
న్యూఢిల్లీ: గూఢచర్యం ఆరోపణలతో నిఘా సంస్థలు యూట్యూబర్, ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రా(Jyoti Malhotra)ను అరెస్టు చేసిన దరిమిలా ఆమెకు సంబంధించిన మరిన్ని ఆసక్తికర వివరాలు వెలుగు చూస్తున్నాయి. పాకిస్తాన్‌లోని లాహోర్‌లోని అనార్కలి బజార్‌లో జ్యోతి మల్హోత్రా నడుచుకుంటూ వెళుతుండగా, ఆమెకు ఏకే-47 పట్టుకున్న ఆరుగురు సాయుధులు కాపలాగా ఉండటానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
జ్యోతి మల్హోత్రాకు సంబంధించిన ఈ వీడియో మరిన్ని ఊహాగానాలకు ఊతమిస్తోంది. పాకిస్తాన్ భద్రతా సిబ్బంది(Pakistani security personnel)గా భావిస్తున్న ఆరుగురు ఆమెకు కాపలా ఉండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వీడియోను పరిశీలనగా చూస్తే వారు ఆమెకు వీఐపీ తరహాలో భద్రతను అందిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ వీడియోను చిత్రీకరించిన స్కాటిష్ యూట్యూబర్ కల్లమ్ మిల్ కూడా షాక్‌కు గురయ్యారు. సాధారణ యూట్యూబర్‌కు ఇంత భారీ భద్రత కల్పించడాన్ని తాను ఊహించలేదని వ్యాఖ్యానించారు.
కల్లమ్ అబ్రాడ్ అనే ఛానల్ నడుపుతున్న స్కాటిష్ యూట్యూబర్ కల్లమ్ మిల్ గత మార్చిలో పాకిస్తాన్‌ను సందర్శించారు. లాహోర్(Lahore)లోని అనార్కలి బజార్‌లో పర్యటిస్తున్నప్పుడు ఆయన ఒక వీడియోను చిత్రీకరించారు. అందులో కొందరు వ్యక్తులు తుపాకులు పట్టుకుని ‘నో ఫియర్’ అనే లేబుల్ కలిగిన జాకెట్లు ధరించి కనిపిస్తున్నారు. కొద్దిసేపటికి జ్యోతి మల్హోత్రా ఫ్రేమ్‌లో కంటెంట్‌ను చిత్రీకరిస్తూ కనిపిస్తుంది. కల్లమ్ తనను తాను పరిచయం చేసుకుంటాడు. అప్పుడు ఆమె పాకిస్తాన్‌లో మొదటిసారి పర్యటిస్తున్నారా? అని అడుగుతుంది. దానికి అతను అతను "లేదు.. ఇది ఐదోసారి’ అని సమాధానం ఇస్తాడు.
ఆ తర్వాత జ్యోతి అతనితో భారతదేశాన్ని సందర్శించారా? అని ఆరా తీస్తూ, తాను భారతదేశం నుండి వచ్చినట్లు పరిచయం చేసుకుంటుంది. కల్లమ్ పాకిస్తాన్ ఆతిథ్యం గురించి ఆమెను అడగగా ఇక్కడి ఆతిథ్యం చాలా బాగుందని సమాధానం ఇస్తుంది. జ్యోతితో పాటు నడుస్తుండగా సాయుధ వ్యక్తులు అనుసరిస్తుండటాన్ని కల్లమ్ గ్రహిస్తాడు. తరువాత వీడియోలో అతను ‘ఆమె అంత భద్రతా ఏర్పాట్ల మధ్య ఎందుకు ఉందో నాకు తెలియడంలేదు. ఆమె రక్షణకు అన్ని తుపాకుల అవసరం ఏమిటి? ఆమె చుట్టూ ఆరుగురు గన్‌మెన్‌లున్నారు’ అని వ్యాఖ్యానించాడు. ఈ ఫుటేజ్‌లో జ్యోతి మల్హోత్రాతో పాటు పలువురు పర్యాటకులు కూడా కనిపిస్తారు. ఈ వీడియో జ్యోతి మల్హోత్రాకు పాకిస్తాన్‌తో ఉన్న సంబంధాలపై పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది.
ఇది కూడా చదవండి: COVID-19: వెయ్యిదాటిన కేసులు.. దేశమంతటా అప్రమత్తం