పెప్సీ కంపెనీకి పన్నెండేళ్ల పాటు సేవలు అందించి, ఆ కంపెనీ సీఈవోగా ఈ ఏడాది అక్టోబర్ 2న పదవీ విరమణ పొంది, 2019 జనవరి వరకు ఛైర్మన్‌గా కొనసాగనున్న ఇంద్రా నూయి (62)ని న్యూయార్క్‌లోని ‘ఏషియా సొసైటీ’ అనే స్వచ్ఛంద సంస్థ ‘గేమ్ ఛేంజర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుతో సత్కరించింది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు కొందరు ‘‘పెప్సీ నుంచి బయటికి వచ్చేశారు కదా. ఇక ఇప్పుడు ట్రంప్ కేబినెట్‌లో చేరిపోతారా?’’ అని అడిగిన ఒక ప్రశ్నకు నూయీ పెద్దగా నవ్వుతూ.. ‘‘నేను కనుక రాజకీయాల్లోకి వస్తే మూడో ప్రపంచ యుద్ధం వచ్చినా రావచ్చు’’ అని అన్నారు. ‘‘పాలిటిక్స్‌కి నేను, నాకు పాలిటిక్స్ ఒకరికొకరం పడము. నేను అన్నీ బయటికే మాట్లాడేస్తాను. ఆచితూచి మాటల్ని వదల్లేను. అసలు దౌత్యం అంటే నాకు తెలీదు. నాలాంటి మనిషి రాజకీయాల్లోకి వచ్చిందంటే.. నా వల్ల మూడో ప్రపంచ యుద్ధం రావచ్చు. కనుక నేను రాజకీయాల్లోకి రాను’’ అని స్పష్టంగా చెప్పారు. నలభై ఏళ్ల పాటు రోజుకు 18 నుంచి 20 గంటలు పని చేసి, ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన మహిళల్లో ఒకరిగా ప్రఖ్యాతి చెందిన ఇంద్రా నూయి.. ‘‘ఇప్పుడు కొద్దిగా తీరిక దొరకడంతో.. విముక్తి పొందినట్లుగా ఉంది’’ అని అన్నారు. 1955 అక్టోబర్ 28న మద్రాసులో పుట్టిన ఇంద్రా కృష్ణమూర్తి.. ‘ఆమ్‌సాఫ్ట్ సిస్టమ్స్’ సంస్థ ప్రెసిడెంట్ రాజ్ కె.నూయిని వివాహం చేసుకున్నాక (1981) ఇంద్రా నూయి అయ్యారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. ప్రస్తుతం ఈ కుటుంబం కనెక్టికట్‌లోని గ్రీన్‌విచ్‌లో ఉంటోంది.
ఐక్యరాజ్యసమితి యు.ఎస్. రాయబారిగా ఈ ఏడాది చివర్లో తను రాజీనామా చేయబోతున్నట్లు రెండు రోజుల క్రితం అకస్మాత్తుగా ప్రకటించి, అందరినీ నివ్వెరపరచిన నిక్కీ హేలీ (46) స్థానంలోకి.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన కూతురు ఇవాంక ట్రంప్ (36) ను తీసుకోవచ్చని వస్తున్న వార్తల్ని స్వయానా ట్రంపే తోసిపుచ్చారు ‘‘డైనమైట్ లాంటి నా కూతురికి అది తగిన స్థానమే అయినప్పటికీ.. ఆమెను కనుక ఐరాస రాయబారిగా నియమిస్తే నాపై బంధుప్రీతి (నెపోటిజం) నింద పడుతుంది’’ అని ఆయన అన్నారు. ‘‘బహుశా నా కూతురికన్నా సమర్థమైన వాళ్లు ఆ స్థానానికి ఎవరూ లేకపోవచ్చు. అయినప్పటికీ నేను ఆమెను ఎంపిక చెయ్యడానికి సంశయిస్తాను. ఎందుకంటే మీరంతా రేపు నన్ను నిందించవచ్చు. నాకు నిజంగా లేని బంధుప్రీతిని మీరు నాకు అంటకట్టవచ్చు’’ అని ట్రంప్ మరికొంత వివరణ ఇచ్చారు. ఇవాంక కూడా.. తనకా పోస్టు పట్ల ఏమాత్రం ఆసక్తి లేదని ట్విట్టర్‌లో తెలిపారు.
ఒక్కోసారి ఓటమిని కన్నా గెలుపును తట్టుకోవడం కష్టం అవుతుందేమో. అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఏర్స్‌లో జరుగుతున్న 50 మీటర్ల ఉమెన్స్ స్విమ్మింగ్ ఫ్రీ స్టెయిల్ పోటీల్లో రజత పతకాన్ని గెలుచుకున్న అర్జెంటీనా క్రీడాకారిణి దెల్ఫియా నరెల్లా పిగ్నాటియల్లో తన విజయాన్ని తనే తట్టుకోలేక వలవల ఏడ్చేసింది. పతకం అందుకునే సమయంలో పెద్దగా ఏడుస్తూ ఆమె తన ఎడమ అర చేతిపై స్పెయిన్ భాషలో రాసుకున్న ‘గ్రాండ్‌మదర్’ అనే పదాన్ని, గుండె బొమ్మను అందరికీ చూపించడం ప్రేక్షకుల హృదయాన్ని టచ్ చేసింది.
దేశంలో పెరుగుతున్న ఆత్మహత్యల్ని నిరోధించడం కోసం బ్రిటన్ ప్రభుత్వం ‘ఆత్మహత్యల నివారణ మంత్రి’గా ఒక మహిళను నియమించింది. కొత్తగా సృష్టించిన ఈ శాఖను బ్రిటన్ ప్రధాని థెరిసా.. జాకీ డోయల్ ప్రైస్ అనే పార్లమెంటు సభ్యురాలికి కేటాయించారు. అనంతరం లండన్‌లో జరిగిన 50 దేశాల ప్రతినిధుల మానసిక ఆరోగ్య సదస్సులో డోయల్ ప్రసంగించారు. బ్రిటన్‌లో యేటా 4,500 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ సంఖ్యను గణనీయంగా తగ్గించడం కోసం తన శాఖ కృషి చేస్తుందని డోయల్ తెలిపారు.
స్త్రీలోక సంచారం
Published Fri, Oct 12 2018 12:05 AM | Last Updated on Fri, Oct 12 2018 12:05 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment