సికింద్రాబాద్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ గర్ల్స్ హైస్కూలులో ఆరో తరగతి చదువుతున్న బాలిక.. వార్మింగ్ అప్ (వ్యాయామానికి సిద్ధం చేసే) ఎక్సర్‌సైజ్‌లను సరిగా చేయడం లేదంటూ అందుకు శిక్షగా పి.ఇ.టి. (ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్) విధించిన 60 ల్యాప్‌లను (గ్రౌండ్‌లో రౌండ్‌లు) కొట్టలేక ఛాతీనొప్పితో, శ్వాస ఇబ్బందితో కుప్పకూలి ఆసుపత్రికి చేర్చవలసి వచ్చిన ఘటనకు నివ్వెరపోయిన ‘తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్’ తక్షణం ఆ స్కూలు గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది. వ్యాయామ నియమాలను సరిగా పాటించడం లేదని చిన్న పిల్ల చేత అమానుషంగా పరుగులు తీయించినప్పటికీ, ఆ టీచర్‌పై చర్య తీసుకోని యాజమాన్యం.. అందరూ బాలికలే ఉండే పాఠశాలలో మగ టీచర్లు ఉండకూడదన్న నిబంధనను ఉల్లంఘించి, పురుష పి.ఇ.టి.ని నియమించడంపైన కూడా అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో హైదరాబాద్ జిల్లా విద్యాధికారి బి.వెంకట నరసమ్మ ఈ పరిణామాలన్నిటిపై విచారణకు ఆదేశించారు ::: హైదరాబాద్ బాలిక చాందినీ శ్రీనివాసన్.. సెప్టెంబర్‌లో ఖజకిస్తాన్‌లో జరగబోతున్న ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ – ఏసియన్ అండర్ 12 టీమ్ టెన్నిస్ ఫైనల్ పోటీలకు ఎంపికైంది. ఆలిండియా టెన్నిస్ అసోసియేషన్ అండర్ 12 ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం నం. 2లో ఉన్న ఎనిమిదేళ్ల చాందినీతో పాటు హరియాణా నుంచి శృతీఅహ్లావత్, ఢిల్లీ నుంచి దుర్గాంశ్ భారత జట్టు తరఫున ఫైనల్స్‌లో తమ సత్తా చూపించేందుకు సిద్ధమౌతున్నారు.
హైదరాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికల్లో 91 శాతం మందికి రక్తహీనత ఉన్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ చేసిన తాజా సర్వేలో వెల్లడయింది. ‘ఫైట్ అనీమియా ఇన్ స్కూల్’ ప్రచారోద్యమంలో భాగంగా ఈ ఏడాది జూన్ 1న ప్రారంభమై ఇటీవలే ముగిసిన తొలి విడత సర్వేలో (మలి విడత జూలై 31కి పూర్తవుతుంది) హైదరాబాద్ కలెక్టరేట్ çపరిధిలోని 156 ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి చదువుతున్న 16,238 మంది బాలికల్లో 70 శాతం మందికి రక్తహీనత, 21 శాతం మందికి తీవ్ర రక్తహీనత ఉన్నట్లు గుర్తించారు ::: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 178 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న 22 వేల మంది బాలికలకు రాష్ట్ర విద్యాశాఖ గత మూడు నెలలుగా మార్షల్ ఆర్ట్స్‌లో ఇప్పిస్తున్న శిక్షణ పూర్తి కావచ్చింది. రాణి రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీలో సుశిక్షితులైన పి.ఇ.టి. టీచర్లతో తెలంగాణ ప్రభుత్వం విద్యార్థినులకు ఇప్పిస్తున్న ఈ శిక్షణకు ‘రాష్ట్రీయ మాధ్యమిక్ శిక్షా అభియాన్ (ఆర్.ఎం.ఎస్.ఎ) కింద కేంద్ర నిధులు అందుతున్నాయి ::: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పాకిస్తాన్‌లో తొలిసారి ఒక మహిళ పదవీబాధ్యతలు స్వీకరించబోతున్నారు! హైకోర్టు తొలి మహిళా జడ్జిగా, బలూచిస్తాన్‌లో తొలి మహిళా సివిల్ జడ్జిగా, ఇంకా తను చేపట్టిన ప్రతి పదవిలోనూ తొలి మహిళగా ఇప్పటికే గుర్తింపు పొందిన జస్టిస్ సయేదా తహీరా సఫ్దర్.. ఈ ఆగస్టు 31న పదవీ విరమణ పొందుతున్న బలూచిస్తాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానంలో బాధ్యతలు స్వీకరించి, వచ్చే ఏడాది అక్టోబర్ 5 వరకు న్యాయసేవలు అందిస్తారు ::: విషంతో ఔషధాన్ని తయారు చేయడం కోసం ఆన్‌లైన్‌లో ఒక సర్పాన్ని తెప్పించుకున్న చైనా యువతి ఆ పాము కాటుకు గురై చనిపోయింది! ఆన్‌లైన్‌లో మూగప్రాణుల్ని డెలివరీ చేయడంపై చైనాలో నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ వాటిని ధిక్కరించి జవాన్‌జువాన్ అనే ఆన్‌లైన్ మార్కెట్ నుంచి సర్పాన్ని కొనుగోలు చేసిన ఈ 21 ఏళ్ల మహిళ.. పాము కాటుకు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఎనిమిది రోజుల తర్వాత మరణించింది.
Comments
Please login to add a commentAdd a comment