
ఐజీఈఏ నివేదికను ఆదిత్యనాథ్‌కు ఇస్తున్న ఆర్కేరాయ్
సాక్షి, అమరావతి: ఇంధన పొదుపు, సామర్థ్య కార్యక్రమాలను అమలు చేయడంలో దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలుస్తున్న ఆంధ్రప్రదేశ్ మరో ముందడుగు వేస్తోంది. 2030 నాటికి ఒక బిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించాలన్న లక్ష్యానికి అనుగుణంగా కేంద్ర విద్యుత్‌శాఖ నేతృత్వంలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) న్యూఢిల్లీలో ఉన్న వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వ భవనాల్లో ఇంధన సామర్థ్య చర్యలపై దృష్టి సారించింది.
మొదటిదశలో ఏపీ భవన్ నుంచి ఇంధన సామర్థ్య పైలట్ ప్రాజెక్టును ప్రారంభించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏపీ భవన్‌లో పవర్ కాంట్రాక్ట్ డిమాండ్ తగ్గింపు, ఎల్ఈడీ స్టేజ్ లైటింగ్, స్టార్ రేటెడ్ ఎయిర్ కండిషనర్లు, వంటగదిలో ఇండక్షన్ వంట ఉపకరణాల వినియోగం, మోషన్ సెన్సార్‌ను ఇన్‌స్టాల్ చేయడం, బ్రష్‌లెస్ డైరెక్ట్ కరెంట్ (బీఎల్డీసీ)తో సంప్రదాయ సీలింగ్ ఫ్యాన్లను భర్తీచేయడం, హీట్ పంపుల ఏర్పాటు వంటి మార్పులు చేయనున్నారు.
బీఈఈ ద్వారా ఎంప్యానల్ చేయబడిన థర్డ్ పార్టీ ఎనర్జీ ఆడిటింగ్ సంస్థ నిర్వహించిన ఈ ఎనర్జీ ఆడిట్ ప్రకారం, ఇది సంవత్సరానికి సుమారు 1.96 లక్షల యూనిట్ల విద్యుత్ ఆదా చేస్తుందని అంచనా వేస్తున్నారు. దీనిద్వారా సుమారు 139 టన్నుల కర్బన ఉద్గారాల తగ్గింపుతోపాటు రూ.39 లక్షల విలువైన ఇంధనాన్ని ఆదా చేయవచ్చు.
ఈ లెక్కన ఇంధన సామర్థ్య చర్యల కోసం ప్రతిపాదించిన రూ.35 లక్షల పెట్టుబడి కేవలం ఏడాదిలోనే వచ్చేస్తుంది. వచ్చేనెల (మార్చి) చివరి నాటికి ఈ ప్రాజెక్టును పూర్తిచేయడానికి ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (ఏపీఎస్‌ఈసీఎం) కృషిచేస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే దేశ రాజధాని ఢిల్లీలో ఇంధన సామర్థ్య చర్యలను అమలు చేసి, కర్బన ఉద్గారాలను తగ్గించే జాతీయ లక్ష్యానికి దోహదపడే తొలి రాష్ట్ర భవన్‌గా ఏపీ భవన్ అవతరించనుంది.
బీఈఈ ఆర్థిక సాయం
న్యూఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఇంధన సామర్థ్య చర్యలపై బీఈఈ డైరెక్టర్ జనరల్ అభయ్ భాక్రే తరఫున బీఈఈ కార్యదర్శి ఆర్.కె.రాయ్ ఆదివారం ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్, ఏపీ మాజీ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్‌తో సమావేశమయ్యారు. ఏపీ భవన్‌పై భారం లేకుండా బీఈఈ నుంచి ఏపీఎస్‌ఈసీఎంకు ఆర్థిక సహకారం అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఆర్.కె.రాయ్ ఈ సమావేశంలో చెప్పారు.
బీఈఈ ఆర్థిక సహాయంతో ఏపీ భవన్‌లో ఇన్వెస్ట్‌మెంట్ గ్రేడ్ ఎనర్జీ ఆడిట్ (ఐజీఈఏ) నిర్వహించినట్లు ఏపీఎస్‌ఈసీఎం సీఈవో చంద్రశేఖరరెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో బీఈఈ జాయింట్ డైరెక్టర్ అభిషేక్ శర్మ, ఏపీ భవన్ అడిషనల్ కమిషనర్ ఎన్.వి.రమణారెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment