విజయవాడ : నవ్యాంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటి సారిగా జరుగుతున్న గణతంత్ర వేడుకలలో పాల్గొడానికి రాష్ట్రం నలుమూలల నుంచి వీవీఐపీలు, వీఐపీలు తరలివస్తున్నారు. వీరందరికి వసతి కల్పించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దాంతో నగరంలో స్టార్ హోటళ్లు, గెస్ట్‌హౌస్‌లు బుక్ అయిపోయాయి. ప్రముఖులందరూ ఆదివారం రాత్రికే నగరానికి చేరుకుంటారు. నగరంలో స్టార్ హోటళ్లయిన డి.వి.మనార్, గేట్‌వే, మురళీఫార్చ్యూన్, ఐలాపురం, కె హోటల్‌తోపాటు ప్రముఖ హోటళ్లలో గదులు అడ్వాన్స్ బుకింగ్ చేశారు. ఇవిగాక స్టేట్ గెస్ట్‌హౌస్, ఇతర ప్రభుత్వ అతిథి గృహాలను వీఐపీల కోసం రిజర్వ్ చేశారు. సోమవారం గణతంత్ర వేడుకలలో పాల్గొనటానికి రాష్ట్ర ఉన్నతాధికారులు, నాయకులు హాజరు కానున్నారు.
గవర్నర్ నరసింహన్ ఆదివారం సాయంత్రం విమానంలో గన్నవరం చేరుకుంటారు. అనంతరం నగరంలోని స్టేట్ గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు కె.ఇ.కృష్ణమూర్తి, నిమ్మకాయల చిన్న రాజప్ప, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు, పలువురు ఉన్నతాధికారులు, మంత్రులు గణతంత్ర వేడుకలకు రానున్నారు. డీజీపీ రాముడు ఇప్పటికే నగరానికి వచ్చి, ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు.
భారీ భద్రతా ఏర్పాట్లు
నగరానికి ప్రముఖుల రాక సందర్భంగా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి విజయవాడ వరకు తనిఖీలు నిర్వహించారు. నగరంలో హోటళ్లు, గెస్ట్‌హౌస్‌ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.
నేడు సీఎం రాక
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు ఆదివారం రాత్రి నగరానికి రానున్నారు. గణతంత్ర దినోత్సవంలో పాల్గొనటానికి ఆదివారం రాత్రి 7.30గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి రాత్రి 8.15 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 8.30 గంటలకు హోటల్ డీవీ మెనార్‌కు చేరుకుని బస చేస్తారు. 26వ తేదీ సోమవారం ఉదయం 7.40 గంటలకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం చేరుకుని గణతంత్ర వేడుకల్లో పాల్గొంటారు. 9.30 గంటలకు స్టేడియంలో ఏర్పాటు చేసిన తేనీటి విందులో పాల్గొంటారు. 10.30 గంటలకు సిద్ధార్థమెడికల్ కళాశాలలో ఆర్టీసీ బస్‌లకు జెండా ఊపి ప్రారంభిస్తారు.
పల్లె రఘునాథరెడ్డి రాక
రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆదివారం ఉదయం ఆరుగంటలకు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడ చేరుకుంటారు. ఆయన స్టేట్ గెస్ట్‌హౌస్‌లో బస చేస్తారు. గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలిస్తారు. సోమవారం వేడుకలలో పాల్గొంటారు.
హోటళ్లు, గెస్ట్‌హౌస్‌లు ఫుల్
Published Sun, Jan 25 2015 1:49 AM | Last Updated on Tue, Aug 21 2018 11:49 AM
Advertisement
Advertisement