పథకాలను కళ్లకు కట్టిన శకటాలు  | CM Jagan Grand independence celebrations at Vijayawada | Sakshi
Sakshi News home page

పథకాలను కళ్లకు కట్టిన శకటాలు 

Aug 16 2022 3:57 AM | Updated on Aug 16 2022 12:14 PM

CM Jagan Grand independence celebrations at Vijayawada - Sakshi

మొదటి బహుమతి పొందిన సచివాలయ శకటం

సాక్షి, అమరావతి: విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో 76వ భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో పరేడ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా వేడుకలకు హాజరైన విద్యార్థులు, సాధారణ ప్రజానీకానికి ముఖ్యమంత్రి చిరునవ్వుతో అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ క్రమంలో కేరింతలు, నినాదాలతో చేతులు ఊపుతూ విద్యార్థులు, ప్రజలు సీఎంకు ప్రతిగా అభివాదం చేశారు. సాయుధ దళాల గౌరవ వందనాన్ని సీఎం జగన్‌ స్వీకరించారు.  
రెండో బహుమతి సాధించిన విద్యాశాఖ శకటం 

అబ్బురపరిచిన కవాతు 
ఈ వేడుకల్లో సాయుధ దళాల కవాతు చూపరులను అబ్బురపరిచింది. ఆద్యంతం నూతన ఉత్తేజాన్ని నింపింది. పల్నాడు జిల్లా అడ్మిన్‌ ఏఎస్పీ గరికపాటి బిందుమాధవ్‌ సాయుధ దళాల కవాతుకు నేతృత్వం వహించారు. ఏపీఎస్సీ 2వ బెటాలియన్‌ (కర్నూలు), 3వ బెటాలియన్‌ (కాకినాడ), 5వ బెటాలియన్‌ (విజయనగరం), 11వ బెటాలియన్‌ (కడప), 6వ బెటాలియన్‌ (మంగళగిరి), ఎన్‌సీసీ బాలబాలికలు, ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు, భారత్‌ స్కౌట్స్‌–గైడ్స్, రెడ్‌క్రాస్‌ సొసైటీ, ఏపీ సైనిక్‌ వెల్ఫేర్‌ శాఖ కంటిన్‌జెంట్లు కవాతులో పాల్గొన్నాయి.

గురుకుల పాఠశాలలకు చెందిన బాలబాలికల కంటిన్‌జెంట్ల కవాతు చూపరులను ఆకట్టుకుంది. అలాగే, వివిధ ఏపీఎస్పీ బెటాలియన్లకు చెందిన కవాతు కూడా అలరించింది. ఆర్మ్‌డ్‌ విభాగం కవాతులో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ఏపీఎస్పీ 5వ బెటాలియన్‌ మొదటి బహుమతిని, 2వ బెటాలియన్‌ ద్వితీయ బహుమతిని దక్కించుకున్నాయి. రెడ్‌క్రాస్‌ సొసైటీ మొదటి, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల కంటిన్‌జెంట్‌ రెండో బహుమతి దక్కించుకున్నాయి. వీరికి సీఎం బహుమతులు అందజేశారు.  
మూడో బహుమతి పొందిన గృహనిర్మాణ శకటం 
 
సచివాలయాల శకటానికి మొదటి బహుమతి.. 
ఇక సీఎం వైఎస్‌ జగన్‌ సర్కార్‌ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను కళ్లకు కట్టినట్లుగా శకటాల ప్రదర్శన సాగింది. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన 15 శకటాల ప్రదర్శనలు గడిచిన మూడేళ్లలో ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధికి.. రాష్ట్ర ప్రగతికి అద్దంపట్టాయి. గ్రామ, వార్డు సచివాలయాల శాఖకు చెందిన ‘గడప గడపకు మన ప్రభుత్వం–ఇంటింటా సంక్షేమం’ శకటం మొదటి బహుమతిని కైవసం చేసుకుంది. విద్యాశాఖకు చెందిన మనబడి నాడు–నేడు శకటానికి రెండో బహుమతి, గృహ నిర్మాణ శాఖకు చెందిన నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు శకటానికి మూడో బహుమతి దక్కాయి. ఉత్తమ ప్రదర్శన కనబరిచిన శకటాల శాఖాధిపతులు, అధికారులకు సీఎం బహుమతులు అందజేశారు. 

► మొదటి బహుమతి అందుకున్న సచివాలయాల శకటం గడిచిన మూడేళ్లలో సచివాలయాల వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో వచ్చిన మార్పులను తెలియజేసింది. నెలనెలా ఒకటో తేదీ ఉదయాన్నే లబ్ధిదారుల గుమ్మం వద్దనే ఠంచన్‌గా వలంటీర్లు పింఛన్‌ల పంపిణీ, సచివాలయాల ద్వారా ప్రజలకు అందుతున్న వివిధ రకాల సేవలు కళ్లకు కట్టాయి.  
► విద్యాశాఖ శకటం నాడు–నేడు ద్వారా విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు, సంస్కరణలతో కార్పొరేట్‌ స్థాయి హంగులతో ముస్తాబై ప్రభుత్వ పాఠశాల నమూనాతో ప్రత్యేకంగా ఆకట్టుకుంది.  
► ఇక తృతీయ బహుమతి అందుకున్న గృహ నిర్మాణ శాఖ శకటం నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం ద్వారా రాష్ట్రంలో ఇళ్లులేని పేదలకు చేస్తున్న మేలును తెలియజేసింది. రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మంది పేదలకు ఇళ్ల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ఊళ్లను నిర్మిస్తున్న తీరును వివరించింది.     
ఈ వేడుకల్లో సీఎం సతీమణి భారతిరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌శర్మ, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్, ఏపీ జ్యుడిషియల్‌ ప్రివ్యూ చైర్మన్‌ జస్టిస్‌ బి. శివశంకరరావు, ఏపీ ఉన్నత విద్య రెగ్యులేటరీ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ వి. ఈశ్వరయ్య, శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, శాసన మండలి చైర్మన్‌ మోషేన్‌రాజు, రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement