
చండీగఢ్ : ఈ ఏడాది విజయదశమి వేడుకల సందర్భంగా అమృత్‌సర్‌లో ఏర్పాటు చేసిన ‘రావణ దహనం’ కార్యక్రమంలో ఘోర ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. రైల్వే ట్రాక్ పక్కన రావణ దహనం నిర్వహిస్తుండగా పట్టాలపై నిల్చుని వీక్షిస్తున్న వారిపై రైలు దూసుకెళ్లడంతో సుమారు 61 మంది మరణించగా.. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ కార్యక్రమాన్ని అధికార పార్టీకి సంబంధించిన నాయకులు నిర్వహించడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించింది. కాగా ఇందుకు సంబంధించిన 300 పేజీల నివేదికను అధికారులు రూపొందించారు.
సిద్ధు దంపతులకు సంబంధం లేదు..
అమృత్‌సర్‌లో జరిగిన ప్రమాదానికి రైల్వే అధికారులు- పోలీసులు, అమృత్‌సర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం, నిర్వాహకుల బాధ్యతారాహిత్యం కారణంగానే అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారని నివేదికలో పేర్కొన్నారు. అదే విధంగా సౌరభ్ మిథు మదన్ అనే వ్యక్తి ఈ కార్యక్రమం నిర్వహించడానికి అనుమతి పొందాడు గానీ, అందుకు సంబంధించి సరైన ఏర్పాట్లు మాత్రం చేయలేకపోయాడని తెలిపింది. అయితే సౌరభ్ మిథు పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధుకు సన్నిహితుడు కావడం, రావణ దహన కార్యక్రమానికి సిద్ధు భార్య, మాజీ ఎమ్మెల్యే నవజోత్ కౌర్ హాజరుకావడంతో వీరిపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. సిద్ధు దంపతుల పేరు చెప్పి ఈ కార్యక్రమానికి మిథు అధిక సంఖ్యలో జనాలను పోగు చేసి వారి మరణానికి కారణమయ్యాడనే వాదనలూ వినిపించాయి. (‘మేడమ్..! 500 ట్రైన్‌లు వచ్చినా భయపడరు’)
ఈ నేపథ్యంలో ఈ ఘటనతో సిద్ధు దంపతులకు ఏమాత్రం సంబంధం లేదని, ముఖ్య అతిథిగా హాజరైనంత మాత్రాన నవజ్యోత్ కౌర్ ఈ ఘటనకు బాధ్యురాలు కాదంటూ నివేదిక క్లీన్ చిట్ ఇచ్చింది. ఇక.. ఈ ఘటనపై గతంలో విచారణ జరిపిన రైల్వే సెక్యూరిటీ చీఫ్ కమిషనర్.... కార్యక్రమానికి వీక్షించడానికి వచ్చిన సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించునందు వల్లే ప్రాణాలు కోల్పోయారని, తమకు ఎటువంటి సంబంధం లేదని నివేదిక ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment