
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి శనివారం గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఓ లేఖను గవర‍్నర్‌కు సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంను చంద్రబాబు ఇష్టానుసారంగా దూషించారని, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో చీఫ్ సెక్రటరీపై వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సివిల్ సర్వీస్ అధికారుల స్ఫూర్తిని దెబ్బతీసేలా చంద్రబాబు వ్యాఖ‍్యలున్నాయని, ఎన్నికల సంఘాన్ని ఉల్లంఘించేలా ఆయన ప్రవర్తించారన్నారు. ఎన్నికల సంఘం తక్షణం రాజ్యాగంలోని ఆర్టికల్ 324ను వాడాలన్నారు. ఆపద్ధర్మ ప్రభుత్వమైనా రూ.32వేల కోట్ల బిల్లులను క్లియర్ చేసే కుట్ర జరుగుతోందని విజయసాయిరెడ్డి తన ఫిర్యాదులో తెలిపారు. వేతనాలు, సాధారణ ఖర్చులు మినహా మిగతా బిల్లులు నిలిపి వేయాలని కోరారు.