సిద్ధూ జాక్ పాట్!
చండీగఢ్: మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ జాక్ పాట్ కొట్టారు. అమృత్ సర్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన ఘన విజయం సాధించారు. బీజేపీ నుంచి బయటకు వచ్చిన ఆయన ఎటువైపు వెళతారనే దానిపై ఎన్నికలకు ముందు చాలా చర్చ జరిగింది. చివరకు ఆయన గెలుపు గుర్రంవైపే అడుగులు వేశారు.
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో చేరందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో సొంతంగా ఆవాజ్–ఎ–పంజాబ్ పార్టీని స్థాపించారు. అయితే సొంత పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సమయం సరిపోదన్న ఆలోచనతో ఆయన తెలివిగా అడుగులు వేశారు. అకాలీదళ్-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్న విషయం గ్రహించి కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపారు. సిద్ధూ చేరికతో కాంగ్రెస్ పార్టీకి అదనపు బలం చేకూరినట్టైంది. ఇంతకుముందు తన భార్య నవజ్యోత్ కౌర్ పోటీ చేసిన అమృత్ సర్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగి భారీ విజయాన్ని అందుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం కావడంతో ఆయనకు కీలక పదవి దక్కే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. ఉప ముఖ్యమంత్రి ఇవ్వొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పంజాబ్ విజయాన్ని రాహుల్ గాంధీకి కానుకగా ఇస్తామని ఎన్నికల ముందు చెప్పిన సిద్ధూ మాట నిలబెట్టుకున్నారు. ఉప ముఖ్యమంత్రి ఎవరనేది రాహుల్ గాంధీ చెబుతారని అమరీందర్ సింగ్ ప్రకటించడంతో సిద్ధూకు డిప్యూటీ సీఎం పదవి దక్కడం ఖాయమన్న ప్రచారం మొదలైంది.