విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో చురుగ్గా జరుగుతున్న పనులు
సాక్షి, అమరావతి, విజయవాడ: ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ సంచలన విజయానికి సారథ్యం వహించి ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాలని పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. గురువారం మధ్యాహ్నం 12.23 గంటల ముహూర్తానికి విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడికి ఫోన్ చేసిన వైఎస్ జగన్ తన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాలని ఆహ్వానించారు. అయితే చంద్రబాబు హాజరవుతారా లేదా? అనేది తెలియ రాలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు ఆ రాష్ట్ర ప్రభుత్వంలోని పలువురు ముఖ్యులు, తమిళనాడుకు చెందిన డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరు కానుండటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చే ప్రముఖులపై గురువారం ఉదయం స్పష్టత రావచ్చని తెలుస్తోంది.
ఆర్భాటానికి దూరంగా ఏర్పాట్లు..
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి జనం వెల్లువలా పోటెత్తే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. వేదికపై తొలుత వైఎస్ జగన్‌తో రాష్ట్ర ముఖ్యమంత్రిగా గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం వైఎస్ జగన్ ముఖ్యమంత్రి హోదాలో ప్రజల నుద్దేశించి తొలి ప్రసంగం చేస్తారు. ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి ఘన విజయం చేకూర్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలపడంతోపాటు తాను అందించాలనుకుంటున్న సుపరిపాలన ఎలా ఉంటుందనే విషయాన్ని ఆయన వివరిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రాభివృద్ధిపై తనకున్న దూరదృష్టి, ప్రజా సంక్షేమ పథకాల అమలు తీరును కూడా వెల్లడిస్తారు. కేంద్ర ప్రభుత్వంతో ఉండబోయే సంబంధాలపై కూడా ప్రసంగిస్తారు. ఆర్థిక భారం, ఆర్భాటానికి తావు లేకుండా సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో తన ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లు చేయాలని జగన్ ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, డీజీపీ ఠాకూర్ మంగళవారం తాడేపల్లిలో జగన్‌ను ఆయన నివాసంలో కలుసుకుని ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్ల గురించి వివరించారు.
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
భారీగా మజ్జిగ ప్యాకెట్లు, లస్సీ, మంచినీరు
ఎండల తీవ్రత దృష్ట్యా ప్రమాణ స్వీకారోత్సవ వేదిక ప్రాంగణంలో తాగునీటి సరఫరాపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. 2 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, లక్ష లస్సీ ప్యాకెట్లు, 3 లక్షల మంచినీటి పాకెట్లను సిద్ధం చేస్తున్నారు. 25,000 – 35,000 మంది సామర్థ్యం కలిగిన ఇందిరాగాంధీ స్టేడియంలో కార్యక్రమాన్ని వీక్షించే వారి కోసం పైభాగంలో 20 గ్యాలరీలు, కింది భాగంలో వేదిక వద్ద 15 గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి గ్యాలరీకి ఒక తహశీల్దారును ఇన్‌చార్జిగా నియమించారు.
మొత్తం 10,500 పాసులు జారీ
ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం సందర్భంగా మొత్తం 10,500 పాసులు జారీ చేయనున్నారు. సాధారణ పరిపాలన శాఖ జారీ చేసే ఈ పాసుల్లో డబుల్ ఏ, ఏ 1, ఏ 2, బీ 1, బీ 2 క్యాటగిరీలున్నాయి. ఇవి కాకుండా ప్రెస్ పాసులు అదనంగా జారీ చేస్తారు. డబుల్ ఏ నుంచి బీ 2 పాసులు ఉన్న వారు గేట్ 2 వీఐపీ ఎంట్రన్స్ నుంచి లోపలకు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. వాటర్ ట్యాంకు రోడ్డు వైపున ఉన్న 6వ గేట్ నుంచి ప్రెస్ గ్యాలరీకి వెళ్లాల్సి ఉంటుంది. అదేవైపు 6వ నెంబర్ గేట్ వద్ద సాధారణ ఆహ్వానితులకు ప్రవేశం కల్పించారు. కింద 15 గ్యాలరీల్లో వీవీఐపీలు, వీఐపీలు, ఆయా రంగాల ప్రముఖులు ఉంటారు. పైన ఉండే గ్యాలరీల్లో ఎక్కువగా సాధారణ పౌరులుంటారు. ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యే వారంతా 10 గంటల లోపే చేరుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. బయట ప్రాంతాల నుంచి విజయవాడ వచ్చే వాహనాలను క్రమబద్ధం చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు.
వాహనాల పార్కింగ్ ఇలా...
డబుల్ ఏ పాస్‌లు కలిగిన వాహనాలు ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో, ఆర్‌అండ్‌బీ గ్రౌండ్ బిల్డింగ్ ఆవరణలో, ఏ1 పాస్‌లున్న వాహనాలు ఏఆర్ గ్రౌండ్స్‌లో, ఏ 2 పాస్‌లు కలిగిన వారు స్వరాజ్య మైదానంలో, బీ 1 పాస్‌లు కలిగిన వాహనాలు బిషప్ అజరయ్య స్కూల్‌లో, బి 2 పాస్‌లు కలిగిన వాహనాలు స్టేట్ గెస్ట్‌హౌస్‌లో, సాధారణ ఆహ్వానితులు (సీ టు ఎన్ గ్యాలరీ ) స్వరాజ్య మైదానం, సబ్–కలెక్టర్ ఆఫీస్, సీఎస్‌ఐ చర్చిలలో వాహనాలను పార్కింగ్ చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ ఏ.ఎండీ. ఇంతియాజ్ సూచించారు. పాస్‌లు లేని వారు సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజ్, సిద్ధార్థ పబ్లిక్ స్కూల్, లయోలా కాలేజి, ఈఎస్‌ఐ హాస్పటల్ ఆవరణలో పార్కింగ్ చేసుకోవాలని పేర్కొన్నారు. మరోవైపు స్టేడియంలో భద్రతా ఏర్పాట్లను పోలీస్ శాఖకు చెందిన ఇంటర్నల్ సెక్యూరిటీ వింగ్ ఎస్పీ సెంథిల్ కుమార్, ఇంటెలిజెన్స్ వింగ్ ఎస్పీ గీతాదేవి, జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, ఇతర అధికారులు పరిశీలించారు. స్టేడియం ప్రధాన ద్వారం నుంచి లోపలకు వెళ్లి బారికేడ్లను, గ్యాలరీలను పరిశీలించారు.
ఏర్పాట్లను పరిశీలించిన పార్టీ అగ్రనేతలు
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఏర్పాట్లను వైఎస్సార్ సీపీ అగ్రనేతలు మంగళవారం పరిశీలించారు. పార్టీ సీనియర్ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, తలశిల రఘురాం, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వైవీ సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణతోపాటు జోగి రమేష్, లేళ్ల అప్పిరెడ్డి తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామని తలశిల రఘురామ్ తెలిపారు. రెండంతస్తులు ఉండే గ్యాలరీల్లో దాదాపు 40 వేల మంది వరకూ కూర్చొనే వీలుంటుందని, పాస్‌లు లేనివారు ఈ గ్యాలరీల్లో కూర్చోవాలని కోరారు. గ్యాలరీల్లో ఉన్నవారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా, ఎండ నుంచి రక్షణగా షామియానాలు ఏర్పాటు చేశామని తెలిపారు. స్టేడియం వెలుపల ఉన్నవారు కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశామన్నారు.
వైఎస్ జగన్‌ను కలసిన ద్వివేది
సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న వైఎస్ జగన్‌ను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది, అదనపు ప్రధాన ఎన్నికల అధికారులు వివేక్ యాదవ్, సుజాత శర్మ మంగళవారం ఆయన నివాసంలో కలిశారు. విశాఖ సీపీ మహేశ్‌చంద్ర లడ్హా, ఐపీఎస్ అధికారులు కె.వెంకటేశ్వరావులు కూడా జగన్‌ను కలిసిన వారిలో ఉన్నారు. మరోవైపు ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులుగా పోటీ చేసిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆమంచి కృష్ణమోహన్ మంగళవారం సాయంత్రం వైఎస్ జగన్‌ను కలిసి తమ నియోజకవర్గాల్లో తాజా పరిస్థితిపై వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment