
మహిళా సాధికారతే ప్రధానాంశం
ఆకట్టుకున్న గణతంత్ర దిన ఫుల్ డ్రస్ రిహార్సల్స్
న్యూఢిల్లీ: ఈసారి గణతంత్ర వేడుకల్లో మహిళా సాధికారతే ప్రధానాంశంగా నిలవనుంది. ఈ మేరకు ఆ రోజున రాజ్‌పథ్‌లో నిర్వహించే ప్రదర్శనల్లో త్రివిధ దళాలకు చెందిన మహిళా కాంటిజెంట్లు తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డ్రస్ రిహార్సల్స్‌లో భాగంగా ఒళ్లు గగుర్పొడిచేలా సాగిన వైమానిక దళానికి చెందిన జెట్ విమానాల విన్యాసాలు, చక్కని క్రమశిక్షణతో చకచకా ముందుకుసాగే మహిళా కంటింజెంట్లు, దేశ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే వివిధ రాష్ట్రాలకు చెందిన రథాలు సందర్శకులను కట్టిపడేశాయి. శుక్రవారం రాజ్‌పథ్‌లో నిర్వహించిన ఫుల్ డ్రస్ రిహార్సల్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మానసిక పుత్రికలైన ‘జన్ ధన్ యోజన’, ‘మా గంగా’, ‘స్వచ్ఛ్ భారత్ అభియాన్’, ‘బులెట్ రైలు’, ‘మేక్ ఇన్ ఇండియా’ తదితర రథాలు రాజ్‌పథ్‌కు వచ్చిన వివిధ ప్రాంతాలకు చెందినవారిని చూపుతిప్పుకోనివ్వకుండా చేశాయి. అంతేకాకుండా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మోదీ గుజరాత్‌కు చెందిన ‘స్టేట్యూ ఆఫ్ యూనిటీ’ రథం కూడా రాజ్‌పథ్‌లో ముందుకుసాగింది.
వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ‘స్వచ్ఛ్ భారత్ అభియాన్’ ఆధారంగా ఇచ్చిన ప్రదర్శన ఔరా అనిపించింది. వేడుకలు సమీపిస్తుండడంతో రాజ్‌పథ్ గగనతలంలో శుక్రవారం నాలుగు సైనిక హెలికాప్టర్లతో జాతీయ జెండాతో ప్రివ్యూ నిర్వహించారు. అనంతరం వైమానిక, నౌకాదళాలు బ్రహ్మోస్ మిస్సైళ్లు, ఉపరితలం నుంచి ఉపరితలంపైనే శత్రువులపై దాడిచేసే ఆకాశ్ క్షిపణులు, 214 ఎం.ఎం. పినాకా రాకెట్లు, టీ-90 భీష్మ యుద్ధ ట్యాంకు, టీ-72 ట్రాల్, త్రీ డెమైన్షనల్ టాక్టికల్ కంట్రోల్ రాడార్ సిస్టమ్ తదితరాలు భారతీయ సైనిక పాటవానికి ప్రతీకగా ముందుకు సాగాయి. దీంతోపాటు అత్యాధునిక ఆయుధవ్యవస్థ, పారామిలిటరీ బలగాలు... బ్యాండ్‌కు అనుగుణంగా ముందుకు సాగాయి. వీటన్నింటినీ కన్నార్పకుండా తిలకించిన సందర్శకులు ఆనందపరవశంతో చప్పట్లు కొట్టారు. ఇవాళ జరిగిన పరేడ్‌లో జాతీయ సాహస బాలల పురస్కార విజేతలు కూడా పాల్గొన్నారు. దీంతోపాటు ఇవాళ్టి రిహార్సల్‌లో భాగంగా 16 రాష్ట్రాలకు చెందిన రథాలు కూడా పాలుపంచుకున్నాయి.
ఆకట్టుకున్న విన్యాసాలు
ఫుల్ డ్రస్ రిహార్సల్స్ ముగింపు దశలో భారతీయ వైమానిక దళానికి చెందిన సుఖోయ్, జాగ్వార్, సీ-130జే తదితర యుద్ధవిమానాలు చేసిన విన్యాసాలను సందర్శకులు ఊపిరి బిగబట్టి తిలకించారు. కాగా ఈ రిహార్సల్స్‌ను తిలకించేందుకు స్థానికులు పెద్దసంఖ్యలో బయల్దేరడంతో నగరంలోని అనేక ప్రాంతాల్లో చాలాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది.