సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ పథకం ప్రకారం సామాజిక వర్గమే ప్రాతిపదికగా 37 మందికి డీఎస్పీలుగా అడ్డదారిలో ప్రమోషన్లు ఇచ్చారని, పోస్టింగ్‌లు కట్టబెట్టారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన తాజాగా రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు ఒక లేఖ రాశారు. అక్రమ పదోన్నతులు, పోస్టింగ్‌లపై తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.
చంద్రబాబు పద్ధతి శృతి మించింది
విశ్వసనీయ సమాచారం ప్రకారం గవర్నర్‌కు విజయసాయిరెడ్డి రాసిన లేఖలోని పలు అంశాలివీ.. ‘‘వందలాది కులాలు, అనేక మతాల సమ్మేళనంగా భారతీయ సమాజం వేల సంవత్సరాలుగా వర్థిల్లుతోంది. ఇలాంటి సమాజంలో ప్రతి కులానికీ ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి కులమూ సమాజ అభ్యున్నతికి ఎంతో తోడ్పాటు అందించింది. అధికారంలో ఉన్న వ్యక్తులు అన్ని కులాలు నావే, అందరూ నా వారే అన్న భావనతో పరిపాలన చేయాలని ప్రజలంతా ఆశిస్తారు. ఇలాంటి పరిస్థితి లేనప్పుడు సామాజిక న్యాయం జరగడం లేదని వారు ఆందోళన చేస్తారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఒక సామాజిక వర్గం వారికి మాత్రమే మేలు చేసేవిగా ఉన్నాయన్న అంశం గత ఐదేళ్లలో పలు సందర్భాల్లో మా పార్టీ దృష్టికి వచ్చినా.. ఒక సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని మాట్లాడటం భావ్యం కాదన్న అభిప్రాయంతోనే మా పార్టీ ఈ అంశంపై మౌనం వహిస్తూ వచ్చింది. ఇకపై కూడా ఇదే మా విధానం. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వందలాది కులాలకు ప్రతినిధిగా సాగించిన పరిపాలనే నేటికీ మాకు ఆదర్శం. అయితే, చంద్రబాబు పద్ధతి మాత్రం శృతి మించిపోయింది. పోలీసు పోస్టింగ్‌ల్లో, డీఎస్పీ పదోన్నతుల్లో ఒక సామాజిక వర్గాన్నే చంద్రబాబు పరిగణనలోకి తీసుకోవడంపై ఈ ఉత్తరం రాస్తున్నప్పుడు నా మనసులో అనేక భావాలున్నాయి.
సమాజంలో సమతౌల్యం నెలకొల్పాలి
నిజానికి ఆ సామాజిక వర్గానికి చెందిన చాలామంది దశాబ్దాలుగా వ్యక్తిగతంగా నాకు అత్యంత సన్నిహితులు, ఆప్త మిత్రులు. ఇంకా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల అభివృద్ధిలో, చలనచిత్ర రంగం అభివృద్ధిలో ఆ సామాజిక వర్గం పాత్ర ఎంతో ఉన్నతమైనది. ఆ కులం పట్ల నాకు ఏమాత్రం అగౌరవం లేదు. శత్రుత్వం అంతకన్నా లేదు. అయితే, అధికారుల పోస్టింగ్‌ల్లో, ప్రత్యేకించి పోలీసు పోస్టింగ్‌ల్లో చంద్రబాబు ఒక సామాజిక వర్గం వారిని మాత్రమే ఎంపిక చేసి, వారిని 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మనుషులుగా వాడుకోవాలని ప్రయత్నించడమే ఈ మొత్తం వివాదానికి కారణం. చంద్రబాబు చేష్టలు ప్రాథమిక హక్కులకు, రాజ్యాంగ మౌలిక సూత్రాలకు భంగం కలిగిస్తుండడమే కాకుండా సామాజిక అసమతౌల్యానికి దారితీసి ఒక కులంపై వ్యతిరేకతను పెంచేవిగా ఉన్నాయి. కాబట్టి సమాజంలో సమతౌల్యాన్ని నెలకొల్పడానికి వీలుగా దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కోరుతూ ఈ ఉత్తరం రాస్తున్నాను. నా దృష్టికి వచ్చిన అంశాలను ఉన్నతులైన గవర్నర్ గారి దృష్టికి తీసుకొస్తున్నాను. వీటిపై విచారణ జరిపిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నాను.
విజయసాయిరెడ్డి లేఖలోని ముఖ్యాంశాలు
- జీవో నెంబరు 54 ప్రకారం 2014లో ఇచ్చిన డీఎస్పీ ప్రమోషన్లు తప్పుల తడకలని అప్పటి డీజీపీ హైకోర్టులో ఒప్పుకున్నా, చంద్రబాబు సర్కారు 2019 ఎన్నికలకు ముందు అందులో కొందరికి ప్రత్యేకంగా పోస్టింగ్‌లు ఇవ్వడం ద్వారా వల్లమాలిన ప్రేమ చూపింది.
- చిత్తూరుకు చెందిన డీఎస్పీ కేశప్పను (చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి) అడ్డం పెట్టుకుని చంద్రబాబు తన సొంత సామాజిక వర్గానికి పదోన్నతులు కల్పించారు.
- అనంతపురం స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ రామ్‌కుమార్, చంద్రబాబు అధికార నివాసం దగ్గర విధులు నిర్వహించే అమరనాథ నాయుడులవి పోలీసు ప్రమోషన్లు కావు. అవి కచ్చితంగా అడ్డదారి పొలిటికల్ ప్రమోషన్లే.
- రాష్ట్రంలోని ఐదు రేంజ్‌ల్లో ఉన్న డీఎస్పీ కింది ర్యాంకు పోలీసు ప్రమోషన్లలో సీఎం కార్యాలయం(సీఎంవో) జోక్యంతో అడ్డదార్లే రాజ మార్గాలయ్యాయి.
- ఎస్సై, సీఐలుగా పదోన్నతుల్లో కూడా సీనియారిటీని క్రమబద్ధంగా పాటించకుండా తన వారికి బాబు మార్కు ప్రమోషన్లు ఇచ్చుకున్నారు.
- పదోన్నతుల్లో పాటించాల్సిన రొటేషన్ రూల్సును కూడా ఆ 37 మంది విషయంలో అడ్డగోలుగా ఉల్లంఘించారు.
- ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పని చేసేందుకు అప్పటి ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావు ఈ కుల ప్రమోషన్లు, పోస్టింగ్‌ల పథకానికి రూపకల్పన చేశారు.
- నిబంధనలు పాటించకుండా ఘట్టమనేని శ్రీనివాస్‌కు హడావిడిగా ప్రమోషన్ ఇచ్చి, గుంటూరు రేంజ్ ఎన్నికల ఇంటెలిజెన్స్ బాధ్యతలు అప్పగించడం ఇందుకు ఒక ఉదాహరణ.
- బాబు సామాజిక వర్గానికి చెందిన పోలీసు ఉన్నతాధికారుల అండదండలతో గుంటూరు రేంజ్‌కి చెందిన వారికి ఇచ్చిన ప్రమోషన్లపై చివరకు ఏలూరు రేంజ్ పోలీసులు నేరుగా సచివాలయానికి వచ్చి, ఈ దుర్మార్గాలను ఆపాలని డిమాండ్ చేశారంటే బాబు కులపిచ్చి ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు.
- సీనియారిటీని తేల్చి, ప్రమోషన్లలో లోపాలను సరిదిద్దడానికి కేబినెట్ సబ్ కమిటీ వేయాలని, న్యాయం చేయాలని ఏలూరు రేంజ్ అధికారులు అడుగుతున్నా పట్టించుకోకుండా చంద్రబాబు ప్రభుత్వం తన వారు, కానివారు అంటూ పోలీసు ప్రమోషన్లు, పోస్టింగ్‌ల్లో తన దుర్మార్గాన్ని కొనసాగించింది.
- చంద్రబాబు తన కులం అధారంగా ఎన్నికలను ప్రభావితం చేయడానికి ఈ పోస్టింగ్‌లు ఇచ్చారన్న అంశంపై వెంటనే విచారణకు ఆదేశించాలని కోరుతున్నా.
- విచారణలో తప్పులు రుజువైతే వెంటనే ఈ పదోన్నతులు, పోస్టింగ్‌లను రద్దు చేయాలి. అక్రమంగా పదోన్నతులు, పోస్టింగ్‌లు పొందినవారిని డిమోట్ చేయాలి. ఇంతటి దుర్మార్గానికి పథకం వేసిన వారిని, అమలు చేసిన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టొద్దు. కచ్చితంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నా.
Comments
Please login to add a commentAdd a comment