చంఢీఘడ్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పంజాబ్ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అమరీందర్ సింగ్, సిద్ధూల మధ్య పరస్పర ఆరోపణలు, రాజీనామాల తర్వాత.. కాంగ్రెస్‌లో అనేక పలు ఆసక్తికర మార్పులు సంభవించిన విషయం తెలసిందే. తాజాగా, పంజాబ్ వివాదాస్పద గాయకుడు సిద్ధూ మూసేవాలా కాంగ్రెస్‌లో చేరారు.
ఆయన పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ ఛన్నీ, పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరారు. మూసేవాలా.. గతంలో ‘సంజు’ అనే పాటల వీడియోలో తుపాకీలను ఉపయోగించారు. ఆ పాట వివాదాస్పదంగామారి, పలు కేసులు కూడా నమోదయ్యాయి. మూసేవాలా చేరికపై సీఎం ఛన్నీ స్పందించారు. మూసేవాలా.. ప్రజల మనస్సులు గెలుచుకున్నారని తెలిపారు. ఆయన తండ్రి మాజీ సైనికాధికారి, తల్లి మాన్సా గ్రామానికి సర్పంచ్‌గా పనిచేశారని తెలిపారు.
అదే విధంగా, మూసేవాలా రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మూసేవాలా మాట్లాడుతూ.. తాను మూడేళ్ల కిందట పాటలను పాడటం ఆరంభించానని తెలిపారు. ప్రస్తుతం ఒక కొత్త మార్పు రావాలనే సంకల్పంతో.. ఈ నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు. మాన్సా గ్రామం చాలా వెనుక బడి ఉందని, గ్రామాభివృద్ధి కోసమే.. తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.
మూసేవాలా.. కాంగ్రెస్ పార్టీని గర్వపడేలా చేస్తారనే నమ్మకం ఉందని ఛన్నీ అభిప్రాయపడ్డారు. అంతే కాకుండా.. నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. మూసేవాలాను ‘చాంప్’ గా కూడా అభివర్ణించారు. కాగా, సిద్ధూ మూసేవాలా అసలు పేరు.. శుభ్ దీప్ సింగ్ సిద్ధూ. ఆయన ఇంజనీరింగ్ విద్యను అభ్యసించారు. సంగీతం నేర్చుకున్నారు. సిద్ధూ మూసేవాలా తన స్వగ్రామమైన మాన్సా నుంచి బరిలో దిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment