దాదాపు వందేళ్ల చరిత్ర కలిగిన యు.పి.లోని ఆలీఘర్ ముస్లిం యూనివర్సిటీ (ఎ.ఎం.యు.) తొలిసారిగా బాలికల హాకీ టీమ్‌ని జాతీయ స్థాయి పోటీలకు పంపించబోతోంది! ఇందుకోసం క్యాంపస్ పరిధిలోని పది స్కూళ్ల నుంచి బాలికల్ని ఎంపిక చేసి వారితో హ్యాకీ టీమ్‌ని సిద్ధం చేస్తోంది. అంతా సవ్యంగా జరిగితే కనుక వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఇంటర్–స్కూల్ కాంపిటిషన్‌కి ఎ.ఎం.యు. బాలికల తొట్టతొలి హాకీ జట్టు పోటీ పడుతుంది. సర్ సయ్యద్ హాల్ సమీపంలోని యూనివర్సిటీ క్రీడా మైదానంలో భారత అంతర్జాతీయ హాకీ జట్టు మాజీ క్రీడాకారుడు అనీస్ ఉర్ రెహ్‌మాన్ కోచింగ్‌లో ఈ జట్టు శిక్షణ పొందుతోంది. మైదానంలో వీళ్ల ప్రాక్టీస్‌ను చూసి సీనియర్ విద్యార్థినులు (డిగ్రీ) కూడా తరగతులు అయ్యాక సరదాగా హాకీ ఆడేందుకు హాస్టల్ వార్డెన్ నుంచి అనుమతి తీసుకోవడంతో క్యాంపస్ మునుపెన్నడూ లేని విధంగా బాలికలు, యువతుల హాకీ ఆటతో కళకళలాడుతోంది. ఆలీఘర్ ముస్లిం యూనివర్సిటీ 1920లో ప్రారంభం అయింది.
మహిళలకు లోక్‌సభలో, రాష్ట్రాల అసెంబ్లీలలో మూడింట ఒక వంతు స్థానాలలో రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ తీర్మానాన్ని ఆమోదించి భారతీయ జనతా పార్టీపై ఒత్తిడి పెంచాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దేశంలోని అన్ని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు, కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్న సంకీర్ణ రాష్ట్రాలకు లేఖలు పంపారు. 2019 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున ఈ అసెంబ్లీ సమావేశాలలోనే రిజర్వేషన్‌లను తీర్మానించి, ఆమోదం పొందాలని ఆయా రాష్ట్రాలను ఆయన కోరారు. ఇప్పటికే ఒడిశా, ఆంధ్రప్రదేశ్ ఈ విధమైన తీర్మానాలు చేశాయని ఆ లేఖలో ఆయన గుర్తు చేశారు. ‘‘193 దేశాలలోని పార్లమెంట్‌లలో ఉన్న మహిళల శాతంతో పోలిస్తే మన దేశం 148వ స్థానంలో ఉంది. అసెంబ్లీలలోనైతే ఈ స్థానం ఇంకా తక్కువ. స్థానిక సంస్థల్లో నయం. మహిళలు ఎక్కువమంది కనిపిస్తున్నారు. స్త్రీలకు సమాజపరంగా ఎదురయ్యే సవాళ్లకు కూడా వెరవకుండా గ్రామ సమస్యల్ని పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకోవాలి. రాజకీయాల్లో స్త్రీలకు సముచిత స్థానం లేకుండా ఏప్రజాస్వామ్య దేశమూ పూర్తిగా అభివృద్ధి చెందలేదు’’ అని డిసెంబర్ 6న రాసిన ఆ లేఖలో రాహుల్ అభిప్రాయపడ్డారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పటికీ లోక్‌సభలో పెండింగులో ఉంది. 2010లో రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందాక 15వ లోక్‌సభ రద్దయి 2014 ఎన్నికలు వచ్చాయి. ఆ తర్వాత కొత్త లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చే జరగలేదు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ చిన్న కూతుర్నని చెప్పుకున్న యువ డ్యాన్సర్ క్యాథరీనా తిఖోనోవా తొలిసారి రష్యా అధికార టీవీ చానల్‌లో ప్రత్యక్షమయ్యారు. గత గురువారం ఆ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన తండ్రి ఉక్కు సంకల్పం వెనుక ఉన్న మృదువైన కోణాల్ని ఆవిష్కరించారు. ‘‘పైకి కఠినంగా కనిపిస్తారు. కానీ ఆయన మనసు మెత్తనైనది’’ అని ఆమె ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. క్యాథరీనా ఇలా టీవీలో కనిపించడం, రష్యా అధ్యక్షుడి వ్యక్తిగత విషయాలను వెల్లడించడంతో గత ఇరవై ఏళ్లుగా మీడియాపై ఉన్న ఆంక్షలు కొద్దిగానైనా సడలినట్లయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. పుతిన్ ఆంతరంగిక జీవితం గురించి ఆ దేశంలోనే చాలామందికి తెలియదు.
‘పుతిన్ తాతగారు అయ్యారు’ అన్న వార్త మాత్రం గత ఏడాది దేశాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ వార్త అయినా ఆయనకై ఆయనే ఏదో సందర్భంలో బహిర్గతం చెయ్యడం వల్లనే బయటికి వచ్చింది. పుతిన్‌కి ఎందరో భార్యలు, మరెందరో ప్రియురాళ్లు ఉన్నారని ఒక వదంతి. పుతిన్ గతంలో గూఢచారి. తన కుటుంబ జీవితాన్ని కూడా ఆయన నిగూఢంగా ఉంచదలిచారేమో! ఇక క్యాథరీనా ఆయన సొంత కూతురేనా అనే దానిపై ఆ దేశంలో సందేహాలు ఇంకా మిగిలే ఉన్నాయి.
స్త్రీలోక సంచారం
Published Tue, Dec 11 2018 12:15 AM | Last Updated on Tue, Dec 11 2018 12:15 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment