అంటరానితనం అంటే ఫలానా వ్యక్తులు తాకటానికి వీల్లేదని భౌతికంగా దూరం పెట్టటం మాత్రమే కాదు.. వారికి అందాల్సిన సంక్షేమాన్ని అడ్డుకోవడం కూడా అంటరానితనమే.. అలాంటి రూపం మార్చుకున్న అంటరానితనంపై ఈ రోజు మనం యుద్ధం చేస్తున్నాం! పేదలు గెలిచేదాకా, వారి బతుకులు బాగుపడే వరకు ఇది కొనసాగుతుంది.
– ముఖ్యమంత్రి వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రూపం మార్చుకున్న అంటరానితనం, పేద వర్గాలను అణచివేస్తున్న పెత్తందారీ భావజాలం ధోరణులపై ఈ నాలుగేళ్ల పాలనలో యుద్ధాన్ని ప్రకటించామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. మంగళవారం 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం జగన్ సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. మహనీయుల త్యాగనిరతి, స్వాతంత్య్ర సమర యోధుల బలి దానాలను గుర్తు చేస్తూ ప్రసంగించారు.
స్వతంత్ర భారత దేశ చరిత్రలో మరే ప్రభుత్వం, రాష్ట్రం చేయని గొప్ప మార్పులు, గ్రామ స్వరాజ్యానికి అసలైన అర్ధాన్ని నాలుగేళ్లలోనే తెచ్చామని చెప్పారు. ‘76 ఏళ్ల ప్రయాణంలో మన దేశం, రాష్ట్రం ఎంతో పురోగమించాయని చెప్పేందుకు పలు ఉదాహరణలు కనిపిస్తాయి. ఆర్థిక వ్యవస్థకు మూలమైన వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు లాంటి మూడు రంగాలలో ఎంతో ప్రగతి కనిపిస్తుంది. కానీ అదే సమయంలో ఈ వేగాన్ని అందుకోలేని, అందుకునే అవకాశాలు తగినంతగా లభించని కుటుంబాలు, వర్గాలు, సామాజిక వర్గాలు, ప్రాంతాలు ఈ ఏడు దశాబ్దాల ప్రయాణంలో ఇంకా వెనకబడే ఉన్నాయి’ అని పేర్కొన్నారు. సీఎం జగన్ తన ప్రసంగంలో ఇంకా ఏమన్నారంటే..
విజయవాడలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో జాతీయ జెండాకు సెల్యూట్ చేస్తున్న సీఎం వైఎస్ జగన్
రూపం మార్చుకున్న అంటరానితనం, పెత్తందారీ భావజాలం..
అంటరానితనం అంటే కేవలం భౌతికంగా దూరం పెట్టటం మాత్రమే కాదు! పేదలు ఏ బడిలో చదువుకుంటున్నారో ఆ గవర్నమెంట్ బడిని పాడు పెట్టడం! డబ్బున్న వారి పిల్లలకు ఒక మీడియం, పేదల పిల్లలకు మరో మీడియం అని వివక్ష పాటిస్తూ పేదబిడ్డలు తెలుగు మీడియంలోనే చదవాలని బరితెగించి వాదించటం కూడా అంటరానితనమే! పేదలు ఏ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుంటున్నారో అక్కడ ఉచిత సేవలు అందకుండా చేయటం, పేదలు ఏ బస్సు ఎక్కుతున్నారో ఆ బస్సును ప్రైవేట్‌కు విక్రయించాలని చూడటం, పేదలు కోరుకునే చిన్నపాటి ఇంటి స్థలం, ఇంటిని వారికి ఇవ్వకుండా ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటం, చివరికి కోర్టుల్లో రకరకాల కేసులు వేసి పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు కట్టించి ఇవ్వటానికి వీల్లేదని అడ్డుకోవటం కూడా అంటరానితనమే! పౌర సేవలు ఏవి కావాలన్నా పేదలు, మధ్యతరగతి వర్గాల వారు కార్యాలయాలు, కమిటీల చుట్టూ తిరిగేలా వారి సహనాన్ని పరీక్షించటం, అవ్వాతాతలు పెన్షన్ అందుకోవాలన్నా, రైతన్నలకు ఎరువులు కావాలన్నా పొద్దున్నే లేచి పొడవాటి క్యూల్లో నిలబడి, చివరికి ఆ క్యూ లైన్లలో మనుషులు చనిపోతున్నా పాలకుల గుండెలు కరగకపోవటం... ఇవన్నీ రూపం మార్చుకున్న అంటరానితనం, పెత్తందారీ భావజాలంలో భాగాలే.
స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్లు గడిచినా ఇప్పటికీ అలాగే మిగిలి ఉన్న, రూపం మార్చుకున్న అంటరానితనంపై యుద్ధం చేస్తున్న ప్రభుత్వం మనది. పేదలు గెలిచే వరకూ, వారి బతుకులు బాగుపడేవరకూ ఈ యుద్ధం కొనసాగుతుంది.
అంబేడ్కర్ సాక్షిగా..
విజయవాడ నడిబొడ్డున వచ్చే నవంబర్ 26న రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం రోజు మనం ఆవిష్కరించబోతున్న ఒక మహానుభావుడి ఆకాశమంత వ్యక్తిత్వం సాక్షిగా, మనందరికీ కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చెప్పిన మాటలను మీ అందరి ముందు ఉంచుతున్నా. ‘‘భౌతికంగా ఒక మనిషికి సంకెళ్లు లేకపోయినా భావాలపరంగా స్వేచ్ఛ లేకుంటే స్వతంత్రంగా బతుకుతున్నట్లు కాదు. అతడు బానిసగా బతుకుతున్నట్టే. భావాల పరంగా అతడు ఖైదీనే’’ అని బాబా సాహెబ్ అంబేడ్కర్ చెప్పారు.
