
త్రివర్ణం.. సగర్వంగా
వైభవంగా నవ్యాంధ్రలో తొలి రిపబ్లిక్‌డే వేడుకలు
జాతీయ జెండా ఆవిష్కరించిన గవర్నర్ నరసింహన్
సాయుధ పోలీసు బలగాల కవాతు
ఆకట్టుకున్న ప్రభుత్వ శకటాలు
నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారి జరిగిన గణతంత్ర వేడుకల్లో త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగిరింది. గణతంత్ర భారతావనికి నగర వాసులు గుండెల నిండా దేశభక్తితో సెల్యూట్ చేశారు. అంగరంగ వైభవంగా నిర్వహించిన ఈ కార్యక్రమం కనులవిందు చేసింది. కార్యక్రమానికి వేదికైన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ప్రాంగణం దేశభక్తితో పులకించింది. గవర్నర్, సీఎం సహా రాష్ర్ట ప్రముఖులు హాజరయ్యారు.
విజయవాడ : నవ్యాంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా సోమవారం నిర్వహించిన 66వ గణతంత్ర వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ చారిత్రాత్మక ఘట్టానికి నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికైంది. జాతీయ గీతాల ఆలపానతో ప్రాంగణమంతా దేశభక్తిని పెంపొందింపజేసింది. ఉదయం 7.42 గంటలకు రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ సభా ప్రాంగణంలోకి వచ్చారు. ఆయనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రులు కేఈ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, డీజీపీ జేవీ రాముడు, ఇతర ప్రముఖులు ఘనంగా స్వాగతం పలికారు. రవాణా శాఖ ఏర్పాటుచేసిన ప్రత్యేక వాహనంలో గవర్నర్ స్టేడియమంతా తిరిగి అందరికీ అభివాదం చేశారు. గ్యాలరీలో కూర్చున్న విద్యార్థులు, అహూతులు తమ వద్దకు గవర్నరు వాహనం వచ్చినప్పుడు లేచి నిలబడి చప్పట్లు కొడుతూ హర్షాతిరేకాలను వ్యక్తంచేశారు.
కదం తొక్కుతూ కవాతు..
ఈ వేడుకల్లో భాగంగా సాయుధ పోలీసు బలగాల కవాతు ఆద్యంతం అద్భుతంగా సాగింది. భారత సైనిక దళం, కేంద్రీయ రిజర్వు బృందం, ఏపీఎస్పీ రెండో బెటాలియన్(కర్నూలు), ఆరో బెటాలియన్(మంగళగిరి), 16వ బెటాలియన్(విశాఖపట్నం), పోలీస్ టాస్క్‌ఫోర్సు బ్రాండ్, ఎన్‌సీసీ బాలికల బృందం, ఎన్‌సీసీ బాలుర బృందం, భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ బృందం, సాంఘిక సంక్షేమ, గురుకుల ఆశ్రమ పాఠశాల బృందం, రెడ్‌క్రాస్ విద్యార్థులు నిర్వహించిన కవాతు ఆహూతులను విశేషంగా ఆకట్టుకుంది. రంగురంగుల దుస్తుల్లో క్రమశిక్షణతో కవాతు చేసిన బృందాల నుంచి గవర్నర్ గౌరవ వందనం స్వీకరించారు. ఏపీఎస్పీ రెండో బెటాలియన్(కర్నూలు), మూడో బెటాలియన్(కాకినాడ), ఐదో బెటాలియన్(విజయనగరం), ఆరో బెటాలియన్(మంగళగిరి), తొమ్మిదో బెటాలియన్(వెంకటగిరి) 11వ బెటాలియన్(వైఎస్సార్ కడప జిల్లా) బృందాలు స్టేడియంలో బ్యాండ్ ప్రదర్శనలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కవాతు అనంతరం రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ రంగాలపై వివిధ శాఖలు ఏర్పాటుచేసిన అలంకృత శకటాలు ప్రాంగణమంతా తిరిగాయి. ఆయా శాఖల పనితీరు, విశ్లేషణ, అభివృద్ధి, సంక్షేమ ఫలాలు తదితర అంశాలను వివరిస్తూ రూపొందించిన శకటాలు ఆకట్టుకున్నాయి.
తెలుగు, ఇంగ్లిష్‌లలో గవర్నర్ ప్రసంగం..
ఉదయం 8.22 గంటలకు గవర్నర్ నరసింహన్ తన ప్రసంగాన్ని ప్రారంభించి సుమారు అరగంటపాటు రాష్ట్ర ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు. తొలుత తెలుగులో, ఆ తర్వాత ఇంగ్లిష్‌లో, చివరలో తిరిగి తెలుగులో గవర్నర్ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధివిధానాలు, ప్రజల కోసం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, రాబోయే రోజుల్లో ప్రభుత్వ విజన్ తదితర అంశాలను తన ప్రసంగంలో గవర్నర్ ప్రస్తావించారు. గవర్నర్ సతీమణి విమలా నరసింహన్ కూడా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు సంప్రదాయ వస్త్రధారణతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ వేడుకల్లో శాసనమండలి చైర్మన్ చక్రపాణి, అసెంబ్లీ డెప్యుటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, పల్లె రఘునాథరెడ్డి, దేవినేని ఉమ, సీహెచ్ అయ్యన్నపాత్రుడు, కామినేని శ్రీనివాస్, కె.అచ్చెన్నాయుడు, రావెల కిషోర్‌బాబు, కొల్లు రవీంద్ర, ప్రత్తిపాటి పుల్లారావు, పి.నారాయణ, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు, అదనపు డీజీ(బెటాలియన్స్) గౌతమ్ సవాంగ్, కలెక్టర్ బాబు.ఎ. సీపీ ఏబీ వెంకటేశ్వరరావు, ప్రొటోకాల్ కార్యదర్శి ఎంకే మీనా, సమాచార శాఖ కమిషనర్ ఎన్‌వీ రమణారెడ్డి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.