::: ప్రముఖ అమెరికన్ నటి, బిజినెస్‌ఉమన్, ఫ్యాషన్ డిజైనర్, గాయని, అవివాహిత.. లిండ్సే లోహన్ (32) తన తొలిబిడ్డగా ఎవరినైనా దత్తతు తీసుకోవాలనుకుంటున్నారు! ఇటీవల టర్కీ వెళ్లినప్పుడు అక్కడి సిరియా శరణార్థుల పిల్లలను చూశాక తనకు ఈ ఆలోచన వచ్చినట్లు ఆమె ప్రకటించారు
::: కొన్నేళ్లుగా వాషింగ్టన్ డీసీలో ఉంటూ.. స్థానికులతో పరిచయాలు, రాజకీయ పార్టీలలో పలుకుబడి పెంచుకుని అమెరికా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందన్న ఆరోపణలపై 29 ఏళ్ల రష్యన్ యువతి మరియా బుతీనాను యు.ఎస్. ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అమెరికన్ యూనివర్సి టీలో చదివిన మరియాను ‘రైట్ టు బేర్ ఆర్మ్’ అనే రష్యన్ ప్రో–గన్ సంస్థ వ్యవస్థాపకురాలిగా గుర్తించిన పోలీసులు ఆమెకు, యు.ఎస్.లోని రష్యన్ సెంట్రల్ బ్యాంకు అత్యున్నత స్థాయి అధికారులకు మధ్య ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు
::: కేంద్ర ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం ఇకనైనా తన భర్త పేరు మీద నేషనల్ చాంపియన్‌షిప్‌ను ప్రారంభించకపోతే ఆయనకు వచ్చిన పద్మశ్రీ, అర్జున అవార్డులతో పాటు మిగతావాటినీ ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేస్తానని దివంగత హాకీ క్రీడాకారుడు మొహమ్మద్ షాహిద్ సతీమణి పర్వీన్ హెచ్చరించారు. రెండేళ్ల క్రితం షాహిద్ మరణించినప్పుడు ఆయన పేరు మీద నేషనల్ చాంపియన్ షిప్‌ను ఏర్పాటు చేయడంతో పాటు, ఒక స్టేడియంను కూడా నిర్మిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇంత వరకు ఆ హామీని నెరవేర్చకపోవడంపై పర్వీన్ తీవ్రమైన అసంతృప్తితో ఉండడంతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్ ఆదేశాలపై కొందరు అధికారులు హుటాహుటిన ఆమెను ఇంటికి వెళ్లి మరీ కలిసి.. సంబంధిత శాఖలు ఆ పనిలోనే ఉన్నట్లు వివరణ ఇచ్చారు
::: జూలై 18న (నిన్న బుధవారం) ప్రారంభమై, ఆగస్టు 10 వరకు జరుగనున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం జరిగే ప్రయత్నాలలో కాంగ్రెస్, బీజేపీల మధ్య వాగ్వాదాలు నెలకొనే వాతావరణం కనిపిస్తోంది. ఇరవై రెండేళ్ల క్రితం వాజపేయి ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పటి వరకు చట్టంగా రూపుదాల్చకపోవడానికి కారణం.. కాంగ్రెస్‌కు, ఆ పార్టీ మిత్రపక్షాలకు చిత్తశుద్ధి లేకపోవడమేనని బీజేపీ ఆరోపిస్తుండగా.. పార్లమెంటులో మెజారిటీ ఉంచుకుని కూడా గత నాలుగేళ్ల సమావేశాలలో బిల్లు ఆమోదం కోసం మీరెందుకు చిత్తశుద్ధితో ప్రయత్నించలేకపోయారని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది.
హైదరాబాద్ నగరంలో మహిళల, బాలల భద్రతకు, రక్షణకు ‘షీ’ టీమ్‌లు, భరోసా సెంటర్‌లు తీసుకుంటున్న చర్యలను యు.ఎస్. కాన్సులేట్ జనరల్ కేథరీన్ హడ్డా ప్రశంసించారు. కేథరీన్ మంగళవారం నాడు హైదరాబాద్‌లోని షీ టీమ్‌లను, భరోసా సెంటర్‌లను సందర్శించినప్పుడు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్స్ అండ్ సిట్).. మహిళలపై నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ రెండు బృందాల పనితీరుపై ప్రజెంటేషన్ ఇచ్చారు
::: బహిరంగంగా స్తన్యమివ్వడానికి ఇబ్బంది పడే తల్లులున్న అంత పెద్ద నాగరిక సమాజమైన అమెరికాలో అక్కడి వర్ధమాన మోడల్.. మారా మార్టిన్ తన ఐదు నెలల కూతురు ఆరియాకు స్తన్యం ఇస్తూ ర్యాంప్‌పై వాక్ చెయ్యడం మహిళా సాధికారతకు ఒక సంచలనాత్మక సంకేతం అయింది. ‘స్పోర్ట్స్ ఇలస్ట్రేటెడ్’ పత్రిక స్విమ్‌సూట్ షోలో మిరుమిట్లు గొల్పుతున్న పసిడివర్ణంలో ఉన్న బికినీ ధరించి, బిడ్డకు చనుబాలు పడుతూ ర్యాంప్ వాక్ చేసిన మార్టిన్.. మర్నాడు ఆ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ, ‘నా మాతృ హృదయాన్ని మంచి మనసుతో అర్థంచేసుకున్న వారందరికీ ధన్యవాదాలు’ అని కామెంట్ పెట్టగా, ప్రఖ్యాత ఫెమినిస్టు వెబ్‌సైట్ ‘జెజెబెల్’.. ఇలా పాలిస్తూ వాక్ చెయ్యడాన్ని వ్యతిరేకిస్తూ మార్టిన్ ధోరణిని ఒక ప్రహసనంగా అభివర్ణించింది.
తమిళ టీవీ సీరియల్ ‘వంశం’లో ప్రధాన పాత్రధారి అయిన రమ్యకృష్ణ పక్కన జ్యోతికగా నటించి వీక్షకుల ఆదరణ పొందిన యువ నటి ప్రియాంక చెన్నైలోని వలసరవాక్కంలో ఉన్న తన నివాసంలో సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ ఆ అపార్ట్‌మెంట్ పనిమనిషికి కనిపించారు. మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్న ప్రియాంకపై పిల్లల్ని కనాలని ఒత్తిడి పెరుగుతోందనీ, ఈ కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు ::: ముంబై స్కూల్స్ స్పోర్ట్స్ అసోసియేషన్.. ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో గత నెలలోనే ప్రారంభించిన ‘ఛేంజింగ్ రూమ్’ తాళం చెవుల్ని ఓ అధికారి ఇంటికి తీసుకెళ్లడంతో అండర్ 17 çఫుట్‌బాల్ మ్యాచ్‌లు ఆడేందుకు గ్రౌండ్‌కు వచ్చిన వివిధ జట్లు బాలికలు వాష్‌రూమ్ కోసం ఇబ్బంది పడవలసి వచ్చింది. టోర్నమెంట్ ప్రారంభానికి ముందే డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ట్ ఆఫీసర్ సుమిత్ పాటిల్.. ఆటలు జరిగే రోజులైన జూలై 17, 18 తేదీలలో బాలికల వాష్‌రూమ్‌ను తెరిచి ఉంచాలని అసోసియేషన్‌కు ప్రత్యేకంగా లేఖ రాసినప్పటికీ బాలికలకు ఈ చేదు అనుభవం తప్పలేదు :::
Comments
Please login to add a commentAdd a comment