ఒక మనిషి అస్తిత్వానికి మూలం, స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు అర్థం ఏమిటంటే? ఆలోచనలు, భావాల పరంగా స్వాతంత్య్రం కలిగి ఉండటం. తన అభివృద్ధి, తన కుటుంబం అభివృద్ధికి అవకాశాలు ఉండటం. రాజకీయ, ఆర్థిక, సామాజిక, విద్యా స్వాతంత్య్రాలను వారు కలిగి ఉండటం. తరతరాల పెత్తందారీ సంకెళ్ల నుంచి పేదలు బయటపడి ఎదిగే వాతావరణం ఉండటం. పేద వర్గాలకు అటువంటి భావపరమైన, ఆలోచనల పరమైన స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను కల్పించేందుకు త్రికరణ శుద్ధిగా కట్టుబడి ఉన్నాం.
దుష్ట సంప్రదాయాన్ని తుదముట్టించాం
ఎన్నికల సమయంలో ప్రకటించే మేనిఫెస్టోను ఆ త రువాత చెత్తబుట్టలో పడేసే దుష్ట సంప్రదాయాన్ని మనం తుదముట్టించాం. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావిస్తూ ఇందులో ఇవి చెప్పాం.. ఇవి చేశాం.. 98.5% వాగ్దానాలను ఇప్పటికే అమలు చేశామని ప్రింట్ తీసి మరీ గడప గడపకూ వెళ్లి చూ పిస్తూ ప్రజల ఆశీస్సులు తీసుకుంటున్నాం.
అర్హత ఉండి కూడా సకాలంలో దరఖాస్తు చేసుకోలేకపోవటం, వెరిఫికేషన్ సమయంలో అందుబాటులో లేక పోవటం, ఇతరత్రా మరే కారణాలతోనైనా సంక్షేమ పథకాలను అందుకోలేకపోయిన వారందరికీ మళ్లీ అవకాశం కల్పిస్తూ మిగిలిపోయిన వారికీ లబ్ధి చేకూరుస్తున్న ప్రభుత్వం దేశ చరిత్రలో మనది మాత్రమే.
వికేంద్రీకరణ మన విధానం..
సామాజిక న్యాయం అన్నది కేవలం నినాదం కాదు.. అది అమలు చేయాల్సిన విధానమని నిరూపిస్తూ మంత్రి మండలిలో ఏకంగా 68 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే ఇచ్చాం. ఐదుగురు ఉప ముఖ్యమంత్రుల్లో నలుగురు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారే. ఆలయ బోర్డులు మొదలు వ్యవసాయ మార్కెట్ కమిటీల వరకు అన్నింటా చట్టం చేసి మరీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం పదవులు ఇచ్చిన తొలి ప్రభుత్వం మనదే.
వికేంద్రీకరణను విధానంగా మార్చుకుని రాష్ట్రం ఏర్పడిన తరవాత మరో 13 కొత్త జిల్లాలను ఏర్పాటు చేశాం. రాజధానులను కూడా మూడు ప్రాంతాల హక్కుగా, రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతగా వికేంద్రీకరణ చేయబోతున్న ప్రభుత్వం కూడా మనదే. ఏకంగా 15 వేలకు పైగా గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయటం ద్వారా వికేంద్రీకరణలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది కూడా మనందరి ప్రభుత్వమే.
ప్రజల అవసరాలు, ప్రగతి లక్ష్యంగా..
గ్రామ సచివాలయాలు, వైఎస్సార్ అర్బీకేలు, ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు, విలేజ్ క్లినిక్స్, బ్రాడ్ బ్యాండ్ సదుపాయంతో డిజిటల్ లైబ్రరీలు గ్రామాల్లో మన కళ్ల ఎదుటే నిర్మాణంలో ఉన్నాయి. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి ఇది నిదర్శనం. బర్త్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, పెన్షన్, రేషన్, ప్రభుత్వ పథకాల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే దుస్థి తిని తొలగించి ఇంటివద్దే డెలివరీ చేసే సచివాల యాలు, వలంటీర్ వ్యవస్థను తెచ్చాం.
ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి రూపాయిలో 15 పైసలు మాత్రమే లబ్ధిదారులైన ప్రజలకు చేరుతున్నాయని 38 ఏళ్ల క్రితం అప్పటి ప్రధాని చెప్పిన మాటలు ఇప్పటికీ ప్రచారంలో ఉన్నాయి. 50 నెలల్లో ఎలాంటి అవినీ తి, లంచాలు, వివక్షకు తావులేకుండా ఏకంగా రూ. 2.31 లక్షల కోట్లను అత్యంత పారదర్శకంగా పేద లకు అందించాం. డీబీటీతో నేరుగా ఖాతాల్లోకి జమ చేశాం. సంక్షేమ పథకాలన్నీ అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాలకే ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. మహిళా సాధికా రతకు బాటలు వేశాం. సోషల్ ఆడిట్‌ను తప్పనిసరి చేసి పారదర్శకంగా లబ్ధి చేకూరుస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment