శ్వేత ఐపీఎస్‌ | special life story to Swetha ips | Sakshi
Sakshi News home page

శ్వేత ఐపీఎస్‌

Published Mon, Mar 11 2019 12:05 AM | Last Updated on Mon, Mar 11 2019 12:05 AM

special life story to Swetha ips  - Sakshi

‘నాలెడ్జ్‌ ఈజ్‌ పవర్‌.. స్కిల్‌ ఈజ్‌ ఎనర్జీ’ అంటారు కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్వేత. టెక్నాలజీని పూర్తి స్థాయిలో వాడుకోవడం, మహిళల భద్రత, ఉద్యోగాల ప్రయత్నాల్లో యువతకు ప్రోత్సాహం, పోలీసు పాలనలో నూతన ఆవిష్కరణలు.. ఇలా అనేక కార్యక్రమాలను స్వచ్ఛందంగా చేపడుతూ ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నారు శ్వేత. 

తెలంగాణలో జిల్లాల పునర్విభజనలో భాగంగా రెండున్నర యేళ్ల క్రితం కొత్తగా ఏర్పడిన కామారెడ్డి జిల్లాకు సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌గా శ్వేత వచ్చారు. కొద్ది కాలంలోనే సాంకేతికతను ఆయుధంగా చేసుకుని ఎన్నో కొత్త విధానాలను తీసుకువచ్చారు. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం  కల్పించారు. జిల్లాలోని మూడు డివిజన్ల పరిధిలో షీ టీం బృందాలను ఏర్పాటు చేశారు. ఆకతాయిలను గుర్తిస్తూ వారికి మహిళలను గౌరవించడం పట్ల కౌన్సెలింగ్‌ ఏర్పాటు చేస్తున్నారు. మహిళా పోలీసు సిబ్బంది పురుషులతో సమానంగా ఉండాలంటే వారికి అన్ని పనులు తెలిసి ఉండాలని అందరికి డ్రైవింగ్‌ నేర్పించారు. విధుల్లో మహిళా సిబ్బంది ఇతరులపై ఆధారపడకుండా ఉండాలనేది శ్వేత ముఖ్యోద్దేశం. కొత్తగా విధుల్లో చేరిన మహిళా కానిస్టేబుళ్లకు మహిళలపై జరిగే దాడులను తిప్పికొట్టడంలో ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. ఆత్మరక్షణ పద్ధతులను నేర్పించారు. అంతేకాకుండా మహిళల్లో ఆత్యస్థైర్యాన్ని నింపడం కోసం స్వయంగా వారితో మాట్లాడడం, అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వడం చేస్తున్నారు.  

ఎస్పీ శ్వేత 2017 డిసెంబర్‌ 31న 13 జిల్లాలకు సంబంధించిన సిటిజన్‌ ఫీడ్‌బ్యాక్‌ సెంటర్‌ను కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేయించారు. ఇందుకోసం ఆమె ఎంతగానో శ్రమించారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా ఏర్పాటు చేసిన ఈ ఫీడ్‌బ్యాక్‌ సెంటర్‌ను డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రారంభించారు. దీని ద్వారా ఇప్పటి వరకు 10,802 ఫిర్యాదులు, 33,318 ఎఫ్‌ఐఆర్‌లు, 27,251 పాస్‌పోర్టు ఎంక్వైరీలకు సంబంధించిన విచారణ జరిగింది. కామారెడ్డి పట్టణ, దేవునిపల్లి పోలీస్‌స్టేషన్లను మోడల్‌ పోలీస్‌స్టేషన్‌లుగా తీర్చిదిద్దారు. 5 ఎస్‌ విధానాన్ని (సార్ట్, సెట్‌ ఇన్‌ ఆర్డర్, షైన్, స్టాండరై్డజ్, సస్టెయిన్‌) అమలు చేస్తూ రికార్డులను, వసతులను, సౌకర్యాల నిర్వహణను అత్యాధునికంగా మెరుగుపర్చారు. మహిళా సిబ్బందికి ప్రత్యేక గదులు, సదుపాయాలు కల్పించారు. ఎస్పీ శ్వేత మొదటి నుంచి సీసీ కెమెరాల ఏర్పాటుకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ప్రజలకు సీసీ కెమెరాల ఆవశ్యకతపై అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 1342 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు. నేరాల నియంత్రణ కోసం క్రమం తప్పకుండా జిల్లాలోని అన్ని గ్రామాల్లోనూ కార్డన్‌ సెర్చ్‌లు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా సీసీటీఎన్‌ఎస్‌ (క్రైమ్‌ అండ్‌ క్రిమినల్‌ ట్రాకింగ్‌ నెట్‌వర్క్‌ అండ్‌ సిస్టమ్‌) విధానం శ్వేత ఆధ్వర్యంలోనే ప్రారంభమైంది. మరోవైపు నిరుద్యోగ యువతీ యువకులకు నైపుణ్య శిక్షణలను అందించడానికి ఆమె ఎంతగానో కృషి చేశారు. ‘యువ నేస్తం’ కార్యక్రమం ద్వారా జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలకు వెళ్తున్న యువతీ, యువకులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేయించారు. ఐదు వందల మందికి శిక్షణ ఇప్పించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో స్టూడెంట్‌ పోలీసు క్యాడెట్‌ బృందాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అన్ని చోట్ల ఈ బృందాలు కొనసాగుతున్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం డేటా చోరీ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)లోని తొమ్మిది మంది సభ్యులలో శ్వేత కూడా ఒకరు.
– సేపూరి వేణుగోపాలచారి, సాక్షి, కామారెడ్డి

చదువు.. చొరవ.. కాన్ఫిడెన్స్‌
మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నప్పటికీ ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉంది. దీన్ని దూరం చేసేందుకు ప్రతీ మహిళ ఉన్నత చదువుల వైపు దృష్టి సారించాలి. ఏదైనా సాధిస్తామన్న  ఆత్మవిశ్వాసంతో ఉండాలి. నమ్మకానికి తగినట్లుగా శ్రమించాలి. నైపుణ్యం, విషయ పరిజ్ఞానం ఉంటే ఏదైనా సాధ్యమే. మంచి స్నేహితులు కూడా అవసరమే. తోటి వారికి ధైర్యాన్ని ఇవ్వాలి. కుల, మత వివక్షలు ఉండకూడదు. 
– శ్వేత, ఎస్పీ, కామారెడ్డి  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement