సాక్షి, అమరావతి: చంద్రబాబు రాజకీయ జీవితానికి తెరపడిందని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి అన్నారు. తాజా మునిసిపల్ ఫలితాలు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలుపునకు చిహ్నమని అభిప్రాయపడ్డారు. రాబోయే రెండు దశాబ్దాల పాటు సీఎం వైఎస్ జగనే రాష్ట్రాన్ని పరిపాలిస్తారని ఈ ఎన్నికల ఫలితాలు చాటుతున్నాయన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు గ్రహణం పట్టిందని, రాష్ట్రంలో కార్తీక పౌర్ణమి విరబూస్తోందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు పాలనలో సొంత కొడుకు ఓడిపోయాడని, ఇప్పుడు సొంత నియోజకవర్గం కుప్పాన్ని కూడా చంద్రబాబు పోగొట్టుకున్నారన్నారు.
ఇకపై చంద్రబాబు హైదరాబాద్‌లో ప్రవాసాంధ్రుడిలా విశ్రాంతి తీసుకుంటూ.. రామోజీరావును, రాధాకృష్ణను రోజూ కలుసుకుంటూ భవిష్యత్‌పై చర్చించుకోవచ్చని ఎద్దేవా చేశారు. 40 ఏళ్ల అనుభవం, 14 ఏళ్ల ముఖ్యమంత్రి అని చెప్పుకుంటే ఓట్లు పడవని, మంచి చేస్తేనే పడతాయని అన్నారు. ‘తనపై 11 కేసులున్నాయని, అందులో సెక్షన్ 307 కూడా పెట్టారని.. ఏం పీక్కుంటారని లోకేశ్ అడుగుతుంటే కుప్పం పీకేసుకుంటామని ప్రజలు ఈ రోజు తీర్పు ఇచ్చారు. ఏదైనా కేసు ఉంటే.. 48 గంటల్లోనే స్టే తీసుకు వస్తానని లోకేశ్ అంటున్నాడు. ఇది న్యాయవ్యవస్థను కించపరచటం కాదా. కంటెప్ట్ యాక్ట్ కింద లోకేశ్ మీద సుమోటోగా విచారణ చేపట్టిæ శిక్షించాలని హైకోర్టుకు నివేదించుకుంటున్నాను’ అన్నారు.
తండ్రీకొడుకులిద్దరూ సీటు మారాల్సిందే..
చంద్రబాబుకు తన కొడుకు దేనికీ పనికిరాకుండా పోయాడన్న మనస్తాపం తప్ప ఇంకొకటేమీ మిగల్లేదని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. మొన్న మంగళగిరి సీటు పోతే, ఇప్పుడు కుప్పం కూడా పోయిందని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో ఇద్దరూ సీట్లు మారాల్సిందేనన్నారు. కారుపై నిలబడి కాలర్ ఎగరేస్తూ బూతులు తిడితే సీట్లు రావని.. ప్రజాప్రయోజనాలు కాపాడితేనే ప్రజలు ఓట్లు వేస్తారనే విషయాన్ని గుర్తించాలని లోకేశ్‌కు హితవు పలికారు.
మాపై బాధ్యత పెంచిన విజయం: మంత్రి ముత్తంశెట్టి
ప్రజలిచ్చిన తీర్పును తాము వినయంతో, విధేయతతో స్వీకరిస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. ఈ తీర్పు సీఎం వైఎస్ జగన్‌మోహనరెడ్డిపైన, రాష్ట్ర ప్రభుత్వంపైన బాధ్యతను పెంచిందని వ్యాఖ్యానించారు. సర్పంచ్ నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం వరకు ఒకే పార్టీ ఉండటం దేశ చరిత్రలో జరగలేదని, మొదటిసారి ఆంధ్రప్రదేశ్‌లోనే ఇలాంటి ఘనత నమోదైందని మంత్రి పేర్కొన్నారు. ప్రజలు నమ్మకంతో, విశ్వాసంతో ఈ తీర్పు ఇచ్చారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment