The celebrations of the Republic
-
అభివృద్ధే లక్ష్యం
‘హృదయ్’ మనకు గర్వకారణం చిత్తశుద్ధితో చెరువుల పునరుద్ధరణ ‘పది’లో ప్రథమ స్థానానికి ప్రణాళికలు గణతంత్ర వేడుకల్లో కలెక్టర్ వాకాటి కరుణ హన్మకొండ అర్బన్ : జిల్లా సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని కలెక్టర్ వాకాటి కరుణ అన్నారు. అభివృద్ధే లక్ష్యంగా అందరం ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. గణతంత్ర వేడుకలు సోమవారం జిల్లా వ్యాప్తంగా అంబరాన్నంటారుు. వాడవాడలా మువ్వన్నెల జెండా అభివృద్ధే లక్ష్యం. హన్మకొండ పరేడ్ గ్రౌండ్లో జరిగిన వేడుకల్లో కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీస్ వందనం స్వీకరించారు. అనంతరం స్వాతంత్య్ర సమర యోధులను ఘనంగా సన్మానించారు. ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఆ తర్వాత ప్రజలనుద్ధేశించి కరుణ మాట్లాడారు. స్వరాష్ట్రంలో తొలి గణతంత్ర వేడుకల సందర్భంలో జిల్లాకు సంబంధించి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. కలెక్టర్ ఏమన్నారో ఆమె మాటల్లోనే... ఆరోగ్య వర్సిటీ, ఇళ్ల నిర్మాణాలు తొలి అడుగులు ‘తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అత్యంత ప్రాధాన్యం గల జిల్లా ఓరుగల్లు. ఈ జిల్లా సమగ్రాభివృద్ధిలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగాపర్యటించి, పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. నగరానికి మణిహారంలా 73 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు, ప్రధానరోడ్ల అభివృద్ధి, లక్ష పవర్‌లూమ్స్‌తో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. జిల్లా ప్రజల పక్షాన కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. నగరంలోని 9 మురికివాడల్లో రూ.400కోట్లతో 4 వేల ఇళ్ల నిర్మాణాలకు నిధులు విడుదల చేయడం, జిల్లాలో ఆరోగ్య విశ్వవిద్యాలయ ఏర్పాటు జిల్లా అభివృద్ధిలో తొలి అడుగులు. ‘హృదయ్’ గర్వకారణం ప్రపంచ వారసత్వ నగరంగా వరంగల్‌ను కేంద్ర ప్రభుత్వం గుర్తించడం... రూ.40.54కోట్లు విడుదల చేయడం మనకెంతో గర్వకారణం. జిల్లాలో ఇప్పటివరకు 9.43లక్షల ఆహారభద్రత కార్డులు, పేదలకు ఆసరా పింఛన్లు అందజేస్తున్నాం. జిల్లాలోని 3.50లక్షల మంది విద్యార్థుల భోజనానికి సన్నబియ్యం అందిస్తున్నాం. కాకతీయ కాలం నాటి చెరువుల పునరుద్ధరణకు చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం మిషన్ కాకతీయ. ఈ ప్రాజెక్టు కింద జిల్లాలోని 5,839 చెరువులను పనురుద్ధరించాలని నిర్ణయించాం. ఇందులో మొదటి విడత రూ.586.50కోట్లతో 1173 చెరువుల పునరుద్ధరణ పనులు చేపడుతున్నాం. జిల్లాలో రైతులకు మొదటి విడత రూ.472 కోట్ల వ్యసాయ రుణాలు మాఫీ చేశాం. భూమిలేని ఎస్సీ, ఎస్టీ నిరుపేదలకు సంబంధించి భూ కొనుగోలుకు ఇప్పటివరకు రూ.157 కోట్లు విడుదలయ్యూరుు. జిల్లాలో అతివృష్టి, అనావృష్టి కారణంగా నష్టపోయిన రైతాంగానికి రూ.54 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ అందజేశాం. రూ. 24.60 కోట్లతో 19 సబ్స్టేషన్ల నిర్మాణం కొనసాగుతోంది. ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పత్తిలో భాగంగా సౌరశక్తి ప్లాంట్ల నిర్మాణానికి 50 శాతం రాయితీతో పరికరాలు అందజేస్తున్నాం. రూ.4070 కోట్లతో వాటర్‌గ్రిడ్ పనులు జిల్లాలో ప్రజలందిరికీ సురక్షిత తాగునీరు అందజేసేందుకు *4070కోట్లతో 5ప్రాంతాల్లో వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టులు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్దం చేయడం జరిగింది. అదేవిదంగా వేసిలో నీటి ఎద్దడి నావారణకు *50కోట్లతో వారం రోజుల కాంటిజెంట్ ప్లాన్ రూపొందించాం. ప్రజారోగ్యంకోసం ఎంజీఎంలో 24గంటలు అందుబాటులో ఉండే వదంగా ప్రత్యేక సైన్‌ఫ్లూ వార్డు ఏర్పాటు చేయడం జరిగింది. సహాయంకోసం టోల్‌ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉంచాం. నూతన ఆసుపత్రుల నిర్మాణం, అధునీకరణ పనులకోసం ప్రభుత్వం *28కోట్లు మంజూరి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథ కాల్లో భాగంగా జిల్లాలో 23మంది అబ్దిదారులకు సీఎం చేతుల మీదుగా ఆర్ధిక సహాయం అదింయడం జరిగింది. ఎస్సెస్సీలో ప్రథమ స్థానం కోసం కృషి గత సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ సంవత్సరం 100శాతం ఫలితాలు సాదించేందుకు తగు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఆర్వీఎం ద్వారా జిల్లాలో రూ.13.52కోట్లతో పాఠశాలల్లో అదనపు గదులు నిర్మిస్తున్నాం. జిల్లాలో 4,523 అంగన్వాడీ కేంద్రాల ద్వారా 2.69లక్షల మంది గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారం అందజేస్తున్నాం. వీరికి ఒకపూట సంపూర్ణ ఆహారం కింద గుడ్లు, పాలు సరఫరా చేస్తున్నాం. రోడ్లు భవనాల శాఖ ద్వారా రూ.600 కోట్లతో 2341 కిలోమీటర్ల రహదారులను అభివృద్ధి చేస్తున్నాం. పీఆర్ శాఖ ద్వారా రూ.6కోట్లతో 166 కిలోమీటర్ల రోడ్ల పనులు చేపడుతున్నాం. జిల్లాలోని 962 పంచాయతీల్లో 204 పంచాయతీలు ఈ-పంచాయతీలుగా అభివృద్ధిచేసి కంప్యూటరీకరించాం. తెలంగాణ హరిత హారం కార్యక్రమంలో భాగంగా రానున్న నాలుగు సంవత్సరాల్లో నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. ఇప్పటికే 189 నర్సరీల్లో పెంపకం చేసిన 19లక్షల టేకు మొక్కలను రైతులకు అందజేశాం. పర్యాటక రంగానికి రూ.89 కోట్లు జల్లాలో పర్యాటక రంగ అభివృద్ధి కోసం రూ.89 కోట్ల అంచనాతో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. రూ.15 కోట్లతో కాళోజీ కళాక్షేత్రం, రూ.12కోట్లతో శిల్పారామం, రూ.5.20కోట్లతో రామప్ప ఐలాండ్ అంతర్జాతీయ ధ్యాన కేంద్రం, రూ.4కోట్లతో మల్టీపర్పస్ కల్చరల్ కాంప్లెక్స్, రూ.2కోట్లతో ఆర్కియాలజీ మ్యూజియం ఏర్పాటుకు పనులు వివిధ దశల్లో ఉన్నాయి. అదేవిధంగా గణపురం గుళ్ల పునరుద్ధరణ, పాకాల అభివృద్ధి, భద్రకాళి ఆలయంలో అన్నదాన సత్రం కోసం పనులు చేపట్టాలని నిర్ణయించాం. జిల్లాలో ఐటీడీఏ ద్వారా రూ.20.86కోట్లు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.36.65 కోట్లు, బీసీ కార్పొరేషన్ ద్వారా రూ.4.65 కోట్లను లబ్ధిదారులకు ఆర్థికసాయంగా అందజేశాం. జిల్లా అభివృద్ధిలో పాలు పంచుకుంటున్న డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, స్పీకర్ మధుసుదనాచారి, మంత్రి అజ్మీరా చ ందూలాల్, ఇతర ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు. జిల్లా సర్వతోముఖాభివృద్దికి కృషిచేస్తున్న జిల్లా న్యాయమూర్తి, పోలీస్ ఉన్నతాధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.’ తెలుపుతూ కలెక్టర్ కరుణ ప్రసంగం ముగించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, డీఐజీ మల్లారెడ్డి, ఎస్పీ అంబర్కిషోర్జా, కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, వివిధ శాఖల అధికారులు, పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎన్నో ఏళ్ల పోరాటాల ఫలితంగా స్వరాష్ట్ర కల సాకారమైంది. మిగిలింది బంగారు తెలంగాణగా అభివృద్ధి చేసుకోవడమే. - వాకాటి కరుణ, కలెక్టర్ -
త్రివర్ణం.. సగర్వంగా
వైభవంగా నవ్యాంధ్రలో తొలి రిపబ్లిక్‌డే వేడుకలు జాతీయ జెండా ఆవిష్కరించిన గవర్నర్ నరసింహన్ సాయుధ పోలీసు బలగాల కవాతు ఆకట్టుకున్న ప్రభుత్వ శకటాలు నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారి జరిగిన గణతంత్ర వేడుకల్లో త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగిరింది. గణతంత్ర భారతావనికి నగర వాసులు గుండెల నిండా దేశభక్తితో సెల్యూట్ చేశారు. అంగరంగ వైభవంగా నిర్వహించిన ఈ కార్యక్రమం కనులవిందు చేసింది. కార్యక్రమానికి వేదికైన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ప్రాంగణం దేశభక్తితో పులకించింది. గవర్నర్, సీఎం సహా రాష్ర్ట ప్రముఖులు హాజరయ్యారు. విజయవాడ : నవ్యాంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా సోమవారం నిర్వహించిన 66వ గణతంత్ర వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ చారిత్రాత్మక ఘట్టానికి నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికైంది. జాతీయ గీతాల ఆలపానతో ప్రాంగణమంతా దేశభక్తిని పెంపొందింపజేసింది. ఉదయం 7.42 గంటలకు రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సభా ప్రాంగణంలోకి వచ్చారు. ఆయనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రులు కేఈ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, డీజీపీ జేవీ రాముడు, ఇతర ప్రముఖులు ఘనంగా స్వాగతం పలికారు. రవాణా శాఖ ఏర్పాటుచేసిన ప్రత్యేక వాహనంలో గవర్నర్ స్టేడియమంతా తిరిగి అందరికీ అభివాదం చేశారు. గ్యాలరీలో కూర్చున్న విద్యార్థులు, అహూతులు తమ వద్దకు గవర్నరు వాహనం వచ్చినప్పుడు లేచి నిలబడి చప్పట్లు కొడుతూ హర్షాతిరేకాలను వ్యక్తంచేశారు. కదం తొక్కుతూ కవాతు.. ఈ వేడుకల్లో భాగంగా సాయుధ పోలీసు బలగాల కవాతు ఆద్యంతం అద్భుతంగా సాగింది. భారత సైనిక దళం, కేంద్రీయ రిజర్వు బృందం, ఏపీఎస్పీ రెండో బెటాలియన్(కర్నూలు), ఆరో బెటాలియన్(మంగళగిరి), 16వ బెటాలియన్(విశాఖపట్నం), పోలీస్ టాస్క్ఫోర్సు బ్రాండ్, ఎన్సీసీ బాలికల బృందం, ఎన్సీసీ బాలుర బృందం, భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ బృందం, సాంఘిక సంక్షేమ, గురుకుల ఆశ్రమ పాఠశాల బృందం, రెడ్‌క్రాస్ విద్యార్థులు నిర్వహించిన కవాతు ఆహూతులను విశేషంగా ఆకట్టుకుంది. రంగురంగుల దుస్తుల్లో క్రమశిక్షణతో కవాతు చేసిన బృందాల నుంచి గవర్నర్ గౌరవ వందనం స్వీకరించారు. ఏపీఎస్పీ రెండో బెటాలియన్(కర్నూలు), మూడో బెటాలియన్(కాకినాడ), ఐదో బెటాలియన్(విజయనగరం), ఆరో బెటాలియన్(మంగళగిరి), తొమ్మిదో బెటాలియన్(వెంకటగిరి) 11వ బెటాలియన్(వైఎస్సార్ కడప జిల్లా) బృందాలు స్టేడియంలో బ్యాండ్ ప్రదర్శనలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కవాతు అనంతరం రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ రంగాలపై వివిధ శాఖలు ఏర్పాటుచేసిన అలంకృత శకటాలు ప్రాంగణమంతా తిరిగాయి. ఆయా శాఖల పనితీరు, విశ్లేషణ, అభివృద్ధి, సంక్షేమ ఫలాలు తదితర అంశాలను వివరిస్తూ రూపొందించిన శకటాలు ఆకట్టుకున్నాయి. తెలుగు, ఇంగ్లిష్‌లలో గవర్నర్ ప్రసంగం.. ఉదయం 8.22 గంటలకు గవర్నర్ నరసింహన్ తన ప్రసంగాన్ని ప్రారంభించి సుమారు అరగంటపాటు రాష్ట్ర ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు. తొలుత తెలుగులో, ఆ తర్వాత ఇంగ్లిష్‌లో, చివరలో తిరిగి తెలుగులో గవర్నర్ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధివిధానాలు, ప్రజల కోసం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, రాబోయే రోజుల్లో ప్రభుత్వ విజన్ తదితర అంశాలను తన ప్రసంగంలో గవర్నర్ ప్రస్తావించారు. గవర్నర్ సతీమణి విమలా నరసింహన్ కూడా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు సంప్రదాయ వస్త్రధారణతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ వేడుకల్లో శాసనమండలి చైర్మన్ చక్రపాణి, అసెంబ్లీ డెప్యుటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, పల్లె రఘునాథరెడ్డి, దేవినేని ఉమ, సీహెచ్ అయ్యన్నపాత్రుడు, కామినేని శ్రీనివాస్, కె.అచ్చెన్నాయుడు, రావెల కిషోర్‌బాబు, కొల్లు రవీంద్ర, ప్రత్తిపాటి పుల్లారావు, పి.నారాయణ, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు, అదనపు డీజీ(బెటాలియన్స్) గౌతమ్ సవాంగ్, కలెక్టర్ బాబు.ఎ. సీపీ ఏబీ వెంకటేశ్వరరావు, ప్రొటోకాల్ కార్యదర్శి ఎంకే మీనా, సమాచార శాఖ కమిషనర్ ఎన్వీ రమణారెడ్డి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
హోటళ్లు, గెస్ట్‌హౌస్‌లు ఫుల్
విజయవాడ : నవ్యాంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటి సారిగా జరుగుతున్న గణతంత్ర వేడుకలలో పాల్గొడానికి రాష్ట్రం నలుమూలల నుంచి వీవీఐపీలు, వీఐపీలు తరలివస్తున్నారు. వీరందరికి వసతి కల్పించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దాంతో నగరంలో స్టార్ హోటళ్లు, గెస్ట్‌హౌస్‌లు బుక్ అయిపోయాయి. ప్రముఖులందరూ ఆదివారం రాత్రికే నగరానికి చేరుకుంటారు. నగరంలో స్టార్ హోటళ్లయిన డి.వి.మనార్, గేట్‌వే, మురళీఫార్చ్యూన్, ఐలాపురం, కె హోటల్‌తోపాటు ప్రముఖ హోటళ్లలో గదులు అడ్వాన్స్ బుకింగ్ చేశారు. ఇవిగాక స్టేట్ గెస్ట్‌హౌస్, ఇతర ప్రభుత్వ అతిథి గృహాలను వీఐపీల కోసం రిజర్వ్ చేశారు. సోమవారం గణతంత్ర వేడుకలలో పాల్గొనటానికి రాష్ట్ర ఉన్నతాధికారులు, నాయకులు హాజరు కానున్నారు. గవర్నర్ నరసింహన్ ఆదివారం సాయంత్రం విమానంలో గన్నవరం చేరుకుంటారు. అనంతరం నగరంలోని స్టేట్ గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు కె.ఇ.కృష్ణమూర్తి, నిమ్మకాయల చిన్న రాజప్ప, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు, పలువురు ఉన్నతాధికారులు, మంత్రులు గణతంత్ర వేడుకలకు రానున్నారు. డీజీపీ రాముడు ఇప్పటికే నగరానికి వచ్చి, ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. భారీ భద్రతా ఏర్పాట్లు నగరానికి ప్రముఖుల రాక సందర్భంగా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి విజయవాడ వరకు తనిఖీలు నిర్వహించారు. నగరంలో హోటళ్లు, గెస్ట్‌హౌస్‌ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. నేడు సీఎం రాక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు ఆదివారం రాత్రి నగరానికి రానున్నారు. గణతంత్ర దినోత్సవంలో పాల్గొనటానికి ఆదివారం రాత్రి 7.30గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి రాత్రి 8.15 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 8.30 గంటలకు హోటల్ డీవీ మెనార్కు చేరుకుని బస చేస్తారు. 26వ తేదీ సోమవారం ఉదయం 7.40 గంటలకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం చేరుకుని గణతంత్ర వేడుకల్లో పాల్గొంటారు. 9.30 గంటలకు స్టేడియంలో ఏర్పాటు చేసిన తేనీటి విందులో పాల్గొంటారు. 10.30 గంటలకు సిద్ధార్థమెడికల్ కళాశాలలో ఆర్టీసీ బస్‌లకు జెండా ఊపి ప్రారంభిస్తారు. పల్లె రఘునాథరెడ్డి రాక రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆదివారం ఉదయం ఆరుగంటలకు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడ చేరుకుంటారు. ఆయన స్టేట్ గెస్ట్‌హౌస్‌లో బస చేస్తారు. గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలిస్తారు. సోమవారం వేడుకలలో పాల్గొంటారు. -
మహిళా సాధికారతే ప్రధానాంశం
ఆకట్టుకున్న గణతంత్ర దిన ఫుల్ డ్రస్ రిహార్సల్స్ న్యూఢిల్లీ: ఈసారి గణతంత్ర వేడుకల్లో మహిళా సాధికారతే ప్రధానాంశంగా నిలవనుంది. ఈ మేరకు ఆ రోజున రాజ్‌పథ్‌లో నిర్వహించే ప్రదర్శనల్లో త్రివిధ దళాలకు చెందిన మహిళా కాంటిజెంట్లు తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డ్రస్ రిహార్సల్స్‌లో భాగంగా ఒళ్లు గగుర్పొడిచేలా సాగిన వైమానిక దళానికి చెందిన జెట్ విమానాల విన్యాసాలు, చక్కని క్రమశిక్షణతో చకచకా ముందుకుసాగే మహిళా కంటింజెంట్లు, దేశ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే వివిధ రాష్ట్రాలకు చెందిన రథాలు సందర్శకులను కట్టిపడేశాయి. శుక్రవారం రాజ్‌పథ్‌లో నిర్వహించిన ఫుల్ డ్రస్ రిహార్సల్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మానసిక పుత్రికలైన ‘జన్ ధన్ యోజన’, ‘మా గంగా’, ‘స్వచ్ఛ్ భారత్ అభియాన్’, ‘బులెట్ రైలు’, ‘మేక్ ఇన్ ఇండియా’ తదితర రథాలు రాజ్‌పథ్‌కు వచ్చిన వివిధ ప్రాంతాలకు చెందినవారిని చూపుతిప్పుకోనివ్వకుండా చేశాయి. అంతేకాకుండా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మోదీ గుజరాత్‌కు చెందిన ‘స్టేట్యూ ఆఫ్ యూనిటీ’ రథం కూడా రాజ్‌పథ్‌లో ముందుకుసాగింది. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ‘స్వచ్ఛ్ భారత్ అభియాన్’ ఆధారంగా ఇచ్చిన ప్రదర్శన ఔరా అనిపించింది. వేడుకలు సమీపిస్తుండడంతో రాజ్‌పథ్ గగనతలంలో శుక్రవారం నాలుగు సైనిక హెలికాప్టర్లతో జాతీయ జెండాతో ప్రివ్యూ నిర్వహించారు. అనంతరం వైమానిక, నౌకాదళాలు బ్రహ్మోస్ మిస్సైళ్లు, ఉపరితలం నుంచి ఉపరితలంపైనే శత్రువులపై దాడిచేసే ఆకాశ్ క్షిపణులు, 214 ఎం.ఎం. పినాకా రాకెట్లు, టీ-90 భీష్మ యుద్ధ ట్యాంకు, టీ-72 ట్రాల్, త్రీ డెమైన్షనల్ టాక్టికల్ కంట్రోల్ రాడార్ సిస్టమ్ తదితరాలు భారతీయ సైనిక పాటవానికి ప్రతీకగా ముందుకు సాగాయి. దీంతోపాటు అత్యాధునిక ఆయుధవ్యవస్థ, పారామిలిటరీ బలగాలు... బ్యాండ్‌కు అనుగుణంగా ముందుకు సాగాయి. వీటన్నింటినీ కన్నార్పకుండా తిలకించిన సందర్శకులు ఆనందపరవశంతో చప్పట్లు కొట్టారు. ఇవాళ జరిగిన పరేడ్‌లో జాతీయ సాహస బాలల పురస్కార విజేతలు కూడా పాల్గొన్నారు. దీంతోపాటు ఇవాళ్టి రిహార్సల్లో భాగంగా 16 రాష్ట్రాలకు చెందిన రథాలు కూడా పాలుపంచుకున్నాయి. ఆకట్టుకున్న విన్యాసాలు ఫుల్ డ్రస్ రిహార్సల్స్ ముగింపు దశలో భారతీయ వైమానిక దళానికి చెందిన సుఖోయ్, జాగ్వార్, సీ-130జే తదితర యుద్ధవిమానాలు చేసిన విన్యాసాలను సందర్శకులు ఊపిరి బిగబట్టి తిలకించారు. కాగా ఈ రిహార్సల్స్‌ను తిలకించేందుకు స్థానికులు పెద్దసంఖ్యలో బయల్దేరడంతో నగరంలోని అనేక ప్రాంతాల్లో చాలాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది.