మా ఆయనకు కాంగ్రెస్ మ్యాచ్ కాదు
చండీగఢ్: బీజేపీకి గుడ్ బై చెప్పిన మాజీ ఎంపీ, టీమిండియా మాజీ క్రికెటర్ నవ్జ్యోత్ సింగ్ సిద్ధు ఏ పార్టీలో చేరాలో తేల్చుకోలేక సందిగ్ధంలో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్లు తమ పార్టీలోకి రావాల్సిందిగా సిద్ధును ఆహ్వానించాయి. ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను సిద్ధు ఇదివరకే కలసి చర్చించారు. కాగా ఆయన ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. సిద్ధు భార్య, ఎమ్మెల్యే అయిన నవ్జ్యోత్ కౌర్ సిద్ధు మాత్రం కాంగ్రెస్ పార్టీ తమకు సరైన రాజకీయ గమ్యస్థానం కాదని, ఆ పార్టీలో చేరాలని తాను భావించడంలేదని స్పష్టం చేశారు. దీంతో సిద్ధు దంపతులకు ఇక మిగిలున్న ప్రత్యామ్నాయం ఆమ్ ఆద్మీ పార్టీయే.
ఈ నెల 15న ఆప్లో సిద్ధు చేరనున్నట్టు వార్తలు వచ్చాయి. కాగా సిద్ధు డిమాండ్లకు ఆప్ నేతలు అంగీకరించకపోవడంతో వాయిదా పడినట్టు వార్తలు వచ్చాయి. కౌర్ ఆమ్ ఆద్మీ పార్టీని ప్రశంసిస్తూనే, ఆ పార్టీకి తన భర్త సిద్ధు అవసరముందన్నారు. ఆప్ మేనిఫెస్టో బాగుందని, పార్టీని నడిపించాలంటే సమర్థుడైన నాయకుడు అవసరమని చెప్పారు. వచ్చే ఏడాది జరిగే పంజాబ్ ఎన్నికల్లో ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో నిలవాలని సిద్ధు భావిస్తున్నారు. అలాగే తనతో పాటు తన భార్యకు కూడా పోటీచేసేందుకు ఆప్ టికెట్ ఇవ్వాలని కోరారు. కాగా ఎన్నికల్లో పోటీచేసేందుకు ఓ కుటుంబంలో ఒకరికి మించి అవకాశం ఇవ్వరాదన్నది ఆప్ నిబంధన. సిద్ధు చేరికకు ఇదే అడ్డంకిగా మారింది.