కొరియాను కొట్టేసి... | ACT PIX: India set up China final after Harmanpreet brace | Sakshi
Sakshi News home page

కొరియాను కొట్టేసి...

Published Tue, Sep 17 2024 6:16 AM | Last Updated on Tue, Sep 17 2024 6:16 AM

ACT PIX: India set up China final after Harmanpreet brace

ఆరోసారి ఫైనల్లో భారత్‌

రెండు గోల్స్‌తో మెరిసిన కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌

నేడు చైనాతో టైటిల్‌ పోరు

మధ్యాహ్నం గం. 3:30 నుంచి సోనీ స్పోర్ట్స్‌ టెన్‌–1 చానెల్‌లో,  సోనీ లివ్‌ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం

ఆద్యంతం తమ ఆధిపత్యం కనబరిచిన భారత పురుషుల హాకీ జట్టు ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీ టైటిల్‌ను నిలబెట్టుకునేందుకు విజయం దూరంలో నిలిచింది. కెపె్టన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ మరోసారి జట్టును ముందుండి నడిపించగా... ఇతర ఆటగాళ్లు కూడా రాణించడంతో ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీలో భారత జైత్రయాత్ర కొనసాగుతోంది. 

లీగ్‌ దశలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన టీమిండియా నాకౌట్‌ దశ సెమీఫైనల్‌ మ్యాచ్‌లోనూ అదే జోరు కనబరిచింది. తనదైన రోజున ఎంతటి మేటి జట్టునైనా ఓడించే సత్తాగల దక్షిణ కొరియాతో జరిగిన సెమీఫైనల్‌ పోరులో భారత్‌ ఏకపక్ష విజయాన్ని అందుకుంది. 13 ఏళ్ల చరిత్ర కలిగిన ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీలో ఆరోసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. నేడు జరిగే టైటిల్‌ పోరులో చైనాతో భారత్‌ అమీతుమీ తేల్చుకుంటుంది.  

హులున్‌బుయిర్‌ (చైనా): డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాకు తగ్గట్టు ఆడిన భారత పురుషుల హాకీ జట్టు ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీలో అంతిమ సమరానికి అర్హత సాధించింది. సోమవారం జరిగిన సెమీఫైనల్లో హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ నాయకత్వంలోని భారత జట్టు 4–1 గోల్స్‌ తేడాతో దక్షిణ కొరియా జట్టును ఓడించింది. భారత్‌ తరఫున కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ రెండు గోల్స్‌ (19వ, 45వ నిమిషంలో) సాధించగా... ఉత్తమ్‌ సింగ్‌ (13వ నిమిషంలో), జర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (32వ నిమిషంలో) ఒక్కో గోల్‌ చేశారు. కొరియా జట్టుకు యాంగ్‌ జిహున్‌ (33వ నిమిషంలో) ఏకైక గోల్‌ అందించాడు. 

ఆరంభం నుంచే... 
అటాకింగ్‌ ఆటకు ప్రసిద్ధి అయిన కొరియాతో మ్యాచ్‌లో భారత్‌ పక్కా వ్యూహంతో ఆడింది. ప్రత్యర్థి జట్టుకు ఎదురుదాడులు చేసే అవకాశం ఇవ్వకుండా హర్మన్‌ప్రీత్‌ బృందం ఆరంభం నుంచే సమన్వయంతో ముందుకు కదులుతూ కొరియా గోల్‌పోస్ట్‌ లక్ష్యంగా దాడులు చేసింది. దాంతో భారత ఫార్వర్డ్‌ ఆటగాళ్లను నిలువరించడంపైనే కొరియా ఆటగాళ్లు ఎక్కువ దృష్టి పెటాల్సి వచి్చంది. ఆట నాలుగో నిమిషంలోనే భారత్‌ ఖాతా తెరిచేది. అభిషేక్‌ కొట్టిన రివర్స్‌ షాట్‌ను కొరియా గోల్‌కీపర్‌ కిమ్‌ జేహన్‌ నిలువరించాడు. ఆ తర్వాత కూడా భారత్‌ తమ దాడులు కొనసాగించగా 13వ నిమిషంలో ఫలితం వచి్చంది. అరిజిత్‌ సింగ్‌ హుండల్‌ అందించిన పాస్‌ను ‘డి’ ఏరియాలో అందుకున్న ఉత్తమ్‌ సింగ్‌ దానిని లక్ష్యానికి చేర్చాడు. ఆ తర్వాత కొరియా దూకుడు పెంచి నిమిషం వ్యవధిలో రెండు పెనాల్టీ కార్నర్‌లు సంపాదించింది. అయితే ఈ రెండింటిని భారత రక్షణపంక్తి ఆటగాళ్లు నిర్వీర్యం చేశారు. 

రెండో క్వార్టర్‌లో నాలుగు నిమిషాలు గడిచాక భారత్‌కు లభించిన తొలి పెనాల్టీ కార్నర్‌ను హర్మన్‌ప్రీత్‌ గోల్‌గా మలచడంతో భారత ఆధిక్యం 2–0కు పెరిగింది. మూడో క్వార్టర్‌లో సుమిత్‌ అందించిన పాస్‌ను సర్కిల్‌ బయట అందుకున్న జర్మన్‌ప్రీత్‌ సింగ్‌ ‘డి’ ఏరియాలోనికి వచ్చి కొరియా గోల్‌కీపర్‌ను బోల్తా కొట్టించడంతో భారత్‌ ఖాతాలో మూడో గోల్‌ చేరింది. ఈ గోల్‌ తర్వాత కొరియాకు దక్కిన పెనాల్టీ కార్నర్‌ను యాంగ్‌ జిహున్‌ లక్ష్యానికి చేర్చాడు. కొరియా ఖాతా తెరిచినప్పటికీ భారత్‌ తమ దాడులను యధేచ్చగా కొనసాగించింది. 45వ నిమిషంలో భారత్‌కు లభించిన పెనాల్టీ కార్నర్‌ను హర్మన్‌ గోల్‌గా మలిచాడు. దాంతో భారత ఆధిక్యం 4–1కు చేరుకుంది. మూడు గోల్స్‌ ఆధిక్యం పొందిన భారత్‌ ఆ తర్వాత నియంత్రణతో ఆడి కొరియాను కట్టడి చేసి విజయాన్ని ఖరారు చేసుకుంది. 

పాక్‌కు చైనా షాక్‌ 
అంతకుముందు జరిగిన తొలి సెమీఫైనల్లో ఆతిథ్య చైనా జట్టు అద్భుతం చేసింది. రెండుసార్లు చాంపియన్‌ పాకిస్తాన్‌ జట్టును మట్టికరిపించి తొలిసారి ఈ టోరీ్నలోఫైనల్‌కు చేరుకుంది. నిరీ్ణత సమయం ముగిసేసరికి రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్‌’ నిర్వహించగా పాకిస్తాన్‌ ఆటగాళ్లు వరుసగా నాలుగు షాట్‌లలో విఫలమయ్యారు. చైనా రెండు షాట్‌లను వృథా చేసినా మిగతా రెండు షాట్‌లను గోల్‌గా మలిచి 
చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది.   
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement