
::: మూడు నెలల క్రితం బల్గేరియాలో జరిగిన ఆర్యన్ ముఖర్జీ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో ఆలియా భుజానికి అయిన గాయం పూర్తిగా తగ్గకుండానే ఇప్పుడు మళ్లీ అభిషేక్ వర్మ ‘కళంక్’ షూటింగ్‌లో ఆమె కాలికి తీవ్ర గాయం అయింది. బ్రహ్మాస్త్రలోని ఆలియా సహనటులు రణబీర్ కపూర్, అమితాబ్‌బచ్చన్; ‘కళంక్’ తారలు వరుణ్ ధావన్, ఆదిత్యారాయ్ కపూర్, సోనాక్షీ సిన్హాల టైట్ షెడ్యూళ్లకు ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఆలియా షూటింగ్ విరామ సమయాల్లోనే తన రెండు గాయాలకూ కాస్త విశ్రాంతినిస్తూ ఈ రెండు చిత్రాలను ఏకకాలంలో చేస్తున్నారు ::: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రెండేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్న పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్ వేముల మరణానికి ప్రధాని నరేంద్ర మోదీనే కారణం అని అతడి తల్లి రాధిక వేముల ఆరోపించారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడేందుకు ‘ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్’ (ఐ.యు.ఎం.ఎల్) తనకు డబ్బు ఇచ్చిందన్న విమర్శలను ఖండిస్తూ, పదవీ విరమణ పొందిన ‘ఐఏఎస్ అధికారుల సంఘం’ చేత ఇంటి స్థలాన్ని విరాళంగా ఇప్పించి, ఆ స్థలంలో ఇల్లు కట్టించి ఇస్తామని మాత్రమే కేరళలోని ఐ.యు.ఎం.ఎల్ తనకు హామీ ఇచ్చింది తప్ప డబ్బురూపంలో ఏమీ ఇవ్వలేదని రాధిక స్పష్టం చేశారు.
మాజీ ఇండియన్ క్రికెట్ కెప్టెన్ ఎం.ఎస్.ధోనీ భార్య సాక్షి ధోని ఆయుధ లైసెన్స్ కోసం రాంచీ జిల్లా యంత్రాంగానికి దరఖాస్తు చేసుకున్నారు. రాంచీలో తనెప్పుడూ ఒంటరిగానే ఉంటున్నందున తన ప్రాణాలకు రక్షణ అవసరమనీ, రోజూ తను ఇంటి నుండి బయటికి వెళ్లి వచ్చేటప్పుడు కూడా భద్రత అవసరం కనుక తన దగ్గర రివాల్వర్‌ను ఉంచుకునేందుకు అనుమతించాలని సాక్షి ఆ దరఖాస్తులో కోరారు ::: దేశ రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ జమ్మూకశ్మీర్‌లోని పూం^Œ కి వెళ్లి, ఇటీవల ఉగ్రవాదులకు చిక్కి, వారి చేతుల్లో చిత్రహింసలకు గురై మరణించిన ఆర్మీ రైఫిల్‌మేన్ ఔరంగజేబుకు నివాళులు అర్పించి, ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆ వీర జవాను ఇంట్లో నేలపై కూర్చున్న సీతారామన్ ఉద్వేగానికి గురై, ‘మీకు అండగా మేము ఉంటాము’ అని చెమర్చిన కళ్లతో ఆ జవాను తల్లికి భరోసా ఇచ్చారు ::: ఇటీవలి వివాదాస్పద బాలీవుడ్ చిత్రం ‘వీరె ది వెడ్డింగ్’ (నా స్నేహితురాలి పెళ్లి)లోని దేహవాంఛను స్థిమిత పరిచే ‘స్వయంతృప్తి’ సన్నివేశంలో నటించిన స్వరాభాస్కర్ సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శలకు గురవుతున్నారు. అయితే.. స్త్రీవాంఛలపై నోరు విప్పని మన సంస్కృతిలో ఇలాగైనా కొంత చర్చ జరుగుతుండడం ఆరోగ్యకరమైన పరిణామమేనని స్వరా అంటున్నారు.
యాభై మూడేళ్ల ఆస్కార్ నటి శాండ్రా బుల్లక్.. కెరియర్ కొత్తలో తనకు ఎదురైన అనుభవం గురించి చెబుతూ, అప్పట్లో హాలీవుడ్‌లో అత్యంత శక్తిమంతుడైన ఒక నిర్మాత తనకు అవకాశం ఇచ్చినందుకు ప్రతిఫలంగా తనను కోరుకున్నాడని, అయితే అందుకు మనస్కరించక ఆ అవకాశాన్ని చిరునవ్వుతో వదులుకున్నానని ‘టైమ్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇలాంటి ఇరకాటంలో తనెప్పుడూ ‘ప్లీజ్ జస్ట్ ఫైర్ మీ’ (మీరొద్దు మీ అవకాశం వద్దు) అనే సిద్ధాంతాన్నే పాటిస్తానని చెప్పారు ::: యు.ఎస్.లోని వర్జీనియాలో ఒకటో తరగతి చదువుతున్న శారా గోమెజ్ లేన్ అనే చిన్నారి గూగుల్ డూడుల్ కంటెస్ట్‌లో డైనోసార్ బొమ్మను గీసి 20 లక్షల 50 వేల రూపాయలకు సమానమైన 30 వేల డాలర్ల ప్రైజ్ మనీ గెలుచుకుంది! యు.ఎస్. ఆ చుట్టపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన లక్షా 80 వేల ఎంట్రీలన్నిటిలోకీ తెల్ల కాగితంపై రంగు పెన్సిళ్లతో శారా గీసిన డైనోసార్ బొమ్మను చూసి జడ్జిలుగా వచ్చిన ఉద్ధండులు ముగ్ధులయ్యారని గూగుల్ వెల్లడించింది ::: యోగా డే సందర్భంగా ఢిల్లీలో స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ మంత్రి మనేకాగాంధీ గర్భిణుల చేత తేలికపాటి యోగాసనాలు వేయించారు. ‘హెల్దీ అండ్ హ్యాపీ ప్రెగ్నెన్సీ’ కోసం మనేకా ఏర్పాటు చేయించిన ఈ ప్రత్యేక యోగా కార్యక్రమంలో సుఖ ప్రసవానికి దోహదపడే ఆసనాలను గర్భిణులకు నిపుణులు నేర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment