అర్చనా సింగ్ పోలీస్ కానిస్టేబుల్. కొత్వాలి స్టేషన్‌లో ఆమె డ్యూటీ. కొత్వాలి ఝాన్సీ జిల్లాలో ఉంది. ఝాన్సీ జిల్లా ఉత్తర ప్రదేశ్‌లో ఉంది. అర్చనకు 30 ఏళ్లు. పెళ్లైంది. పదేళ్ల కూతురు, ఇంకో ఆర్నెల్ల కూతురు ఉన్నారు. భర్తకు హరియాణాలో ఉద్యోగం. ప్రైవేట్ కంపెనీలో చేస్తాడు. అర్చన తల్లిదండ్రులు కాన్పూర్‌లో ఉంటారు. అర్చన పెద్ద కూతురు కాన్పూర్‌లో అమ్మమ్మ, తాతయ్యల దగ్గర పెరుగుతోంది. భర్తకు, తల్లిదండ్రులకు, పెద్ద కూతురికి దూరంగా అర్చన 2016 నుంచి కొత్వాలీలో డ్యూటీ చేస్తోంది. ఇప్పుడు నెలల బిడ్డ, తను ఉంటున్నారు. ఆదివారం ఉదయం అకస్మాత్తుగా ఉత్తర ప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అర్చనను పిలిపించారు. ఆమెతో కొద్దిసేపు మాట్లాడారు. ఆ తర్వాత అర్చనను ఆగ్రాకు బదలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు! అర్చన సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయింది. ఏం జరిగిందో ఆమెకు తెలియలేదు. కానైతే మంచే జరిగింది. తను కోరుకుంటున్నదే జరిగింది. ఆగ్రాలో ఉంటే పెద్దకూతురితో, భర్తతో కలిసి ఉండేందుకు వీలవుతుంది. తల్లిదండ్రులూ దగ్గరగా ఉంటారు. కుటుంబ సభ్యులతో ఉంటూ రోజూ డ్యూటీకి వెళ్లి రావడమంత సంతోషం ఏముంటుంది.. ఈ చిన్ని జీవితానికి! ఆమెకు ఇంతటి ‘మహర్దశ’ను పట్టించింది చిన్న కూతురు. ఎప్పట్లాగే ఆ.. నెలల బిడ్డను తనతో పాటు డ్యూటీకి తెచ్చిన అర్చన ఆ బిడ్డను తన కళ్ల ఎదుటే ఓ బల్ల మీద ఉంచి తన పనిలో తను ఉన్నప్పుడు ఎవరో ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఆ ఫొటోను చూసిన వెంటనే లక్నోలోని ‘టైమ్స్’ పత్రిక ఆమె గురించి రాసింది. ఆ వార్త చదివిన డీజీపి వెంటనే అర్చనకు ‘వరం’ ఇచ్చారు. అన్నీ వెంట వెంటనే! అర్చనైతే చాలా హ్యాపీగా ఉంది. డీజీపీని, కొత్వాలీలో తనతో కలిసి పని చేసినవారిని, తనను కలుపుకుని పనిచేసినవారిని, పత్రికా ప్రతినిధులను తలచుకుని తలుచుకుని ధన్యవాదాలు తెలుపుతోంది. ఇప్పుడిక అర్చన తన విధులను మరింత ధ్యాసగా నిర్వర్తించడానికి ఆమె కుటుంబం ఆమెకు తోడ్పడుతుంది. అర్చన గురించి డీజీపీ తను చదివిన వార్తను ట్యాగ్ చేస్తూ ఏం ట్వీట్ చేశారో చూడండి. ‘‘21 శతాబ్దపు అచ్చమైన మహిళ. ఏ బాధ్యతనైనా నిబద్ధతతో చేస్తుంది. అందుకు ఒక నిదర్శనం అర్చన.’’
ఆపిల్ కో–ఫౌండర్ స్టీవ్ జాబ్స్ నలుగురి పిల్లల్లో పెద్దమ్మాయి లీసా బ్రెనన్ రచయిత్రి. ఆమె కొత్త పుస్తకం ‘స్మాల్ ఫ్రై’ ఇటీవలే మార్కెట్‌లోకి వచ్చింది. ఆ పుస్తకంలోని కొన్ని భాగాల్లో తండ్రితో తనకున్న అనుబంధం గురించి ప్రత్యేకంగా రాసుకున్నారు లీసా. స్టీవ్ జాబ్స్ 2011 అక్టోబర్‌లో క్యాన్సర్‌తో చనిపోయారు. ఆపిల్ కంపెనీ పెట్టే ప్రయత్నాల్లో ఉన్నప్పుడు తను ప్రేమించిన యువతితో విడిపోయి పక్కకు వచ్చేశాడు స్టీవ్. ఆ తర్వాతి ఏడాది పుట్టిన అమ్మాయే లీసా. అయితే స్టీవ్ ఆమెను తన కూతురు కాదనేశాడు. వైద్యపరీక్షల్లో నిర్ధారణ అయ్యాక గానీ లీసాకు తనే తండ్రి అని అంగీకరించలేక పోయాడు. ఇవన్నీ లీసా పెద్దగా మనసులో పెట్టుకున్నట్లు లేదు. తొమ్మిదేళ్ల వయసులో తండ్రితో కలిసి స్కేటింగ్‌కి వెళ్లే టప్పుడు వాళ్లిద్దరి మధ్య సంభాషణ ఎలా ఉండేదో తన ‘స్మాల్ ఫ్రై’ పుస్తకంలో ఒక చోట రాశారు లీసా. ‘‘హే, స్మాల్ ఫ్రై, లెట్ అజ్ బ్లాస్ట్. వియ్ ఆర్ లివింగ్ ఆన్ బారోడ్ టైమ్’’ అనేవారట స్టీవ్. ‘అరువు తెచ్చుకున్న సమయాన్ని ఉత్తేజంతో నింపుకుందాం’ అని ఆయన మాటలకు అర్థం. లీసాకు అది అర్థం అయింది కానీ, ‘స్మాల్ ఫ్రై’ అనే మాటను తనకు తెలిసిన అర్థంలోనే తీసుకుని, తను కూడా తండ్రిని.. ‘ఓకే ఫ్యాట్ ఫ్రై, లెటజ్ గో’ అనేదట. ‘స్మాల్ ఫ్రై’ అనే మాటకు రెండు అర్థాలున్నాయి. ప్రాముఖ్యంలేని మనిషి లేదా వస్తువు అనేది ఒక అర్థం. పిల్ల చేప అనేది ఇంకో అర్థం. ఇవి రెండూ కాకుండా.. లీసా అనుకున్న అర్థం వీటికి భిన్నమైనది. ఫ్రెంచి ఫ్రైస్ ఉంటాయి కదా.. బంగాళ దుంపలతో చేసేవి.. వాటిల్లో తినగా అడుగున మిగిలిపోయిన తునకల్ని స్మాల్ ఫ్రైస్ అంటారని అనుకున్న లీసా.. తనను అంత మాట అన్న తండ్రిపై ప్రతీకారంగా ‘ఫ్యాట్ ఫ్రై’ అనేసిందట. ఆ తర్వాత తెలుసుకుందట.. తండ్రి తనను పిల్ల చేప (ఎదుగుతున్న చేప) అనే అర్థంలో ‘స్మాల్ ఫ్రై’ అని అన్నాడని. చివరికి అదే మాటను ఆమె తన పుస్తకానికి టైటిల్‌గా పెట్టుకున్నారు.
స్త్రీలోక సంచారం
Published Tue, Oct 30 2018 12:27 AM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment