కార్యక్రమంలో పాల్గొన్న నవజోత్ కౌర్ సిద్ధూ
అమృత్‌సర్ : విజయదశమి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ‘రావణ దహనం’ కార్యక్రమంలో శుక్రవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. రావణ దహనాన్ని వీక్షిస్తున్న వందలాది మంది రైల్వే ట్రాక్‌పైకి రావడంతో రైలు ఢీకొని 61 మంది మరణించగా.. మరెంతో మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పంజాబ్ మాజీ మంత్రి నవజోత్ కౌర్ సిద్దూ పాల్గొన్నారు. అయితే, రైలు ప్రమాదానికి కొన్ని నిముషాల ముందు కార్యక్రమ నిర్వాహకులు ఆమెతో చెప్పిన కొన్ని మాటలు సంచలనం రేపుతున్నాయి. ‘మేడమ్..! చూడండి కార్యక్రమంలో భాగం కావడానికి ఎంతమంది వచ్చారో. అయిదువేల మంది రైల్వే ట్రాక్‌లను లెక్కచేయకుండా కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. 500 ట్రైన్‌లు వచ్చినా వాళ్లు భయపడరు’అంటూ ఒకరు వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి ‘ఘనంగా’ పండుగ చేశారని కార్యక్రమ నిర్వాహకులపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
కారకులు.. కారులో పరార్..!
ఇదిలా ఉండగా.. నిర్వాహకుల అజాగ్రత్తతోనే ప్రజలు రైల్వే ట్రాక్‌పైకి వచ్చారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అనుమతి లేకుండా రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహించారనీ, కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే రైలు ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్తున్నారు. అయితే, ప్రమాదం జరిగిన వెంటనే కార్యక్రమ నిర్వాహకుడు సౌరభ్‌మదన్ మిట్టు తన తండ్రితో కలిసి పరారయ్యాడు. ఈ దృశ్యాలు అతని ఇంటి సమీపంలోని సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయని పోలీసులు వెల్లడించారు. కాగా, ప్రమాదం జరిగి రెండు రోజులైనా నిందితుడు సౌరభ్‌మదన్ ఆచూకీ లభ్యం కాకపోవడంతో బాధిత కుటుంబాల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుని ఇంటిపై దాడి చేసి కిటీకీలు ధ్వంసం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment