ఒంగోలు: చట్టం నుంచి ఎలాగైనా తప్పించుకోవచ్చన్న చంద్రబాబు భ్రమలు నేటితో తొలగిపోయాయని ఎంపీ, వైఎస్సార్‌సీపీ రీజినల్ కోఆర్డినేటర్ వి.విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబుకు ఏసీబీ కోర్టు ఆదివారం రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు వెలువడిన అనంతరం ఆయన ఒంగోలులో మీడియాతో మాట్లాడారు. తాను ఎన్ని అక్రమాలు చేసినా, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు, అధికార దుర్వినియోగానికి పాల్పడినా చట్టం నుంచి తప్పించుకోవచ్చని, స్టేలు తెచ్చుకుని శిక్ష నుంచి తప్పించుకోవచ్చని చంద్రబాబు ఇన్నాళ్లూ భావిస్తూ వచ్చారన్నారు. కానీ నేటితో ఆ భ్రమలు వీడిపోయాయన్నారు. విజయసాయిరెడ్డి ఇంకా ఏమన్నారంటే..
చట్టానికి ఎవరూ అతీతులు కారు. ఎవరైనా చట్టానికి లోబడే వ్యవహరించాల్సి ఉంటుంది. రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ పరిధిలోనే పాలన సాగించాల్సి ఉంటుందని కోర్టు తీర్పుతో నేడు మరోమారు నిరూపితమైంది. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు పదేళ్లు జైలుశిక్ష పడే అవకాశముంది. ఆయనపై ఇంకా 6 లేదా 7 ట్రయిలబుల్ (ప్రాసిక్యూషన్ ) కేసులు ఉన్నాయి.
రాష్ట్ర ఖజానాకు సంబంధించిన సంపదను దోచుకుని, విదేశాలకు ఎలా తరలించారన్న దానిపై విచారించి తిరిగి ఖజానాకు జమచేసేలా సీఎం జగన్ చర్యలు చేపడతారు. నిజానికి.. బాబు అవినీతికి సంబంధించిన అన్ని కేసుల్లో శిక్షపడితే జీవితాంతం జైల్లోనే ఉండే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్‌తోపాటు తదుపరి పోలీసు కస్టడీకి తీసుకుని విచారించడం ద్వారా ఇంకా అనేక అంశాలు బహిర్గతమవుతాయి.
రామోజీ అకృత్యాలు చాలానే..
ఇక రామోజీరావు దారుణాలు, అకృత్యాలు కూడా చాలానే ఉన్నాయి. ఆయన సుప్రీంకోర్టు వరకు వెళ్లి కొన్నింటిలో తప్పించుకున్నారు. కానీ, అన్నింటిని చట్టపరిధిలోనే ధర్మాన్ని నెరవేరుస్తాం. ఉన్నత పదవుల్లో ఉన్నవారు రాష్ట్ర సంపదను దోచుకుని అవినీతికి పాల్పడినప్పుడు కేసు నమోదుచేస్తే అది రాజకీయ కక్ష అవుతుందా? నిజంగా రాజకీయ కక్షే అయితే ఆదివారం ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు అనుకూలంగా తీర్పువచ్చేది. ఒకసారి ఎఫ్‌ఐఆర్ నమోదై, అరెస్టయితే మిగిలిన వ్యవహారమంతా కోర్టు పరిధిలోకి వెళ్తుంది. న్యాయస్థానం ఇచ్చే తీర్పు ప్రకారమే అందరూ నడుచుకోవాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment