►తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఈ నాలుగేళ్లలో మహిళల సమస్యలను పరిష్కరించలేకపోయిన అధికార టి.ఆర్.ఎస్.పార్టీ వైఫల్యాలను మహిళలే ఎండగట్టాలని మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన బి.జె.పి.మహిళా మోర్చా సమావేశంలో పిలుపునిచ్చిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్.. తెలంగాణ తొలి క్యాబినెట్‌లోనే మహిళలకు చోటు లేకపోవడం సిగ్గు చేటు అని అంటూ, ప్రధాని నరేంద్ర మోదీ.. దేశ రక్షణశాఖ మంత్రిగా, లోక్‌సభ స్పీకర్‌గా మహిళల్నే నియమించడాన్ని గుర్తు చేశారు. బి.జె.పి త్వరలోనే హైదరాబాద్‌లో ‘మహిళా సమ్మేళన్’ని నిర్వహించబోతోందని, కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ హాజరవుతున్నారని లక్ష్మణ్ తెలిపారు.
►కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ ఇచ్చే ప్రతిష్టాత్మకమైన ‘టెన్జింగ్ నార్గే నేషనల్ అవార్డ్ 2017’కు ఎంపికైన తెలంగాణ యువతి బొడ్డపాటి ఐశ్వర్యకు సీఎం కేసీఆర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. భారతీయ నావికాదళంలో లెఫ్ట్‌నెంట్ కమాండర్‌గా ఉన్న ఐశ్వర్య.. గతంలో నారీ శక్తి అవార్డు, నావ్‌సేన అవార్డులను కూడా పొందారు.
► చిత్తూరు జిల్లా నగరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రోజాపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన కృష్ణా జిల్లా పెనమలూరు టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌పై ఎఫ్.ఐ.ఆర్. నమోదు చెయ్యాలని మంగళవారం నాడు ఆదేశాలు జారీ చేసిన హైదరాబాద్ హైకోర్టు.. 2013 నాటి లలితా కుమారి కేసులో ఎఫ్.ఐ.ఆర్. నమోదు విషయమై సుప్రీంకోర్టు జారీ చేసిన నియమావళిని అనుసరించాలని కూడా ఈ సందర్భంగా పోలీసులకు సూచించింది. పత్రికా ప్రతినిధుల సమావేశంలో బోడె ప్రసాద్ అసభ్యకరమైన భాషలో తనను దూషించారని రెండు నెలల క్రితమే ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఇప్పటి వరకు అతడిపై ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయలేదని రోజా హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు అతడిపై ఎఫ్.ఐ.ఆర్. నమోదుకు ఆదేశించింది.
► కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ.. రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరుగుతున్న రెండవ ‘యూరేషియన్ ఉమెన్స్ ఫోరమ్’లో పాల్గొనేందుకు బుధవారం నాడు ఢిల్లీ నుంచి బయల్దేరి వెళ్లారు. తన రెండు రోజుల పర్యటనలో భాగంగా సోనియా మొదట.. ‘మహిళల భద్రత, నిరంతర అభివృద్ధి’ అనే అంశంపై జరిగే ప్లీనరీ సెషన్‌లో పాల్గొని, ఆ తర్వాత.. యువతీ యువకుల నుంచి మహిళా సంక్షేమానికి, అభివృద్ధికి అవసరమైన ఆలోచనలు స్వీకరించే చర్చావేదికలో ప్రసంగిస్తారు.
►జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లా, ఖాజీగండ్‌లో శనివారం నాడు జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించడానికి ముందు.. రెండేళ్ల క్రితమే తీవ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్‌లో చేరిన 16 ఏళ్ల జాహిద్ అహ్మద్ మిర్ అలియాస్ హషీమ్.. ఒక ఇంట్లో దాక్కుని ఉన్న తనను భద్రతాదళాలు చుట్టుముట్టి, ప్రాణాల మీద ఆశ ఉంటే లొంగిపొమ్మని హెచ్చరిస్తుండగా.. ఆ ఆఖరి నిమిషాల్లో అతడు తల్లికి ఫోన్ చేసి.. ‘‘అమ్మా నన్ను లొంగిపొమ్మంటున్నారు. ఏం చెయ్యమంటావు అని అడిగినప్పుడు ఆ తల్లి.. ‘‘వద్దు వద్దు.. తప్పించుకోగలిగితే తప్పించుకో. అంతే తప్ప లొంగిపోవాలన్న ఆలోచనలే రానీయకు’’ అని చెప్పిన ఆడియో టేప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత నెల బక్రీద్ రోజు ఫయాజ్ అహ్మద్ అనే పోలీస్ కానిస్టేబుల్ హత్యతో కూడా సంబంధం ఉన్న జాహిద్ అహ్మద్.. చనిపోయేముందు తన తల్లితో మాట్లాడిన ఫోన్ ఆడియో క్లిప్పును ఇప్పుడు కశ్మీర్‌లోని వేర్పాటువాదులు.. తల్లిదండ్రుల భావోద్వేగభరితమైన విజ్ఞప్తులకు తలవొగ్గి భద్రతాదళాలకు యువత లొంగిపోకుండా ఉండటం కోసం విస్తృత ప్రాచుర్యం కల్పిస్తున్నారు.
►తొలిసారి ప్రసవించినవారు ఆన్‌లైన్‌లో షేర్ చేసుకుంటున్న తమ భయానకమైన అనుభవాలను చదివి గర్భిణులలో ఎక్కువ శాతం మంది సహజమైన ప్రసవాన్ని కోరుకోవడానికి జంకుతున్నారని ఇంగ్లండ్‌లోని ‘యూనివర్సిటీ ఆఫ్ హల్’లో సీనియర్ ఫెలో రీసెర్చ్‌గా పని చేస్తున్న క్యాట్రియోనా జోన్స్.. గతవారం జరిగిన ‘బ్రిటిష్ సైన్స్ ఫెస్టివల్’లో ప్రసంగిస్తున్నప్పుడు వెల్లడించారు. ఈ ‘హారర్ స్టోరీలు’ చదివి ‘టోకోఫోబియా’కు గురవుతున్న ఎందరో గర్భిణులు సిజేరియన్‌లకు మొగ్గుచూపుతున్నారనీ, అయితే.. ఆన్‌లైన్‌లో భయానక అనుభవాలతో పాటు.. అరకొరగా ఉండే అహ్లాదకరమైన అనుభవాలనే తమకు వర్తించుకుని గర్భిణులు భయపడ్డం మానేయాలని, బిడ్డకు జన్మనివ్వడం అనేది మరీ అంత ప్రాణాంతకం ఏమీ కాదని జోన్స్ సలహా ఇస్తున్నారు.
► హాలీవుడ్ నటుడు, సినీ నిర్మాత, రెండు ఆస్కార్‌ల విజేత సీన్ పెన్ (58).. ‘మీ టూ’ ఉద్యమం.. సమాజంలో స్త్రీ, పురుషులను వేరు చేస్తోందనీ, వారి మధ్య అనుమానాలను, అపార్థాలను శత్రుత్వాన్ని పెంచి పోషిస్తోందనీ విమర్శించారు. అమెరికన్ ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీ ‘హులు’ నిర్మించి, ఈ నెల 14న ప్రారంభించిన ఎనిమిది ఎపిసోడ్‌ల అమెరికన్–బ్రిటిష్ డ్రామా వెబ్ టెలి
విజన్ సిరీస్ ‘ది ఫస్ట్’లో తన సహనటి నటాషా మెకెల్హోన్‌తో పాటు నటిస్తున్న సీన్ పెన్.. ఆ సీరియల్ కథలో అంగారక గ్రహానికి ప్రమాదకరమైన ప్రయాణం చేసే శక్తిమంతమైన మహిళల గురించి తమను ఇంటర్వ్యూ చేస్తున్న మీడియా ప్రతినిధులతో మాట్లాడుతుండగా ‘మీ టూ’ ప్రస్తావన వచ్చినప్పుడు తన వ్యక్తిగతమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
►బుధవారం (నిన్న) ఇండియా–పాకిస్తాన్ మధ్య దుబాయ్‌లోని స్పోర్ట్స్ క్లబ్‌లో ఆసియా కప్ క్రికెట్ వన్‌డే మ్యాచ్ మొదలవడానికి కొన్ని గంటల ముందు భారత టెన్నిస్ స్టార్, ఇప్పుడీ మ్యాచ్‌లో ఆడుతున్న పాకిస్తానీ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్ భార్య అయిన సానియా మీర్జా తన సోషల్ మీడియా అకౌంట్‌ల నుంచి సైన్ అవుట్ అయ్యారు! ‘‘ఇక ఈ ఆట మొదలయ్యాక ఆరోగ్యకరంగా ఉండే మనిషి కూడా సిక్ అవుతారు. అలాంటి ఉంటాయి సోషల్ మీడియాలో కామెంట్లు. పైగా ఒక గర్భిణికి అసలే అవసరం లేని కామెంట్స్ అవి. ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఇది మ్యాచ్ మాత్రమే’’ అని ట్విట్టర్‌లో ఒక పోస్ట్ పెట్టి అదృశ్యం అయిపోయారు సానియా.
Comments
Please login to add a commentAdd a comment