సంప్రదాయ ముస్లిం మెజారిటీ గల పాకిస్థాన్ దేశ న్యాయ చరిత్రలో ఒక మహిళ న్యాయమూర్తిగా జస్టిస్ ఆయేషా మాలిక్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీం కోర్టులోని సెరిమోనియల్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి గుల్జార్ ఆహ్మద్ 55 ఏళ్ల జస్టిస్ మాలిక్‌తో ప్రమాణం చేయించారు. దీనికి పెద్ద సంఖ్యలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, అటార్నీ జనరల్, లాయర్లు, లా అధికారులు.. హాజరయ్యారు.
జస్టిస్ మాలిక్ 2012లో లాహోర్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఇప్పుడు మొట్టమొదటి మహిళా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ విధంగా పాకిస్థాన్ న్యాయవ్యవస్థలో చరిత్ర సృష్టించారు ఆయేషా మాలిక్. జూన్ 2031లో పదవీ విరమణ పొందేవరకు ఆమె సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కొనసాగుతారు. జస్టిస్ మాలిక్ పదోన్నతిని అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ఆమోదించినట్లు న్యాయ మంత్రిత్వ శాఖ గత శువ్రారం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. జూన్ 2030లో పాకిస్తాన్ ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం కూడా ఆయేషా మాలిక్‌కు ఉంది. ఆ విధంగా ఆమె మళ్లీ పాకిస్థాన్ మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి గా చరిత్రలో నిలిచిపోనున్నారు.
ఆమె ఘనతను చెప్పే స్థాయి..
వేడుక ముగిసిన తర్వాత చీఫ్ జస్టిస్ అహ్మద్ విలేకరులతో మాట్లాడుతూ ‘జస్టిస్ మాలిక్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యేంత సమర్ధురాలు, ఆమె ఘనతను చెప్పేంత స్థాయి ఎవరికీ లేదు’ అన్నారు. సమాచార శాఖ మంత్రి ఫవాద్ చౌదరి, జస్టిస్ మాలిక్ సాధించిన ‘మైలు రాళ్ల’కు అభినందనలు తెలిపారు. శ్రీ ఫవాద్ ట్వీట్ చేస్తూ ‘ఒక శక్తిమంతమైన చిత్రం. పాకిస్థాన్‌లో మహిళా సాధికారతకు ప్రతీక’ అని ప్రమాణ స్వీకారోత్సవ చిత్రంతో పాటు, జస్టిస్ ఆయేషా దేశ ‘న్యాయ వ్యవస్థ’కు ఒక ఆస్తిగా ఉంటారని ఆశిస్తున్నాను’ అని తెలిపారు.
మహిళ అనే ఆశ్చర్యమా!
లాహోర్ హైకోర్టు న్యాయమూర్తుల సీనియారిటీ జాబితాలో నాల్గవ స్థానంలో ఉన్నప్పటికీ జస్టిస్ మాలిక్ అత్యుత్తమ స్థానానికి ఎంపికైనప్పుడు చాలామంది తమ కనుబొమలను పైకెత్తారు. ఆమె నామినేషన్‌ను పాకిస్థాన్ జ్యుడీషియల్ కమిషన్ (జేసీపీ) గతేడాది తిరస్కరించింది. కానీ, కమిషన్ ఈ నెల ప్రారంభంలో ఆమె పేరును రెండోసారి పరిశీలనకు తీసుకురాగా స్వల్ప మెజారిటీతో ఆమెదించింది. అత్యున్నత న్యాయవ్యవస్థకు న్యాయమూర్తులను నామినేట్ చేసే అత్యున్నత సంస్థ జెసీపీ సమావేశానికి చీఫ్ జస్టిస్ అహ్మద్ అధ్యక్షత వహించారు.
సుపీరియర్ జ్యూడీషియరీ నియామకంపై జేసీపీ తర్వాత ద్వైపాక్షిక పార్లమెంటరీ కమిటీ ఆమోదం కోసం మాలిక్ నామినేషన్ ముందుకు వచ్చింది. మాలిక్ లాహోర్ హైకోర్ట్‌కి మొదటి మహిళా అత్యున్నత న్యాయమూర్తి కావడం వల్ల సీనియారిటీ సూత్రాన్ని పక్కన పెట్టి, కమిటీ ఆమె నామినేషన్‌ను ఆమోదించింది. సాధారణంగా హైకోర్టు న్యాయమూర్తుల సీనియారిటీని పరిగణనలోకి తీసుకుంటారు. సుప్రీంకోర్టుకు వారి పదోన్నతిని ఆమోదించేటప్పుడు, గత సంవత్సరం ఆమె పేరును జేసీపీ తిరస్కరించడానికి ఇదీ ఓ కారణం.
1966లో జన్మించిన మాలిక్ పారిస్, న్యూయార్క్, కరాచీలోని పాఠశాలల్లో ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. ఆమె లాహోర్‌లోని పాకిస్థాన్ కాలేజ్ ఆఫ్ లా లో ‘లా’ చదివారు. హార్వర్డ్ లా స్కూల్ నుండి ఎల్‌ఎల్‌ఎమ్ చేశారు. జూన్ 2021లో లైంగిక వేధింపుల నుండి బయటపడిన వారి పరీక్ష కోసం కన్యత్వ పరీక్షలు ‘చట్ట విరుద్ధం, పాకిస్థాన్ రాజ్యాంగానికీ వ్యతిరేకం’ అని ఆమె ఇచ్చిన తీర్పు ఒక మైలురాయి.
సోమవారం ఇస్లామాబాద్‌లోని సుప్రీంకోర్టు భవనంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణం చేస్తున్న ఆయేషా మాలిక్.
Comments
Please login to add a commentAdd a comment