నవ్‌జ్యోత్‌సింగ్ సిద్ధూ భార్య నవ్‌జ్యోత్ కౌర్.. అమృత్‌సర్ రైలు దుర్ఘటన కేసు నుంచి నిరపరాధిగా బయపడ్డారు. దసరా సందర్భంగా ఈ ఏడాది అక్టోబర్ 19న అమృత్‌సర్ సమీపంలోని రైల్వేట్రాక్ మీద గుంపుగా నిలబడి రావణకాష్టాన్ని తిలకిస్తున్న వారి మీదుగా లోకల్ ట్రైన్ దూసుకెళ్లడంతో 60 మంది మరణించారు. ఆ ఘటనలో.. రావణుడి దిష్టిబొమ్మను దగ్ధం చేసే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తూర్పు అమృత్‌సర్ అసెంబ్లీ నియోజవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే నవ్‌జ్యోత్ కౌర్‌తో పాటు, ఇతర నాయకుల పైన కేసులు నమోదయ్యాయి. నిర్వాహకుల అలక్ష్యం తప్ప, ఇందులో కౌర్ బాధ్యతారాహిత్యం ఏమీ లేదని తాజా నివేదిక తేల్చింది. కౌర్ భర్త సిద్ధూ కాంగ్రెస్ పాలనలోని పంజాబ్‌లో రాష్ట్ర మంత్రిగా ఉన్నారు.
ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎం.పి. సావిత్రీబాయి ఫూలె పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి రాజీనామా చేశారు. బీజేపీ అనుసరిస్తున్న దళిత వ్యతిరేక ధోరణికి, విభజన రాజకీయాలకు విసిగి వేసారి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె ప్రకటించారు. ఎంపీగా మాత్రం పదవీకాలం పూర్తయ్యే వరకు ఆమె కొనసాగుతారు. ఫూలే బి.ఎస్.బి. సెక్టార్ కోఆర్డినేటర్‌గా 2002లో రాజకీయాల్లోకి వచ్చారు. 2012లో బి.జె.పి.లో చేరారు. ఆ ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో బల్హా ఎమ్మేల్యేగా ఎన్నికయ్యారు. 2014లో బారైచ్ ఎంపీగా విజయం సాధించారు. రెండు రోజుల క్రితం డిసెంబర్ 6న అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. విగ్రహాలకు, ఆలయాలకు ప్రభుత్వ ఆర్థిక వనరుల్ని దుబారా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దళితున్న సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని సావిత్రీబాయి ఫూలే విమర్శించారు.
అంటార్కిటిక్ సముద్రంలో చెలరేగిన తుఫాను వల్ల దారి తప్పిన ఒంటరి బ్రిటిష్ నావికురాలు ఒకరిని చిలీ అధికారులు రక్షించారు. సూసీ గుడ్‌ఆల్ అనే ఆ సాహస యాత్రికురాలిని కేప్ హార్న్‌కు 2000 నాటికల్ మైళ్ల దూరంలో గుర్తించి సురక్షితంగా, భద్రంగా దక్షిణమెరికా ఒడ్డుకు చేర్చారు. అప్పటికి రెండు రోజులుగా ఆ కల్లోల సముద్రంలో ధైర్యంగా నిలదొక్కుకుని ప్రపంచంతో ఆమె కమ్యూనికేషన్ ఏర్పచుకోగలిగారు.
Comments
Please login to add a commentAdd a comment