణామక్రమంగా అర్థం మారిపోతూ వస్తున్నప్పుడు.. డ్యాన్స్ గర్ల్స్ చేసే నృత్యాలన్నిటినీ అసభ్యమైనవని తీర్మానించి, ఏ ఒక్క డ్యాన్స్‌బార్‌కూ అనుమతిని ఇవ్వకపోవడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది.
►35 ఏళ్ల కెన్యా–మెక్సికో సంతతి హాలీవుడ్ నటి లుపిటా న్యాంగో తొలిసారి తన జుట్టు గురించి బహిరంగంగా మాట్లాడారు. ‘‘నీ జుట్టు ఇలా ఉంటే నీకెవ్వరూ ఉద్యోగం ఇవ్వరనీ.. ఇంత అనాగరికంగా, ‘అరణ్యగోచరం’గా నువ్వెక్కడా నెగ్గుకు రాలేవని అంతా అనేవారు. ఇదంతా పడలేక నన్ను నేను దాచుకునే ప్రయత్నం చేసేదాన్ని. అప్పుడు మా అమ్మే నాకు ధైర్యం చెప్పింది. ‘సహజంగా వచ్చిన జుట్టును చూసుకుని గర్వపడాలే కానీ, సిగ్గు పడకూడదు’ అని చెప్పింది. హార్వీ వైన్‌స్టీన్ లైంగిక వేధింపుల గురించి నా అనుభవాలను బయటికి చెప్పుకున్నానంటే ఆ మనోబలం కూడా నాకు మా అమ్మ ఇచ్చిందే’’ అని ‘పోర్టర్’ మ్యాగజీన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో న్యాంగో వెల్లడించారు.
►ఇప్పటి వరకు కేవలం అత్యాచారం వల్ల ధరించిన గర్భానికో, లేక ప్రాణాంతక పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే అబార్షన్ చేయించుకునేందుకు అర్జెంటీనాలో చట్టపరమైన అనుమతి ఉండగా, వాటితో నిమిత్తం లేకుండా గర్భవిచ్ఛిత్తి (అబార్షన్) కి అనుమతి ఇవ్వాలని దేశవ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతమైన నేపథ్యంలో గురువారం నాడు అర్జెంటీనా సెనేట్ (ఎగువసభ) అబార్షన్ (చేయించుకునే హక్కు) బిల్లును తిరస్కరించింది. గత నెలలో దిగువసభలో ఆమోదం పొందిన ఈ బిల్లుకు ఇప్పుడు సెనేట్ కూడా సమ్మతి తెలిపి ఉంటే 14 వ వారం వరకు కూడా గర్భాన్ని తీయించుకునే హక్కు మహిళలకు లభించి ఉండేది.
►ఐక్యరాజ్య సమితిలోని ‘లైంగిక సమానత్వం’, ‘మహిళా సాధికారత’ల ప్రత్యేక విభాగాల సలహాదారు రవి కర్కారపై కనీసం ఎనిమిది మంది పురుషులు లైంగిక దుష్ప్రవర్తన ఆరోపణలు చేయడంతో ఆయన కోసం వేట మొదలైంది! ఈ వ్యక్తి ఎవరో తెలుసుకోవడం కోసం (అప్పటికి ఇతడేనని తెలియదు) గత ఏడాదిగా ‘యు.ఎన్. ఉమెన్ ప్లానెట్ 50–50 చాంపియన్స్’ అధికారులు ప్రయత్నిస్తుండగా.. ప్రస్తుతం సెలవులో ఉన్న రవి కర్కారే నిందితుడని బయపడటంతో పాటు, ఒక హోటల్ గదిలో అతడు తన కింది పురుష ఉద్యోగుల జననాంగాలను తాకడం, గిల్లడం వంటి అసభ్యకరమైన పనులు చేసినట్లు బాధితుల సాక్ష్యం వల్ల బహిర్గతమయింది.
►భారత మహిళా క్రికెట్ జట్టు ‘కోచ్’ పోస్టు కోసం మొత్తం 20 మంది దరఖాస్తు చేసుకోగా పురుష అభ్యర్థులతో పాటు వారిలో మహిళా జట్టు మాజీ కెప్టెన్ మమతా మాబెన్, సుమన్‌శర్మ (గతంలో పూర్ణిమా రావ్‌కు అసిస్టెంట్ కోచ్), మరియా ఫాహే (న్యూజిలాండ్ క్రికెటర్, ప్రస్తుతం గుంటూరు అకాడమీలో కోచ్) దరఖాస్తు చేసినవారిలో ఉన్నారు.
►హాలీవుడ్ చిత్రంలో అవకాశం రావడంతో చేతిలోని బాలీవుడ్ చిత్రం ‘భారత్’ను వదిలేసి వెళ్లిన ప్రియాంక చోప్రాకు.. మబ్బుల్లో నీళ్లు చూసి, ముంత ఒలకబోసుకున్నట్లయింది! క్రిస్ ప్రాట్ సరసన ‘కౌబాయ్ నింజా వైకింగ్’ చిత్రంలో నటించడానికి ప్రియాంక సిద్ధమౌతున్న తరుణంలో ఆ చిత్రాన్ని నిర్మిస్తున్న యూనివర్సల్ పిక్చర్స్.. స్క్రిప్టులో తలెత్తిన సమస్యల వల్ల చిత్రాన్ని వచ్చే ఏడాదికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది!
Comments
Please login to add a commentAdd a comment