Navjot Kaur Sidhu
-
మళ్లీ బీజేపీలోకి వెళ్లరు.. అవన్నీ వదంతులు
చండీగఢ్: మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ మళ్లీ బీజేపీలో చేరతారని వస్తున్న వార్తలను ఆయన సతీమణి నవజ్యోత్ కౌర్ తోసిపుచ్చారు. ఇవి వదంతులు మాత్రమే అంటూ కొట్టిపారేశారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని, ఇక నుంచి సామాజిక కార్యకర్తను మాత్రమే అంటూ కౌర్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఈ ఊహాగానాలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకి వచ్చిన కౌర్ ఈ వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తన శాఖను మార్చడంతో జూలైలో మంత్రి పదవికి సిద్ధూ రాజీనామా చేశారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య దూరం పెరిగింది. అయితే అమరీందర్‌తో తమకు ఎటువంటి విభేదాలు లేవని కౌర్ తెలిపారు. కాంగ్రెస్‌లో ఉన్నవారే వివాదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఎటువంటి గ్రూపులు పెట్టలేదని, తన భర్తకు ప్రచార యావ లేదన్నారు. అమృత్సర్ ఈస్ట్ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యేగా సిద్ధూ సేవలు కొనసాగిస్తారని చెప్పారు. ఉప ఎన్నికల్లో సిద్ధూ ఎందుకు ప్రచారం చేయలేదని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇవ్వలేదు. తాను మళ్లీ బీజేపీకి వెళతానని వస్తున్న వార్తలపై నవజ్యోత్ సిద్ధూ ఇప్పటివరకు స్పందించలేదు. -
ఆ ప్రమాదంతో సిద్ధు దంపతులకు సంబంధం లేదు!
చండీగఢ్ : ఈ ఏడాది విజయదశమి వేడుకల సందర్భంగా అమృత్‌సర్‌లో ఏర్పాటు చేసిన ‘రావణ దహనం’ కార్యక్రమంలో ఘోర ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. రైల్వే ట్రాక్ పక్కన రావణ దహనం నిర్వహిస్తుండగా పట్టాలపై నిల్చుని వీక్షిస్తున్న వారిపై రైలు దూసుకెళ్లడంతో సుమారు 61 మంది మరణించగా.. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ కార్యక్రమాన్ని అధికార పార్టీకి సంబంధించిన నాయకులు నిర్వహించడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించింది. కాగా ఇందుకు సంబంధించిన 300 పేజీల నివేదికను అధికారులు రూపొందించారు. సిద్ధు దంపతులకు సంబంధం లేదు.. అమృత్‌సర్‌లో జరిగిన ప్రమాదానికి రైల్వే అధికారులు- పోలీసులు, అమృత్సర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం, నిర్వాహకుల బాధ్యతారాహిత్యం కారణంగానే అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారని నివేదికలో పేర్కొన్నారు. అదే విధంగా సౌరభ్ మిథు మదన్ అనే వ్యక్తి ఈ కార్యక్రమం నిర్వహించడానికి అనుమతి పొందాడు గానీ, అందుకు సంబంధించి సరైన ఏర్పాట్లు మాత్రం చేయలేకపోయాడని తెలిపింది. అయితే సౌరభ్ మిథు పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధుకు సన్నిహితుడు కావడం, రావణ దహన కార్యక్రమానికి సిద్ధు భార్య, మాజీ ఎమ్మెల్యే నవజోత్ కౌర్ హాజరుకావడంతో వీరిపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. సిద్ధు దంపతుల పేరు చెప్పి ఈ కార్యక్రమానికి మిథు అధిక సంఖ్యలో జనాలను పోగు చేసి వారి మరణానికి కారణమయ్యాడనే వాదనలూ వినిపించాయి. (‘మేడమ్..! 500 ట్రైన్లు వచ్చినా భయపడరు’) ఈ నేపథ్యంలో ఈ ఘటనతో సిద్ధు దంపతులకు ఏమాత్రం సంబంధం లేదని, ముఖ్య అతిథిగా హాజరైనంత మాత్రాన నవజ్యోత్ కౌర్ ఈ ఘటనకు బాధ్యురాలు కాదంటూ నివేదిక క్లీన్ చిట్ ఇచ్చింది. ఇక.. ఈ ఘటనపై గతంలో విచారణ జరిపిన రైల్వే సెక్యూరిటీ చీఫ్ కమిషనర్.... కార్యక్రమానికి వీక్షించడానికి వచ్చిన సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించునందు వల్లే ప్రాణాలు కోల్పోయారని, తమకు ఎటువంటి సంబంధం లేదని నివేదిక ఇచ్చారు. -
‘మేడమ్..! 500 ట్రైన్లు వచ్చినా భయపడరు’
-
‘మేడమ్..! 500 ట్రైన్లు వచ్చినా భయపడరు’
అమృత్సర్ : విజయదశమి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ‘రావణ దహనం’ కార్యక్రమంలో శుక్రవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. రావణ దహనాన్ని వీక్షిస్తున్న వందలాది మంది రైల్వే ట్రాక్‌పైకి రావడంతో రైలు ఢీకొని 61 మంది మరణించగా.. మరెంతో మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పంజాబ్ మాజీ మంత్రి నవజోత్ కౌర్ సిద్దూ పాల్గొన్నారు. అయితే, రైలు ప్రమాదానికి కొన్ని నిముషాల ముందు కార్యక్రమ నిర్వాహకులు ఆమెతో చెప్పిన కొన్ని మాటలు సంచలనం రేపుతున్నాయి. ‘మేడమ్..! చూడండి కార్యక్రమంలో భాగం కావడానికి ఎంతమంది వచ్చారో. అయిదువేల మంది రైల్వే ట్రాక్‌లను లెక్కచేయకుండా కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. 500 ట్రైన్లు వచ్చినా వాళ్లు భయపడరు’అంటూ ఒకరు వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి ‘ఘనంగా’ పండుగ చేశారని కార్యక్రమ నిర్వాహకులపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కారకులు.. కారులో పరార్..! ఇదిలా ఉండగా.. నిర్వాహకుల అజాగ్రత్తతోనే ప్రజలు రైల్వే ట్రాక్‌పైకి వచ్చారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అనుమతి లేకుండా రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహించారనీ, కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే రైలు ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్తున్నారు. అయితే, ప్రమాదం జరిగిన వెంటనే కార్యక్రమ నిర్వాహకుడు సౌరభ్మదన్ మిట్టు తన తండ్రితో కలిసి పరారయ్యాడు. ఈ దృశ్యాలు అతని ఇంటి సమీపంలోని సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయని పోలీసులు వెల్లడించారు. కాగా, ప్రమాదం జరిగి రెండు రోజులైనా నిందితుడు సౌరభ్మదన్ ఆచూకీ లభ్యం కాకపోవడంతో బాధిత కుటుంబాల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుని ఇంటిపై దాడి చేసి కిటీకీలు ధ్వంసం చేశారు. -
సిద్ధూ మెలిక, చేరిక ఆలస్యం..?
చండీగఢ్: కాంగ్రెస్ పార్టీలో నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఎప్పుడు చేరతారనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. సిద్ధూ చేరికకు తేదీ ఖరారు కాలేదని, మంచి ముహూర్తం చూసుకుని చేరతారని ఆయన సతీమణి నవజ్యోత్ కౌర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీలోకి సిద్ధూ రావాలని రాహుల్ గాంధీ కోరుకుంటున్నారని చెప్పారు. పంజాబ్ కు సేవ చేయాలన్నదే తమ లక్ష్యమని, తామిద్దరిలో ఎవరో ఒకరమే పోటీ చేస్తామనిమని వెల్లడించారు. మరోవైపు సీట్ల కేటాయింపుపై స్పష్టత రాకపోవడం వల్లే సిద్ధూ చేరిక ఆలస్యమవుతోందని వార్తలు వస్తున్నాయి. తాము ఎటువంటి షరతులు విధించకుండానే కాంగ్రెస్ తో చేతులు కలిపామని కౌర్ చెబుతున్నపటికీ అంతర్గతంగా పలు డిమాండ్లు చేసినట్టు సమాచారం. కెప్టెన్ అమరీందర్ సింగ్ ఖాళీ చేసిన అమృతసర్ పార్లమెంట్ స్థానంతో పాటు తమకు నాలుగైదు అసెంబ్లీ సీట్లు కేటాయించాలని సిద్ధూ పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తనకు ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలని సిద్ధూ అడిగినట్టు సమాచారం. దీనిపై మాట్లాడేందుకు అమరీందర్ సింగ్ నిరాకరించారు. -
ఆత్మ లేకుండా దేహం ఉంటుందా?
న్యూఢిల్లీ: పంజాబ్‌కు చెందిన మాజీ క్రికెటర్ సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కెప్టెన్ అమరీందర్ సింగ్ పార్టీ కండువాతో కౌర్ కు స్వాగతం పలికారు. మాజీ ఒలింపియన్, అకాలీదళ్ మాజీ ఎమ్మెల్యే ప్రగత్ సింగ్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కౌర్ భర్త నవజ్యోత్ సింగ్ సిద్ధూకు కూడా గాలం వేస్తున్నారా అని ఈ సందర్భంగా అమరీందర్ సింగ్ ను అడగ్గా... కౌర్ ఇక్కడ ఉంటే, సిద్ధూ ఆమె వెనుక నిలబడకుండా ఉండగలరా అని ఎదురు ప్రశ్నించారు. అమరీందర్ నుంచి కౌర్ మైకు తీసుకుని ‘మా దేహాలు వేరైనా ఆత్మ ఒక్కటే. ఆత్మ లేకుండా దేహం ఉండలేదు. సిద్ధూ కూడా కాంగ్రెస్ లో చేరతార’ని సమాధానం ఇచ్చారు. ఈ మధ్యే బీజేపీ నుంచి బయటకు వచ్చిన సిద్ధూ ఆవాజ్–ఎ–పంజాబ్ పార్టీని స్థాపించడం తెలిసిందే. వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున సిద్ధూ ముఖ్య ప్రచారకుడిగా వ్యవహరిస్తారన్న వార్తలు కూడా వస్తున్నాయి. -
ఊహాగానాల నడుమ సిద్ధు భార్య కూడా...!
న్యూఢిల్లీ: క్రికెటర్, రాజకీయ నాయకుడు నవజోత్ సింగ్ సిద్ధు దారిలోనే సాగుతూ ఆయన భార్య నవజోత్ కౌర్ సిద్ధు కూడా బీజేపీకి రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను బీజేపీ ఆమోదించింది. బీజేపీకి ఇటీవల సిద్ధు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. నామినేటెడ్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన.. ఆ పదవికి రాజీనామా చేసి.. ఆ తర్వాత కమలానికి గుడ్‌బై చెప్పారు. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీలో సిద్ధు చేరవచ్చునని ఊహాగానాలు వచ్చాయి. అయితే, తనకు భజనచేసే వ్యక్తులను కేజ్రీవాల్ పార్టీలోకి చేర్చుకుంటున్నారని చెప్తూ ఆయన సొంత కుంపటి పెట్టుకున్నారు. ఆవాజ్ ఏ పంజాబ్ పేరిట ఓ వేదికను ఏర్పాటు చేసిన ఆయన.. కాంగ్రెస్ పార్టీలో చేరాలంటూ వచ్చిన ఆఫర్‌ను కూడా తిరస్కరించారు. మొదట ఎన్నికలకు దూరంగా ఉంటానని చెప్పిన సిద్ధు.. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ మళ్లీ రాజకీయంగా పావులు కదుపుతున్నారు. ఆప్‌లో సిద్ధు చేరవచ్చునని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీకి సిద్ధు భార్య రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
మా ఆయనకు కాంగ్రెస్ మ్యాచ్ కాదు
చండీగఢ్: బీజేపీకి గుడ్ బై చెప్పిన మాజీ ఎంపీ, టీమిండియా మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధు ఏ పార్టీలో చేరాలో తేల్చుకోలేక సందిగ్ధంలో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌లు తమ పార్టీలోకి రావాల్సిందిగా సిద్ధును ఆహ్వానించాయి. ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను సిద్ధు ఇదివరకే కలసి చర్చించారు. కాగా ఆయన ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. సిద్ధు భార్య, ఎమ్మెల్యే అయిన నవ్‌జ్యోత్ కౌర్ సిద్ధు మాత్రం కాంగ్రెస్ పార్టీ తమకు సరైన రాజకీయ గమ్యస్థానం కాదని, ఆ పార్టీలో చేరాలని తాను భావించడంలేదని స్పష్టం చేశారు. దీంతో సిద్ధు దంపతులకు ఇక మిగిలున్న ప్రత్యామ్నాయం ఆమ్ ఆద్మీ పార్టీయే. ఈ నెల 15న ఆప్‌లో సిద్ధు చేరనున్నట్టు వార్తలు వచ్చాయి. కాగా సిద్ధు డిమాండ్లకు ఆప్ నేతలు అంగీకరించకపోవడంతో వాయిదా పడినట్టు వార్తలు వచ్చాయి. కౌర్ ఆమ్ ఆద్మీ పార్టీని ప్రశంసిస్తూనే, ఆ పార్టీకి తన భర్త సిద్ధు అవసరముందన్నారు. ఆప్ మేనిఫెస్టో బాగుందని, పార్టీని నడిపించాలంటే సమర్థుడైన నాయకుడు అవసరమని చెప్పారు. వచ్చే ఏడాది జరిగే పంజాబ్ ఎన్నికల్లో ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో నిలవాలని సిద్ధు భావిస్తున్నారు. అలాగే తనతో పాటు తన భార్యకు కూడా పోటీచేసేందుకు ఆప్ టికెట్ ఇవ్వాలని కోరారు. కాగా ఎన్నికల్లో పోటీచేసేందుకు ఓ కుటుంబంలో ఒకరికి మించి అవకాశం ఇవ్వరాదన్నది ఆప్ నిబంధన. సిద్ధు చేరికకు ఇదే అడ్డంకిగా మారింది. -
మా ఆయన పార్టీని వీడరు
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ నేత నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధు పార్టీ మారుతారంటూ వచ్చిన వార్తలను ఆయన భార్య, బీజేపీ ఎమ్మెల్యే నవ్‌జ్యోత్ కౌర్ సిద్ధు తోసిపుచ్చారు. తన భర్త బీజేపీని వీడరని స్పష్టం చేశారు. బీజేపీ సీనియర్ నేతలను నిరంతరం సంప్రదిస్తున్నారని కౌర్ చెప్పారు. వేరే పార్టీ నేతలను కలిసే ఆలోచన సిద్ధుకు లేదని ఆయన భార్య తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏ నాయకుడితోనూ ఆయన సమావేశం కాలేదని చెప్పారు. సిద్ధును రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేసే విషయాన్ని బీజేపీ పరిశీలిస్తుందా అన్న ప్రశ్నకు పార్టీ ఏ పదవి ఇచ్చినా బాధ్యతగా పనిచేస్తారని అన్నారు. సిద్ధు ఆప్‌లో చేరే అవకాశముందని ఇటీవల వార్తలు వస్తున్న నేపథ్యంలో కౌర్ స్పందించారు.