స్త్రీలోక సంచారం | Womens empowerment: Airports Authority of India to develop Palaly airport | Sakshi
Sakshi News home page

స్త్రీలోక సంచారం

Published Sat, Sep 22 2018 12:12 AM | Last Updated on Sat, Sep 22 2018 12:12 AM

Womens empowerment: Airports Authority of India to develop Palaly airport - Sakshi

ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎ.ఎ.ఐ.) ఇటీవల కాలంలో నియమించిన మహిళా ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ల సంఖ్య 2,000 వరకు ఉందని, ఐదేళ్ల క్రితం ఒక శాతంగా ఉన్న ఎ.ఎ.ఐ. మహిళల నియామకాలు నేటికి 10 శాతానికి పెరిగాయని.. ‘గర్ల్స్‌ ఇన్‌ ఏవియేషన్‌ డే – ఇండియా’ (సెప్టెంబర్‌ 19) సందర్భంగా గోవాలో జరిగిన ఒక కార్యక్రమంలో గోవా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్‌ భూపేష్‌ సి.హెచ్‌.నేగీ తెలిపారు. వాస్కోలోని సెయింట్‌ ఆండ్రూస్‌ హయ్యర్‌ సెకండరీ స్కూల్‌లో చదువుతున్న పదకొండు, పన్నెండు తరగతుల విద్యార్థినులు హాజరైన ఈ కార్యక్రమంలో నేగీ మాట్లాడుతూ.. త్వరలోనే కోల్‌కతాకు చెందిన ఒక యువతి తొలి ‘రెస్క్యూ అండ్‌ ఫైర్‌ ఫైటర్‌’గా వైమానిక దళంలో చేరబోతున్నారని, మహిళలకు ఈ రంగంలో ఇప్పుడు తమ సామర్థ్య నిరూపణకు తగిన ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయని అన్నారు. 

►సమాన వేతనం, సాధికారతల విషయంలో పాశ్చాత్య దేశాలు మహిళలకు సానుకూలంగా తమ ధోరణులను మార్చుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశంలో కూడా స్త్రీల ఉద్దేశాలను, స్త్రీల ఉద్యమాలను గుర్తించి, గౌరవించి, వారి అభీష్టానికి తగినట్లుగా సామాజిక పరివర్తన తెచ్చుకోవడం అవసరమైన అనివార్య దశలో మనం ఇప్పుడు ఉన్నామని సెప్టెంబర్‌ 21న విడుదలైన తన తాజా చిత్రం ‘మాంటో’ ప్రచార కార్యక్రమంలో భాగంగా ముంబైలోని స్టార్‌ స్పోర్ట్స్‌ స్టూడియోస్‌ను సందర్శించిన ఆ చిత్ర కథానాయకుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ వ్యాఖ్యానించారు. ‘‘శతాబ్దాలుగా మహిళల్ని మనం ఎలా అణిచివేస్తూ వస్తున్నామో ఒకసారి మననం చేసుకోవాలి. ఇప్పుడిది మారే దశ. వారి పట్ల మన సంకుచిత, ఆధిక్య దృక్పథాన్ని మార్చుకోవాలి. వారి ఆలోచనలను, కోర్కెలను, మనోభావాలను అర్థం చేసుకుని ప్రవర్తించాలి’’ అని సిద్ధిఖీ అన్నారు. 

►‘ఆషా’ (అక్రెడిటెడ్‌ సోషల్‌ హెల్త్‌ యాక్టివిస్ట్స్‌) కార్యకర్తలకు, అంగన్‌వాడీ కార్మికులకు పారితోషికం పెంచుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన తొమ్మిది రోజులకు ఢిల్లీ రాష్ట్ర అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌.. ఆ పారితోషికాన్ని తిరస్కరించింది! ఇండియన్‌ ఉమెన్స్‌ ప్రెస్‌  కోర్స్‌ ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో యూనియన్‌ అధ్యక్షురాలు శివానీ కౌల్‌ మాట్లాడుతూ, ‘‘అంగన్‌వాడీలను పర్మినెంట్‌ చెయ్యాలని, వారికి కనీస వేతనం ఇవ్వాలని ఏళ్లుగా అడుగుతున్నప్పటికీ పట్టించుకోని ప్రభుత్వం.. కంటి తుడుపుగా పారితోషికాన్ని ప్రకటించడం వల్ల ఒరిగేదేమీ ఉండదు’’ అని అసంతృప్తిని వ్యక్తం చేశారు. 

► ఘర్వాల్‌ ప్రాంతంలోని డెహ్రాడూన్‌లో ‘గవర్నమెంట్‌ డూన్‌ మెడికల్‌ కాలేజ్‌ హాస్పిటల్‌ (జి.డి.ఎం.సి.హెచ్‌.)లో పడకలు ఖాళీగా లేవని చెప్పడంతో ఆరు రోజులుగా హాస్పిటల్‌ కారిడార్‌లో నేల పైనే పడుకుని ప్రసవం కోసం ఎదురుచూసిన 27 ఏళ్ల ముస్సోరీ మహిళ.. నొప్పులు రావడంతో చివరికి అక్కడే ప్రసవించి, వైద్య సంరక్షణ అందక, అధిక రక్తస్రావంతో మరణించిన కొద్ది సేపటికే.. ఆమెకు పుట్టిన బిడ్డ (మగశిశువు) కూడా శ్వాస కోసం ఇరవై నిముషాలు కొట్టుకుని కన్నుమూయడం అక్కడ ఉన్నవారందరినీ కంటతడి పెట్టించింది. అయితే.. ఆమె భయంతో ప్రసూతి వార్డు నుంచి పరుగులు తీసిందని, బహుశా ఆ కారణంగానే రక్తస్రావం జరిగి ఉంటుందని వివరణ ఇచ్చిన ఆసుపత్రి మహిళా విభాగం చీఫ్‌ మెడికల్‌ సూపర్‌వైజర్‌ డాక్టర్‌ మీనాక్షీ జోషి.. బిడ్డ మరణానికి మాత్రం సరైన వివరణ ఇవ్వలేకపోయారు. 

►హరి యాణాలో సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలికి ఆ రాష్ట్రంలోని బి.జె.పి. ప్రభుత్వం 2 లక్షల  రూపాయలను మాత్రమే నష్టపరిహారంగా ఇవ్వడాన్ని విమర్శిస్తూ.. ‘బీజేపీ నేత ఎవరైనా పదిమంది చేత దాడికి గురైతే తాను 20 లక్షల రూపాయల పరిహారం ఇస్తానని’ ఆమ్‌ ఆద్మీ పార్టీ హరియాణా రాష్ట్ర అధ్యక్షుడు నవీన్‌ జైహింద్‌ అనడాన్ని ఆయన భార్య, ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ అయిన స్వాతి మలివాల్‌ తీవ్రంగా ఖండించారు. తన భర్త మాటల్లోని ఉద్దేశాన్ని తను అర్థం చేసుకోగలనని, అయితే ఆయన అలా మాట్లాడ్డం సరికాదని స్వాతి అన్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement