
గర్భిణులకు వరాలు , తక్కువ ప్రశ్నలు!
టెన్నిస్ సూపర్‌స్టార్ సెరెనా విలియమ్స్ టాప్‌లెస్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యక్షమై ఇంటర్నెట్‌లో సందేశం ఇచ్చారు. బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించడం కోసం సెరెనా తన రెండు వక్షోజాలపై చేతులను అడ్డుగా పెట్టుకుని, ‘ఐ టచ్ మైసెల్ఫ్’ అనే పాటను పాడుతూ తీసుకున్న వీడియోను ఆదివారం నాడు అప్‌లోడ్ చేసిన మొదటి పది గంటల్లోనే 10 లక్షల 30 వేల ‘వ్యూ’స్ వచ్చాయి! ఆస్ట్రేలియన్ పాప్ బ్యాండ్ ‘డీవైనల్స్’ 1991లో ‘బ్రెస్ట్ క్యాన్సర్ నెట్‌వర్క్ ఆస్ట్రేలియా’కు కోసం రాసిన హిట్ ‘ఐ టచ్ మైసెల్ఫ్’ నే ఆమె ఆలపించారు. ‘‘క్రమం తప్పకుండా బ్రెస్ట్‌లను చెక్ చేయించుకోవాలని మహిళలకు చెప్పడానికి నేను ఈ పాటను ఎంపిక చేసుకున్నాను. ఇలా టాప్‌లెస్‌గా నేనీ మాట చెప్పడం నాక్కొంత అసౌకర్యం కలిగించే విషయమే. అయితే నేను ఈ విషయంపై మాట్లాడాలనే అనుకున్నాను. శరీరవర్ణంతో నిమిత్తం లేకుండా ప్రపంచ మహిళలంతా ఎదుర్కొనడానికి అవకాశం ఉన్న సమస్య ఇది. తొలి దశలో గుర్తిస్తే ప్రాణాపాయం తప్పుతుంది’’ అని తన వీడియో కింద కామెంట్ పెట్టారు సెరెనా. ‘‘అమేజింగ్ సెరెనా! మీ అందమైన స్వరంతో ఈ సందేశం ఇవ్వడం ఎంతో బాగుంది’’ అని సోషల్ మీడియా ఆమెను ప్రశంసిస్తోంది. అక్టోబర్.. బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్‌నెస్ మంత్. ఈ నెలంతా ప్రపంచవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి.
సదస్సులు, సెమినార్లలో మహిళలు తక్కువగా ప్రశ్నిస్తారట! 10 దేశాల్లో జరిగిన 250 ఈవెంట్‌లలో పాల్గొన్న వారిపై అధ్యయనం జరిపి యు.కె.లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీ పరిశోధకులు ఈ విషయం కనిపెట్టారు. ఆ వివరాలను ‘ప్లస్ వన్’ అనే పత్రిక ప్రచురించింది. అసలు సెమినార్‌లలో పొల్గొనడంలోనే స్త్రీ పురుషుల మధ్య అంతరం చాలా ఎక్కువగా ఉందట. సెమినార్‌లకు వచ్చే ఆ కొద్దిమంది మహిళలు కూడా ప్రశ్నించేందుకు చొరవ చూపడంలేదని తమ అధ్యయనంలో స్పష్టమైందని పరిశోధకుల ప్రతినిధి అలేషియా కార్టర్ తమ నివేదికలో తెలిపారు. అకాడమీలలో జూనియర్ స్కాలర్‌లకు రోల్ మోడళ్లుగా మహిళలు ఎందుకు ఉండటం లేదని శోధించినప్పుడు అందుకు కారణంగా ఈ సంగతి (సెమినార్‌లలో మహిళలు తక్కువగా ప్రశ్నించే సంగతి) బయటపడిందట. ఈ పరిశోధకులు.. 20 దేశాలకు చెందిన 600 మంది స్త్రీ, పురుషుల్ని ప్రశ్నించారు. వీరిలో పోస్టుగ్రాడ్యుయేట్ విద్యార్థులు, ఫ్యాకల్టీ సభ్యులు ఉన్నారు. వీళ్లందరితో మాట్లాడినప్పుడు.. విద్యారంగ సదస్సులు, సెమినార్‌లలో పురుషులతో పోలిస్తే స్త్రీలు తక్కువ ప్రశ్నలు అడుగుతున్నట్లు తెలిసిందనీ, అయితే అందుకు కారణమేమిటో తెలియరాలేదని అలేషియా తమ గమనింపులకు ముగింపునిచ్చారు.
దేశంలోనే తొలిసారిగా అసోమ్ ప్రభుత్వం తేయాకు తోటల్లో పని చేసే గర్భిణులకు ఆర్థిక ప్రోత్సాహకాలను ప్రకటించింది. అంతేకాదు, ఆరో నెల నిండినప్పటి నుండీ, ప్రసవం అయ్యాక మూడు నెలల వరకు.. మొత్తం ఆరు నెలలు వారు పనికి రానవసరం లేదు. ఈ ఆరు నెలల కాలానికీ నేరుగా వాళ్ల ఇళ్లకే జీత భత్యాలు వెళతాయి. ఇక ప్రభుత్వం.. గర్భిణి ఒకరికి ప్రకటించిన ఆర్థిక సహాయం ఎంతంటే 12 వేలు! ఇదంతా ఆమె ఆరోగ్యం కోసం, బిడ్డ ఎదుగుదల కోసం అవసరమైన పౌష్టికాహారం తీసుకోడానికి, ఇతరత్రా అవసరాలకు. గర్భం దాల్చిన తొలి మూడు నెలల కాలానికి 2 వేలు, తర్వాతి మూడు నెలలకు 4 వేలు, ఆసుపత్రిలో డెలివరీ సమయానికి 3 వేలు, బిడ్డ జననాన్ని నమోదు చేయించేటప్పుడు 3 వేలు.. ఇలా నాలుగు విడతలుగా పై మొత్తాన్ని అందచేస్తారు. ఇది కాకుండా.. ఆ గర్భిణి కనుక ఇద్దరు పిల్లల నియంత్రణ పాటిస్తే, 18 ఏళ్ల తర్వాత మాత్రమే ఆమె తల్లి అయితే, ఇంట్లో కాకుండా ఆసుపత్రిలో మాత్రమే కాన్పు జరిపించుకుంటే, పని చేస్తున్న తేయాకు తోటల్లోనే నివాసం ఉంటున్నట్లయితే, భారతీయ పౌరురాలైతే.. అదనంగా మరికొన్ని సదుపాయాలను, వసతులను ప్రభుత్వం కల్పిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment