![Womens empowerment:Sara Ali Khan makes her Instagram debut - Sakshi](/styles/webp/s3/article_images/2018/08/16/Untitled-3.jpg.webp?itok=qOBkbURQ)
స్కూలు నిబంధనల ప్రకారం నీలం రంగు రిబ్బన్‌లకు బదులుగా నల్లరంగు రిబ్బన్లు కట్టుకుని వచ్చిన నాల్గవ తరగతి విద్యార్థిని జడను స్కూలు టీచరు కత్తిరించిన ఘటన రంగారెడ్డి జిల్లా యాచారంలోని సెయింట్ స్టీఫెన్స్ హైస్కూల్లో జరిగింది! ఇటీవల హిమాయత్ నగర్‌లోని ఆక్స్‌ఫర్డ్ గ్రామర్ స్కూల్లోనూ ఇలాగే ఒక టీచరు.. జడ సరిగా వేసుకురాని నాల్గవ తరగతి విద్యార్థినిని బెత్తంతో కొట్టడాన్ని గుర్తు చేస్తూ, ‘‘డ్రెస్ కోడ్ పెట్టడం ఎందుకు, కోడ్‌ను పాటించడం లేదని పిల్లల్ని దండించడం ఎందుకు అని ఈ సందర్భంగా ‘బాలల హక్కుల సంఘం’ గౌరవాధ్యక్షులు అచ్యుతరావు స్కూలు యాజమాన్యాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ ఎస్.ఆర్.నగర్‌లో ఒక ప్రైవేటు స్కూలు టీచరు స్కూలు వెళుతుండగా ముహమ్మద్ సొహెల్ (26) అనే యువకుడు ఆమెను వెంబడిస్తూ, అసభ్యంగా మాట్లాడడమే కాకుండా, ఆమె చెయ్యి పట్టుకున్న నేరానికి పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిపై సెక్షన్ 354–డి (స్టాకింగ్.. వెంబడించడం) కేసు పెట్టి, పద్నాలుగు రోజులు రిమాండుకు పంపారు.
ప్రపంచంలోనే అత్యధికంగా ముస్లిం జనాభా గల ఇండోనేషియాలో రెండేళ్ల క్రితం మిలియానా అనే 44 ఏళ్ల చైనా సంతతి మహిళ.. స్థానిక మసీదుల లౌడ్ స్పీకర్‌ల నుంచి శబ్దకాలుష్యం వెలువడుతోందని ఫిర్యాదు చేయడం ద్వారా దైవదూషణకు పాల్పడడమే కాకుండా.. బౌద్ధ, ముస్లిం వర్గాల మధ్య హింస చెలరేగడానికి ఆమె కారణం అయ్యారన్న ఆరోపణలపై ఆనాటి నుండీ కోర్టులో నడుస్తున్న వాదోపవాదాలు ఇవాళ (గురువారం) ఒక కొలిక్కి రాబోతున్నాయి. మసీదు లౌడ్ స్పీకర్లను శబ్దకాలుష్య కారకాలు అనడం ద్వారా ‘దైవదూషణ’ నేరానికి పాల్పడిందంటూ అందిన మరొక ఫిర్యాదుపై పోలీసులు ఈ ఏడాది మే 18న మిలియానా అరెస్టు చేయగా, ఆ నేరానికి గాను ఆమెకు కనీసం ఏడాదిన్న జైలుశిక్ష విధించాలని ప్రతి న్యాయవాదులు కోరుతున్నారు.
నార్త్ కరొలినా, పైన్‌విల్‌లోని ఒక షాపింగ్ మాల్‌లో పిల్లల స్కూలుకు అవసరమైన సామగ్రిని కొనుగోలు చేసేందుకు వచ్చిన షిరెల్ బేట్స్ అనే ‘కవలల గర్భిణి’పై అనుమానంతో మాల్ మేనేజర్ పోలీసును పిలిపించి, ఆమె బట్టల కింద ఏముందో చూపించాలని అడిగించడం, అందుకు సమాధానంగా అమె ‘నా బట్టల కింద ఉన్నది ట్విన్స్’ అని నవ్వుతూ చెప్పినా ఆ పోలీసు వినకపోవడంతో ఆమె తన తన షర్టును కొంత భాగం వరకు పొట్ట పైకి లేపి గర్భాన్ని చూపించాల్సి రావడం వివాదాస్పదం అయింది. అప్పటికే ఇద్దరు పిల్లల తల్లి అయిన ఆ గర్భిణి, తనను దొంగగా అనుమానించారని కొన్ని నిముషాల తర్వాత ఆలస్యంగా తెలుసుకుని, ఆవేదన చెందడంతో ఆమెకు క్షమాపణ చెప్పిన మాల్ యాజమాన్యం ఆ మేనేజర్‌ను తొలగించి, ఆమె కొనుగోలు చేసిన సామగ్రి అంతటికీ డబ్బును వెనక్కి తిరిగి ఇచ్చేసింది.
మగవాళ్లది మాత్రమే అనుకుంటున్న క్రికెట్ సామ్రాజ్యంలోకి కొత్తగా ఇప్పుడు ఇద్దరు మహిళలు కొత్త ‘జాబ్’లోకి వచ్చేందుకు.. నేషనల్ క్రికెట్ అకాడమీ నిర్వహించిన ‘పిచ్ మేకింగ్’ కోర్సును విజయవంతంగా పూర్తి చేశారు. జూలై 16 నుంచి 29 వరకు జరిగిన ఈ పిచ్–మేకింగ్ కోచింగ్ కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 29 మంది దరఖాస్తు చేసుకోగా అందులో ఇద్దరు మహిళలు.. జసింతా కల్యాణ్ (కర్నాటక), శివాంగీ ఘోష్ (ఒడిశా).. ఉండడంపై బి.సి.సి.ఐ. ‘గ్రౌండ్ అండ్ పిచ్ కమిటీ’ అధికారి ఒకరు హర్షం వ్యక్తం చేశారు.
తొలిచిత్రం ‘కేదార్‌నాథ్’ విడుదలకు ఇంకా సమయం ఉండగానే స్టార్ స్టేటస్‌కి చేరుకున్న సైఫ్ అలీఖాన్, అమృతాసింగ్ (సైఫ్ మాజీ భార్య)ల ముద్దుల కుమార్తె సారా అలీఖాన్‌పై.. సోషల్ మీడియాలో ఆమె సాక్షాత్కారం కోసం.. అభిమానుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది! సారా పుట్టిన రోజైన ఆగస్టు 12న ఆమె ప్రమేయం లేకుండానే అమె ఫ్యాన్స్ ‘సారా అలీ ఖాన్ ఆన్ సోషల్ మీడియా’ అనే హ్యాష్‌టాగ్‌ను సృష్టించి ఆమెకో సామ్రాజ్యాన్ని నిర్మించి ఇవ్వగా.. మరికొందరు, కనీసం తన బర్త్‌డే కైనా సారా ఇంటర్నెట్‌లో ఒక అకౌంట్ ఒపెన్ చేసి ఉండే బాగుండేది కదా అని పోస్టుల మీద పోస్టుల పెట్టడంతో ఎట్టకేలకు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రవేశించి, అభిమానులను పరవశింపజేశారు. నేపాలీ సంతతి భారతీయ నటి మనీషా కొయిరాల జన్మదినం నేడు. సంజయ్‌దత్ జీవిత చరిత్రపై ఇటీవల వచ్చిన రాజ్‌కుమార్ హిరానీ చిత్రం ‘సంజు’లో కనిపించిన మనీషా.. 2012 తర్వాతి నాటి తన క్యాన్సర్ అనుభవాలతో రాస్తున్న ‘ది బుక్ ఆఫ్ అన్‌టోల్డ్ స్టోరీస్’ని ‘పెంగ్విన్’ సంస్థ త్వరలో పుస్తకంగా ప్రచురించబోతోంది.
భారతదేశంలోని ఉత్తరాది మహిళల్తో పోల్చి చూస్తే దక్షిణాది మహిళల్లో స్థూలకాయ సమస్య ఎక్కువగా ఉందని ‘నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే’ నిర్వహించిన (ఎన్.ఎఫ్.హెచ్.ఎస్) తాజా అధ్యయనంలో వెల్లడయింది. అధిక బరువు, లేదా స్థూలకాయం ఉన్న మహిళలు కేరళలో 34 శాతం మంది ఉండగా, తర్వాతి మూడు స్థానాల్లో తమిళనాడు (24.4 శాతం), ఆంధ్రప్రదేశ్ (22.7 శాతం), కర్ణాటక (17.3) రాష్ట్రాలు ఉన్నాయని ఎన్.ఎఫ్.హెచ్.ఎస్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment