Adityanath
-
మోదీని పొగిడిన భార్యకు తలాక్...
బహ్రెయిచ్: అయోధ్యలో అభివృద్ధికి ప్రధాని మోదీ, యూపీ సీఎం ఆదిత్యనాథ్ కారణమంటూ పొగడటమే ఆ మహిళ చేసిన నేరం. ఇందుకు ఆగ్రహిస్తూ భర్త ఆమెకు మూడుసార్లు తలాక్ చెప్పేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు భర్తతోపాటు అతడి ఏడుగురు కుటుంబసభ్యులపైనా కేసులు నమోదు చేశారు. బహ్రెయిచ్ జిల్లా మొహల్లా సరాయ్‌కి చెందిన బాధితురాలికి గతేడాది డిసెంబర్లో అయోధ్యకు చెందిన అర్షద్‌తో వివాహమైంది. మెట్టినింటికి వెళ్లాక అయోధ్యలో రోడ్లు, ఆ నగరం, అక్కడి వాతావరణం ఆమెకు నచ్చాయి.ఇదే విషయాన్ని భర్తకు చెప్పింది. ప్రధాని మోదీ, సీఎం యోగియే ఇందుకు కారణమని తెలిపింది. దీంతో, అర్షద్‌కు కోపం వచ్చి ఆమెను వెంటనే పుట్టింటికి పంపేశాడు. బంధువులు నచ్చజెప్పి, ఆమెను తిరిగి అయోధ్యకు తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఆమెను కొడుతూ, తిడుతూ వేధిస్తున్నాడు. ప్రధాని మోదీ, సీఎం యోగిపై దుర్భాషలాడుతున్నాడు. అత్త, మరదళ్లు, మరుదులు కలిసి ఆమెను చంపేందుకు యత్నిస్తున్నారు. అర్షద్ చివరికామెకు మూడుసార్లు తలాక్ చెప్పాడు. ఈ మేరకు బాధితురాలి ఫిర్యాదుపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
ఏపీ భవన్లో విద్యుత్ పొదుపు ప్రాజెక్ట్
సాక్షి, అమరావతి: ఇంధన పొదుపు, సామర్థ్య కార్యక్రమాలను అమలు చేయడంలో దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలుస్తున్న ఆంధ్రప్రదేశ్ మరో ముందడుగు వేస్తోంది. 2030 నాటికి ఒక బిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించాలన్న లక్ష్యానికి అనుగుణంగా కేంద్ర విద్యుత్‌శాఖ నేతృత్వంలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) న్యూఢిల్లీలో ఉన్న వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వ భవనాల్లో ఇంధన సామర్థ్య చర్యలపై దృష్టి సారించింది. మొదటిదశలో ఏపీ భవన్ నుంచి ఇంధన సామర్థ్య పైలట్ ప్రాజెక్టును ప్రారంభించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏపీ భవన్లో పవర్ కాంట్రాక్ట్ డిమాండ్ తగ్గింపు, ఎల్ఈడీ స్టేజ్ లైటింగ్, స్టార్ రేటెడ్ ఎయిర్ కండిషనర్లు, వంటగదిలో ఇండక్షన్ వంట ఉపకరణాల వినియోగం, మోషన్ సెన్సార్‌ను ఇన్స్టాల్ చేయడం, బ్రష్‌లెస్ డైరెక్ట్ కరెంట్ (బీఎల్డీసీ)తో సంప్రదాయ సీలింగ్ ఫ్యాన్లను భర్తీచేయడం, హీట్ పంపుల ఏర్పాటు వంటి మార్పులు చేయనున్నారు. బీఈఈ ద్వారా ఎంప్యానల్ చేయబడిన థర్డ్ పార్టీ ఎనర్జీ ఆడిటింగ్ సంస్థ నిర్వహించిన ఈ ఎనర్జీ ఆడిట్ ప్రకారం, ఇది సంవత్సరానికి సుమారు 1.96 లక్షల యూనిట్ల విద్యుత్ ఆదా చేస్తుందని అంచనా వేస్తున్నారు. దీనిద్వారా సుమారు 139 టన్నుల కర్బన ఉద్గారాల తగ్గింపుతోపాటు రూ.39 లక్షల విలువైన ఇంధనాన్ని ఆదా చేయవచ్చు. ఈ లెక్కన ఇంధన సామర్థ్య చర్యల కోసం ప్రతిపాదించిన రూ.35 లక్షల పెట్టుబడి కేవలం ఏడాదిలోనే వచ్చేస్తుంది. వచ్చేనెల (మార్చి) చివరి నాటికి ఈ ప్రాజెక్టును పూర్తిచేయడానికి ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) కృషిచేస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే దేశ రాజధాని ఢిల్లీలో ఇంధన సామర్థ్య చర్యలను అమలు చేసి, కర్బన ఉద్గారాలను తగ్గించే జాతీయ లక్ష్యానికి దోహదపడే తొలి రాష్ట్ర భవన్‌గా ఏపీ భవన్ అవతరించనుంది. బీఈఈ ఆర్థిక సాయం న్యూఢిల్లీలోని ఏపీ భవన్లో ఇంధన సామర్థ్య చర్యలపై బీఈఈ డైరెక్టర్ జనరల్ అభయ్ భాక్రే తరఫున బీఈఈ కార్యదర్శి ఆర్.కె.రాయ్ ఆదివారం ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్, ఏపీ మాజీ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్‌తో సమావేశమయ్యారు. ఏపీ భవన్‌పై భారం లేకుండా బీఈఈ నుంచి ఏపీఎస్ఈసీఎంకు ఆర్థిక సహకారం అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆర్.కె.రాయ్ ఈ సమావేశంలో చెప్పారు. బీఈఈ ఆర్థిక సహాయంతో ఏపీ భవన్లో ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ ఎనర్జీ ఆడిట్ (ఐజీఈఏ) నిర్వహించినట్లు ఏపీఎస్ఈసీఎం సీఈవో చంద్రశేఖరరెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో బీఈఈ జాయింట్ డైరెక్టర్ అభిషేక్ శర్మ, ఏపీ భవన్ అడిషనల్ కమిషనర్ ఎన్.వి.రమణారెడ్డి పాల్గొన్నారు. -
వాన నీటిని ఒడిసి పట్టండి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో జల సంక్షోభం సవాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వాన నీటిని ఒడిసి పట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. రాబోయే తరాల పట్ల బాధ్యతను ప్రస్తుత తరం నిర్వర్తించాల్సి ఉందన్నారు. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాల్లో జల పాలన ప్రాధాన్య అంశంగా తీసుకుందన్నారు. ‘కెన్–బెత్వా’నదుల అనుసంధానం ప్రాజెక్టు కార్యరూపం తీసుకురావడానికి సోమవారం ఒప్పంద పత్రాలపై ప్రధాని మోదీ సమక్షంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌లు సంతకం చేశారు. ఈ సందర్భంగా జలశక్తి అభియాన్–‘క్యాచ్ ద రెయిన్’ప్రచార ఉద్యమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన ప్రధాని మోదీ పలు రాష్ట్రాలకు చెందిన సర్పంచులు, వార్డు సభ్యులనుద్దేశించి మాట్లాడారు. జల భద్రత, తగిన జలనిర్వహణ లేకపోతే సత్వర అభివృద్ధి సాధ్యం కాదన్నారు. వర్షాకాలం సమీపించే లోగా చెరువులు, బావుల సామర్థ్యాన్ని పెంచేందుకు పూడికతీసి, శుభ్రం చేసి సిద్ధంగా ఉంచాలనీ, ఈ పనులకు ఉపాధి హామీ పథకం నిధులను పూర్తిగా వినియోగించుకోవాలని తెలిపారు. రానున్న 100 రోజుల్లో ఈ పనులను పూర్తి చేయాలన్నారు. దేశాభివృద్ధి, దేశ స్వావలంబన, దార్శనికత జల వనరులు, నదుల అనుసంధానంపై ఆధారపడి ఉన్నాయన్నారు. ఆరేళ్లుగా జలాలకు తగిన ప్రాధాన్యం ఇచ్చామన్నారు. ప్రధానమంత్రి కృషి సింఛాయి యోజన, హర్ ఖేత్ కో పానీ , ఒక్కొక్క నీటి చుక్కకు మరింత అధిక పంట ప్రచార ఉద్యమాల గురించి, నమామీ గంగే మిషన్, జలజీవన్ మిషన్, అటల్ భుజల్ యోజనల గురించి మాట్లాడుతూ.. పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. వర్షపు నీటిని సమర్థంగా వినియోగించుకోగలిగితే భూగర్భ జలాలపై ఆధారపడడం తగ్గుతుందన్నారు. క్యాచ్ ద రెయిన్ కార్యక్రమం మార్చి 22 నుంచి నవంబర్ 30వ తేదీ వరకు అమలు చేస్తామన్నారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న జలశపథం కార్యక్రమంలో అందరూ శపథం చేయాలన్నారు. దేశంలో జలసంక్షోభం రాకుండా ఉండడానికి సత్వర కృషి చేపట్టాల్సి ఉందని,అందులో భాగంగా కెన్–బెత్వా అనుసంధానం ఉందన్నారు. నీటి నాణ్యత పరీక్షల్లో గ్రామీణ ప్రాంతలోని మహిళల్ని భాగస్వాములను చేశామన్నారు. కరోనా కాలంలో 4.5 లక్షల మందికి శిక్షణ ఇచ్చామని, ప్రస్తుతం గ్రామంలో కనీసం ఐదుగురు నీటి నాణ్యత పరీక్ష చేయగలిగే మహిళలు ఉన్నారని ప్రధాని తెలిపారు. జల పాలనలో మహిళలు భాగస్వామ్యం అవుతున్న కొద్దీ ఉత్తమ ఫలితాలు సాధించగలమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కెన్–బెత్వా నదుల అనుసంధానానికి యూపీ, ఎంపీల ఒప్పందంతో దేశంలో నదుల అనుసంధాన కార్యక్రమం ప్రారంభమైందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు. గోదావరి–కావేరి నదుల అనుసంధానంపై రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చి ఓ అంగీకారానికి రావాలన్నారు. రాష్ట్రాల అంగీకారం తర్వాతే కేంద్రం ముందుకెళ్తుందని షెకావత్ స్పష్టం చేశారు. రాష్ట్రాలపై చర్చిస్తాం: శ్రీరాం వెదిరె నదుల అనుసంధానం టాస్క్‌ఫోర్స్ చైర్మన్ శ్రీరాం వెదిరె మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 256 జల సంక్షోభం జిల్లాలోని 1529 బ్లాకుల్లో జలశక్తి అభియాన్ తొలిదశ 2019లో ప్రారంభించామన్నారు. రెండోదశలో పట్టణ,గ్రామీణ ప్రాంతాలపై దృష్టి సారించామన్నారు. శాస్త్రీయ నీటి సంరక్షణ ప్రణాళిక నిమిత్తం జిల్లాకు రూ.2లక్షల చొప్పున గ్రాంటు ఇచ్చినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 30 నదుల అనుసంధానం ప్రాజెక్టులు చేపడుతున్నామన్నారు. కెన్–బెత్వా తర్వాత గోదావరి–కావేరి అనుసంధానంపై దృష్టి సారిస్తున్నామన్నారు. ప్రాజెక్టు సమగ్ర వివరణాత్మక నివేదిక (డీపీఆర్) తయారీ దశలో ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి ప్రాజెక్టుపై ముందుకెళ్తామని శ్రీరాం వెదిరె తెలిపారు. -
బిడ్డను దత్తత తీసుకోవాలనుకుంటున్న నటి!
::: ప్రముఖ అమెరికన్ నటి, బిజినెస్‌ఉమన్, ఫ్యాషన్ డిజైనర్, గాయని, అవివాహిత.. లిండ్సే లోహన్ (32) తన తొలిబిడ్డగా ఎవరినైనా దత్తతు తీసుకోవాలనుకుంటున్నారు! ఇటీవల టర్కీ వెళ్లినప్పుడు అక్కడి సిరియా శరణార్థుల పిల్లలను చూశాక తనకు ఈ ఆలోచన వచ్చినట్లు ఆమె ప్రకటించారు ::: కొన్నేళ్లుగా వాషింగ్టన్ డీసీలో ఉంటూ.. స్థానికులతో పరిచయాలు, రాజకీయ పార్టీలలో పలుకుబడి పెంచుకుని అమెరికా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందన్న ఆరోపణలపై 29 ఏళ్ల రష్యన్ యువతి మరియా బుతీనాను యు.ఎస్. ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అమెరికన్ యూనివర్సి టీలో చదివిన మరియాను ‘రైట్ టు బేర్ ఆర్మ్’ అనే రష్యన్ ప్రో–గన్ సంస్థ వ్యవస్థాపకురాలిగా గుర్తించిన పోలీసులు ఆమెకు, యు.ఎస్.లోని రష్యన్ సెంట్రల్ బ్యాంకు అత్యున్నత స్థాయి అధికారులకు మధ్య ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు ::: కేంద్ర ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం ఇకనైనా తన భర్త పేరు మీద నేషనల్ చాంపియన్‌షిప్‌ను ప్రారంభించకపోతే ఆయనకు వచ్చిన పద్మశ్రీ, అర్జున అవార్డులతో పాటు మిగతావాటినీ ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేస్తానని దివంగత హాకీ క్రీడాకారుడు మొహమ్మద్ షాహిద్ సతీమణి పర్వీన్ హెచ్చరించారు. రెండేళ్ల క్రితం షాహిద్ మరణించినప్పుడు ఆయన పేరు మీద నేషనల్ చాంపియన్ షిప్‌ను ఏర్పాటు చేయడంతో పాటు, ఒక స్టేడియంను కూడా నిర్మిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇంత వరకు ఆ హామీని నెరవేర్చకపోవడంపై పర్వీన్ తీవ్రమైన అసంతృప్తితో ఉండడంతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్ ఆదేశాలపై కొందరు అధికారులు హుటాహుటిన ఆమెను ఇంటికి వెళ్లి మరీ కలిసి.. సంబంధిత శాఖలు ఆ పనిలోనే ఉన్నట్లు వివరణ ఇచ్చారు ::: జూలై 18న (నిన్న బుధవారం) ప్రారంభమై, ఆగస్టు 10 వరకు జరుగనున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం జరిగే ప్రయత్నాలలో కాంగ్రెస్, బీజేపీల మధ్య వాగ్వాదాలు నెలకొనే వాతావరణం కనిపిస్తోంది. ఇరవై రెండేళ్ల క్రితం వాజపేయి ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పటి వరకు చట్టంగా రూపుదాల్చకపోవడానికి కారణం.. కాంగ్రెస్‌కు, ఆ పార్టీ మిత్రపక్షాలకు చిత్తశుద్ధి లేకపోవడమేనని బీజేపీ ఆరోపిస్తుండగా.. పార్లమెంటులో మెజారిటీ ఉంచుకుని కూడా గత నాలుగేళ్ల సమావేశాలలో బిల్లు ఆమోదం కోసం మీరెందుకు చిత్తశుద్ధితో ప్రయత్నించలేకపోయారని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. హైదరాబాద్ నగరంలో మహిళల, బాలల భద్రతకు, రక్షణకు ‘షీ’ టీమ్‌లు, భరోసా సెంటర్లు తీసుకుంటున్న చర్యలను యు.ఎస్. కాన్సులేట్ జనరల్ కేథరీన్ హడ్డా ప్రశంసించారు. కేథరీన్ మంగళవారం నాడు హైదరాబాద్‌లోని షీ టీమ్‌లను, భరోసా సెంటర్లను సందర్శించినప్పుడు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్స్ అండ్ సిట్).. మహిళలపై నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ రెండు బృందాల పనితీరుపై ప్రజెంటేషన్ ఇచ్చారు ::: బహిరంగంగా స్తన్యమివ్వడానికి ఇబ్బంది పడే తల్లులున్న అంత పెద్ద నాగరిక సమాజమైన అమెరికాలో అక్కడి వర్ధమాన మోడల్.. మారా మార్టిన్ తన ఐదు నెలల కూతురు ఆరియాకు స్తన్యం ఇస్తూ ర్యాంప్‌పై వాక్ చెయ్యడం మహిళా సాధికారతకు ఒక సంచలనాత్మక సంకేతం అయింది. ‘స్పోర్ట్స్ ఇలస్ట్రేటెడ్’ పత్రిక స్విమ్‌సూట్ షోలో మిరుమిట్లు గొల్పుతున్న పసిడివర్ణంలో ఉన్న బికినీ ధరించి, బిడ్డకు చనుబాలు పడుతూ ర్యాంప్ వాక్ చేసిన మార్టిన్.. మర్నాడు ఆ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ, ‘నా మాతృ హృదయాన్ని మంచి మనసుతో అర్థంచేసుకున్న వారందరికీ ధన్యవాదాలు’ అని కామెంట్ పెట్టగా, ప్రఖ్యాత ఫెమినిస్టు వెబ్సైట్ ‘జెజెబెల్’.. ఇలా పాలిస్తూ వాక్ చెయ్యడాన్ని వ్యతిరేకిస్తూ మార్టిన్ ధోరణిని ఒక ప్రహసనంగా అభివర్ణించింది. తమిళ టీవీ సీరియల్ ‘వంశం’లో ప్రధాన పాత్రధారి అయిన రమ్యకృష్ణ పక్కన జ్యోతికగా నటించి వీక్షకుల ఆదరణ పొందిన యువ నటి ప్రియాంక చెన్నైలోని వలసరవాక్కంలో ఉన్న తన నివాసంలో సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ ఆ అపార్ట్మెంట్ పనిమనిషికి కనిపించారు. మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్న ప్రియాంకపై పిల్లల్ని కనాలని ఒత్తిడి పెరుగుతోందనీ, ఈ కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు ::: ముంబై స్కూల్స్ స్పోర్ట్స్ అసోసియేషన్.. ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో గత నెలలోనే ప్రారంభించిన ‘ఛేంజింగ్ రూమ్’ తాళం చెవుల్ని ఓ అధికారి ఇంటికి తీసుకెళ్లడంతో అండర్ 17 çఫుట్‌బాల్ మ్యాచ్‌లు ఆడేందుకు గ్రౌండ్‌కు వచ్చిన వివిధ జట్లు బాలికలు వాష్‌రూమ్ కోసం ఇబ్బంది పడవలసి వచ్చింది. టోర్నమెంట్ ప్రారంభానికి ముందే డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ట్ ఆఫీసర్ సుమిత్ పాటిల్.. ఆటలు జరిగే రోజులైన జూలై 17, 18 తేదీలలో బాలికల వాష్‌రూమ్‌ను తెరిచి ఉంచాలని అసోసియేషన్‌కు ప్రత్యేకంగా లేఖ రాసినప్పటికీ బాలికలకు ఈ చేదు అనుభవం తప్పలేదు ::: -
జీఎస్టీ గురించి తడబడ్డ మంత్రివర్యులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ‘జీఎస్టీ’ (వస్తు సేవా పన్ను) మోత మోగిపోతుంటే, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మంత్రివర్యులు మాత్రం జీఎస్టీ అంటే ఏంటో చెప్పలేక నీళ్లు నమిలారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. యూపీ సంక్షేమ, ఎస్సీ, ఎస్టీ వ్యవహారాల శాఖ మంత్రి రమాపతి శాస్త్రికి ఈ అనుభవం ఎదురైంది. ఆయన గురువారం మహరాజ్‌గంజ్‌లో స్థానిక వ్యాపారులతో సమావేశమై జీఎస్టీ వల్ల ప్రయోజనాల గురించి చెబుతున్నారు. అయితే జీఎస్టీ అంటే ఏంటో నిర్వచనం చెప్పాలంటూ ఓ విలేకరి ప్రశ్నించాడు. ఒక్కసారిగా అలా అడిగేసరికి మంత్రి రమాపతి తెల్లమొహం వేశారు. అయితే పక్కనున్నవారు...ఆయన పరిస్థితిని అర్థం చేసుకుని గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటూ అబ్రివేషన్ చెప్పినప్పటికీ మంత్రి అర్థం చేసుకుని చెప్పలేక దొరికిపోయారు. అంతేకాకుండా జీఎస్టీ అంటే ఏంటో తనకు తెలుసునని, కానీ ఇప్పుడు గుర్తుకు రావడం లేదని బుకాయించడం విశేషం. పైపెచ్చు జీఎస్టీ అర్థం తనకు తెలుసునని, దాని గురించి మరింత తెలుసుకునేందుకు సంబంధిత పత్రాలు పరిశీలిస్తున్నామని గొప్పలు చెప్పారు. కాగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రెండు రోజుల క్రితం మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి జీఎస్టీ అమలుతో పాటు లాభ, నష్టాల గురించి చర్చించారు. అలాగే జీఎస్టీ అమలు వల్ల గందరగోళంతో పాటు, దానివల్ల ప్రయోజనాలపై ప్రజలకు మరింత అవగాహన కలిగించేందుకు ప్రయత్నించాలని ఆయన తన మంత్రివర్గ సహచరులతో పాటు అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో జీఎస్టీ అంటే... అంటూ మంత్రి అడ్డంగా దొరికిపోవడం గమనార్హం. -
జీఎస్టీ గురించి తడబడ్డ మంత్రివర్యులు
-
రామమందిరం నిర్మాణం ఇప్పట్లో కాదా?
న్యూఢిల్లీ: ‘ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి అడ్డుగా ఉన్న అవరోధాలను క్రమంగా అధిగమించి ఆలయ నిర్మాణాన్ని త్వరలోనే ప్రారంభిస్తుంది’ అని రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన యోగి ఆధిత్యనాథ్ రాష్ట్రంలో తొలి విడత ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రజలకు మాటిచ్చారు. ఇప్పుడు ఆ మాటను ఎంతవరకు నిలబెట్టుకుంటారు? ఆ దిశగా ఆయన ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం కోర్టు పరిధిలోఉన్న ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తారు? అన్న అంశంపై అప్పుడే హిందుత్వ వాదుల్లో చర్చ ప్రారంభమైంది. అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించాలని బలంగా కోరుకుంటున్న హిందూ నాయకుల్లో ఆధిత్యనాథ్ ఒకరనే విషయంలో ఎలాంటి సందేహం లేకపోయినా, గతంలో రామమందిరం ఉద్యమాన్ని తీవ్రస్థాయికి తీసుకెళ్లిన దిగ్విజయ్నాథ్, అవైద్యనాథ్ లాంటి కరడుగట్టిన నాయకుడేమీ కాదు. రామమందిరం నిర్మాణ అంశాన్ని చేతనావస్థలో ఉంచేందుకు, తద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు మాత్రమే ఆయన ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈ అంశాన్ని పదే పదే ప్రస్తావించారు. ఎన్నికల్లో బీజీపీ కాకుండా ఎస్పీ, బీఎస్పీలు విజయం సాధించినట్లయితే అయోధ్య శ్మశానంగా మారుతుందని కూడా ఆయన ఓటర్లను హెచ్చరించారు. గోరక్‌పూర్‌లోని గోరక్షకపీఠం మందిరానికి 1935 నుంచి 1969వరకు మహంత్‌గా పనిచేసిన దిగ్విజయ్నాథ్ మొట్టమొదటగా అయోధ్యలోని బాబ్రీ మసీదు మొత్తాన్ని రామమందిరంగా మార్చాలనే ప్రతిపాదన తీసుకొచ్చారు. దానికి విస్తృత ప్రచారాన్ని కల్పించారు. ఆ తర్వాత 1949, డిసెంబర్ 22వ తేదీ రాత్రి బాబ్రీ మసీదులోకి వెళ్లి రాముడి విగ్రహాన్ని అనూహ్యంగా ప్రతిష్టించారు. అప్పటి హిందూ మహాసభ ప్రముఖ నాయకుల్లో ఒకరైన హిందూ సిద్ధాంతకర్త వినాయక్ దామోదర్ సావర్కర్, ఆయన అనుచరుల అండతో ఆయన ఆయన ఈ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని రహస్యంగా గావించారు. దిగ్విజయ్నాథ్ మరణానంతరం ఆయన శిష్యుడు అవైద్యనాథ్ (ప్రస్తుత ముఖ్యమంత్రి ఆధిత్యనాథ్ గురువు) భారతీయ జనతా పార్టీ అండతో రామ మందిర ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. అది చివరకు 1992, డిసెంబర్ 6వ తేదీన బాబ్రీ మసీదు విధ్వంసానికి దారితీసింది. 1989లో అలహాబాద్‌లో జరిగిన కుంభమేళాలో విశ్వహిందూ పరిషద్ ఆధ్వర్యంలో జరిగిన సాధువుల సమ్మేళనంలో ప్రసంగించడం ద్వారా అవైద్యనాథ్ రామ మందిరం ఉద్యమానికి ఊపును తీసుకొచ్చారు. ‘అనవసరమైన సంఘర్షణను నివారించేందుకు మరోచోట రామాలయాన్ని నిర్మించుకోవాల్సిందిగా ముస్లిం పెద్దలు సూచించడం ఎలా ఉందంటే రావణుడితో యుద్ధాన్ని నివారించేందుకు మరో సీతను వెతుక్కోవాల్సిందిగా రాముడికి సూచించినట్లుగా ఉంది’ అంటూ ఆయన నాడు చేసిన వ్యాఖ్యలు సాధువులకు స్ఫూర్తినిచ్చాయి. మహంత్ అవైద్యనాథ్ సహా ఉమా భారతి, సాధ్వీ రితంబరి, పరమహంస రామచందర్ దాస్, ఆచార్య ధర్మేంధ్ర దేవ్, బీఎల్ శర్మ తదితరులు ఉద్రేకపూరిత ప్రసంగాల ద్వారా బాబ్రీ మసీదు విధ్వంసానకి కారణమయ్యారంటూ లిబర్హాన్ కమిషన్ తప్పుపట్టినా వారికి ఎలాంటి శిక్షలు పడలేదు. 2014లో అవైద్యనాథ్ మరణించగా, ఆయన రెండు దశాబ్దాల ముందే, అంటే 1994లోనే తన వారుసుడిగా యోగి ఆధిత్యనాథ్‌ను ప్రకటించారు. ఇప్పుడు ఆయన నేతత్వంలో రామ మందిరం నిర్మాణం ఊపందుకుంటుందని హిందూత్వవాదులు భావిస్తున్నారు. అభివృద్ధికే అధిక ప్రాధాన్యత ఇస్తామంటున్న బీజేపీ రామ మందిరం జోలికి వెళ్లే అవకాశం లేదు. ఎన్నికల్లో అఖండ విజయం సాధించినందున వెళ్లాల్సిన అవసరం కూడా కనిపించడం లేదు. కోర్టు కేసులు ముందుగా పరిష్కారం కావాలంటూ కాలయాపన చేసి, 2019లో జరిగే పార్లమెంట్ ఎన్నికల నాటికి రామ మందిరం నిర్మాణ అంశాన్ని ప్రధాన డిమాండ్‌గా ముందుకు తీసుకొస్తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.