
చంఢీఘడ్: పంజాబ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి వలసలు అధికమయ్యాయి. తాజాగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మంగళవారం బీజేపీలోకి చేరారు. ఖాదియాన్ నియోజక వర్గానికి చెందిన ఎమ్మెల్యే ఫతే జంగ్ బజ్వా, శ్రీ హగోబిండ్‌పూర్ నియోజక వర్గానికి చెందిన ఎమ్మెల్యే బల్విందర్ లడ్డీలు కాషాయ జెండా కప్పుకున్నారు.
ఎంపీ ప్రతాప్ బజ్వాకు ఫతే జంగ్ బజ్వా సోదరుడు. వీరిద్దరు కూడా ఖాదియాన్ నుంచి పోటీలో చేయడానికి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ .. ఫతేజంగ్ బజ్వాను ఖాదియాన్ నియోజక వర్గ అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఇదే సీటుపై తాను కూడా పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు ప్రతాప్ సింగ్ బజ్వా కాంగ్రెస్‌కు తెలిపారు.
ఈ నేపథ్యంలో ఫతేజంగ్ అనూహ్యంగా బీజేపీలోకి చేరారు. కాగా, ఢిల్లీలో అమిత్‌షా నివాసంలో.. బీజేపీ, పంజాబ్ లోక్ కాంగ్రెస్, అకాళీదల్ (సంయుక్త) కలిసి పోటీ చేయనున్నట్లు ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రానున్న రోజుల్లో మరిన్ని వలసలు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment