
సాక్షి, అమృత్‌సర్ : పంజాబ్ రాష్ట్ర మంత్రి నవజ్యోత్‌సింగ్ సిద్ధూ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమృత్‌సర్-లాహోర్ మధ్య వ్యాపార సంబంధాలపై సిద్ధూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పంజాబ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎక్స్‌పో సందర్భంగా.. సిద్ధూ కేంద్రప్రభుత్వం విమర్శలకు దిగారు. సుమారు 1200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముంబై-కరాచీ మధ్య ట్రేడ్ పార్టనర్ షిప్ ఉన్నపుడు లాహోర్-అమృత్‌సర్ మధ్య ఉంటే తప్పేంటని ఆయన ఆగ్రహంగా ప్రశ్నించారు.
పంజాబ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎక్స్‌పోకు పాకిస్తాన్ వ్యాపారవేత్తలు పాల్గొనేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటివరకే పంజాబ్ ఎక్స్‌పో 12 సార్లు జరగ్గా.. పాకిస్తాన్ వ్యాపరవేత్తలు ఇందులో పాల్గొనకపోవడం వరుసగా రెండో ఏడాది అని ఆయన గుర్తు చేశారు.
పంజాబ్ ఇంటర్నేషనల్ ఎక్స్‌పోకు పాకిస్తాన్ వ్యాపారులను అనుమతివ్వడానికి ఎటవంటి ప్రత్యేక కారణాలు లేకపోయినా.. కేంద్రం మాత్రం మొండి వైఖరిని అనుసరించిందని అన్నారు. అమృత్‌సర్‌లో రాయి విసిరితే.. లాహోర్ పడుతుంది...అంత దగ్గరగా ఉండే ఈ నగరాల మధ్య వ్యాపారాన్ని కేంద్రం అనుమతించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు.