చండీగఢ్: కాంగ్రెస్ పార్టీలో నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఎప్పుడు చేరతారనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. సిద్ధూ చేరికకు తేదీ ఖరారు కాలేదని, మంచి ముహూర్తం చూసుకుని చేరతారని ఆయన సతీమణి నవజ్యోత్ కౌర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీలోకి సిద్ధూ రావాలని రాహుల్ గాంధీ కోరుకుంటున్నారని చెప్పారు. పంజాబ్ కు సేవ చేయాలన్నదే తమ లక్ష్యమని, తామిద్దరిలో ఎవరో ఒకరమే పోటీ చేస్తామనిమని వెల్లడించారు.
మరోవైపు సీట్ల కేటాయింపుపై స్పష్టత రాకపోవడం వల్లే సిద్ధూ చేరిక ఆలస్యమవుతోందని వార్తలు వస్తున్నాయి. తాము ఎటువంటి షరతులు విధించకుండానే కాంగ్రెస్ తో చేతులు కలిపామని కౌర్ చెబుతున్నపటికీ అంతర్గతంగా పలు డిమాండ్లు చేసినట్టు సమాచారం. కెప్టెన్ అమరీందర్ సింగ్ ఖాళీ చేసిన అమృతసర్ పార్లమెంట్ స్థానంతో పాటు తమకు నాలుగైదు అసెంబ్లీ సీట్లు కేటాయించాలని సిద్ధూ పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తనకు ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలని సిద్ధూ అడిగినట్టు సమాచారం. దీనిపై మాట్లాడేందుకు అమరీందర్ సింగ్ నిరాకరించారు.