50 మీటర్ల మహిళల బ్యాక్ స్ట్రోక్ స్విమ్మింగ్‌లో ఇప్పటి వరకు ఉన్న 27 సెకన్ల ప్రపంచ రికార్డును.. ఇండోనేషియా రాజధాని జకార్తాలో ప్రస్తుతం జరుగుతున్న ‘ఏషియన్ గేమ్స్’లో 26.98 సెకన్లలో బ్రేక్ చేసిన 21 ఏళ్ల ల్యూ జియాంగ్.. చైనా దేశపు కొత్త ‘అందాల దేవత’గా అవతరించారు. ల్యూ జియాంగ్‌కి ప్రపంచంలోని టాప్ మోడల్స్‌లో ఒకరైన చైనా అందాల రాశి ల్యూ వెన్‌తో దగ్గరి పోలికలు ఉండడంతో.. ‘వీళ్లిద్దరూ అక్కాచెల్లెళ్లు కాదు కదా’ అంటూ ఆ దేశపు యువకులు.. ల్యూ జియాంగ్ బంగారు పతకం సాధించిన మరుక్షణం నుంచే ఆమెను ‘స్విమ్మింగ్ గాడెస్’గా ఆరాధించడం మొదలుపెట్టారు!
ఏషియన్ గేమ్స్‌లో గత ఇరవై ఏళ్లుగా మహిళల బ్యాడ్మింటన్ టీమ్ ఈవెంట్‌లో బంగారు పతకం కోసం నిరీక్షిస్తూ ఉన్న జపాన్ టీమ్.. 3–1 తేడాతో చైనాపై విజయం సాధించి వరుసగా గత ఐదు ఏషియన్ గేమ్స్‌లో విజేతగా నిలుస్తూ వస్తున్న చైనా జైత్రయాత్రను బ్రేక్ చేసింది! చైనాను ఆరవ టైటిల్ గెలవనివ్వకుండా చేసిన ఈ టీమ్ గేమ్‌లో జపాన్ క్రీడాకారిణి నోజోమి ఒకుహరా కీలక పాత్ర పోషించారు.
కెనడా మహిళ ఒకరు.. కారు పార్కింగ్ విషయంలో తలెత్తిన వాగ్వాదంలో ప్రవాస భారతీయుడైన రాహుల్ కుమార్ అనే వ్యక్తిని.. ‘‘పెంట మొహమోడా! నీ దేశానికి వెళ్లిపో. వెళ్లిపోరా దౌర్భాగ్యుడా.. పాకీ వాడా’’ (లూజర్, షిట్–కలర్డ్ స్కిన్, పాకీ.. గో బ్యాక్ టు యువర్ కంట్రీ) అని దూషించడం వివాదం అయింది. దీనిపై అక్కడి సి.టీవీ ప్రతినిధి.. ఆ మహిళతో.. ‘‘ఇవి జాతి, వర్ణ వివక్షలతో కూడిన వ్యాఖ్యలు కదా’’ అన్నప్పుడు.. ‘‘కోపంలో అలా అనేశాను తప్ప, నాకెలాంటి వివక్షలూ లేవు’’అని ఆమె సమాధానమిచ్చారు.
గుక్క పట్టి ఏడుస్తున్న ఒక పసిబిడ్డకు చనుబాలిచ్చి ఊరడించిన సెలెస్ట్ జాక్వెలీన్ అయాలా అనే సాధారణ పోలీసుకు అర్జెంటీనా ప్రభుత్వం పోలీసు అధికారిగా పదోన్నతి కల్పించింది. గస్తీ విధుల్లో భాగంగా జాక్వెలీన్.. తన వాహనంలో బెరిసో ప్రాంతంలోని ఆసుపత్రి సమీపానికి వచ్చినప్పుడు పౌష్టికాహార లేమితో ఆకలికి ఏడుస్తున్న బిడ్డ ఏడుపు వినిపించి, అక్కడికి వెళ్లి, ఆ ఏడుస్తున్నది.. తల్లి వదిలేసి వెళ్లిన బిడ్డ అని తెలుసుకుని, ఆసుపత్రి అధికారుల అనుమతితో ఆ బిడ్డకు తన స్థన్యం ఇచ్చి ఆకలి తీర్చడం స్థానికుల అభిమానానికి, పోలీసు ఉన్నతాధికారుల ప్రశంసలకు ఆమెను పాత్రురాలిని చేసింది.
నిండు గర్భిణి అయిన న్యూజిలాండ్ మహిళా సంక్షేమ శాఖ మంత్రి జూలీ యాన్ జెంటర్.. గత ఆదివారం పురుటి నొప్పులు వస్తుండగా తనే స్వయంగా సైకిల్ తొక్కుకుంటూ అక్కడికి కిలోమీటరు దూరంలో ఉన్న ఆసుపత్రికి వెళ్లి ఒక మగబిడ్డకు జన్మనిచ్చారు. ఎలాంటి హడావిడీ, అధికార ఆర్భాటమూ లేకుండా, నొప్పులొస్తున్నప్పుడు గర్భిణికి ఉండే సర్వసాధారణమైన భయాన్ని కూడా కనబరచకుండా ఆదర్శంగా నిలిచిన ఒక మంత్రి తనొక్కరే, అదికూడా సైకిల్ మీద పెడలింగ్ చేస్తూ వెళ్లి ఆసుపత్రిలో చేరడం ఆ దేశంలో ఇప్పుడొక విశేషం అయింది.
జెన్ సదావర్తె అనే పదేళ్ల బాలిక చూపిన సమయస్ఫూర్తి.. ముంబై దాదర్ ప్రాంతంలోని 17 అంతస్తుల నివాస భవనం ‘క్రిస్టల్ టవర్స్’లో బుధవారం జరిగిన ఘోర అగ్ని ప్రమాదం నుంచి అనేకమందిని కాపాడగలిగింది. డాన్ బాస్కో స్కూల్‌లో ఆరవ తరగతి చదువుతున్న జెన్.. మూడో తరగతిలో ఉండగా స్కూలు ప్రాజెక్టులో తను నేర్చుకున్న టిప్స్ కొన్నింటిని (ఉదా: దూది, నీళ్లు, గుడ్డ ముక్కలతో ప్యూరిఫయర్‌లను తయారు చేసి చుట్టూ ఉన్న వాళ్లకు ఇవ్వడం) గుర్తుపెట్టుకుని తాము ఉంటున్న 16ల అంతస్తులో ఉన్నవారందరికీ అందించడం ద్వారా మృతుల సంఖ్యను నాలుగుకు, గాయపడిన వారి సంఖ్యను పదహారుకు పరిమితం చేయగలిగింది.
నాలుగేళ్ల క్రితం.. 86 ఏళ్ల వయసులో జనవరి 13న గుండెపోటుతో మరణించిన తెలుగు సినీ నటీమణి అంజలీదేవి జయంతి నేడు. 1927లో ఇదే రోజు పెద్దాపురంలో ఆమె అంజనీకుమారిగా జన్మించగా, సినిమాల్లోకి వచ్చాక దర్శకులు పి. పుల్లయ్య ఆమె పేరును అంజలీదేవిగా మార్చారు. సంగీత దర్శకులు, నిర్మాత, గీత రచయిత అయిన పి.ఆదినారాయణ రావు ఆమె భర్త. అంజలీదేవి దాదాపు 500 తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించగా.. అనార్కలి, సువర్ణసుందరి, చెంచులక్ష్మి, జయభేరి.. వంటి చిత్రాలు ఆమెకు అవార్డులను తెచ్చిపెట్టాయి.
ూ ఇంట్లో ఒక్కతే ఉన్న గర్ల్‌ఫ్రెండ్ దగ్గరకు వెళ్లి ఆమెతో మాట్లాడుతూ కూర్చున్నప్పుడు.. బయటికి వెళ్లిన ఆమె తల్లిదండ్రులు ఆకస్మాత్తుగా తిరిగి రావడంతో, తనకు వేరే దారిలేక ఆ గర్ల్‌ఫ్రెండ్ బట్టల బీరువాలో దాక్కుని తలుపు వేసుకున్నానని, అయితే.. వస్తున్న తుమ్మును తను ఆపుకోలేకపోవడంతో గుట్టు బట్టబయలు అయినప్పటికీ, తన వినయ విధేయతలు వారికి నచ్చడంతో తనను ఏమీ అనలేదని బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ గుర్తు చేసుకున్నారు. వచ్చే శుక్రవారం విడుదల అవుతున్న హారర్ కామెడీ ఫిల్మ్ ‘స్త్రీ’ (ఇందులో సల్మాన్ నటించలేదు) ప్రమోషన్ షోలో భాగంగా ఆ చిత్రం హీరో హీరోయున్‌లు రాజ్‌కుమార్‌రావ్, శ్రద్ధాకపూర్‌లతో పై సంఘటనను సల్మాన్‌ఖాన్ షేర్ చేసుకున్నారు.
స్త్రీలోక సంచారం
Published Fri, Aug 24 2018 12:08 AM | Last Updated on Fri, Aug 24 2018 12:08 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment