జీఎస్టీ గురించి తడబడ్డ మంత్రివర్యులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ‘జీఎస్టీ’ (వస్తు సేవా పన్ను) మోత మోగిపోతుంటే, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మంత్రివర్యులు మాత్రం జీఎస్టీ అంటే ఏంటో చెప్పలేక నీళ్లు నమిలారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. యూపీ సంక్షేమ, ఎస్సీ, ఎస్టీ వ్యవహారాల శాఖ మంత్రి రమాపతి శాస్త్రికి ఈ అనుభవం ఎదురైంది. ఆయన గురువారం మహరాజ్‌గంజ్‌లో స్థానిక వ్యాపారులతో సమావేశమై జీఎస్టీ వల్ల ప్రయోజనాల గురించి చెబుతున్నారు. అయితే జీఎస్టీ అంటే ఏంటో నిర్వచనం చెప్పాలంటూ ఓ విలేకరి ప్రశ్నించాడు. ఒక్కసారిగా అలా అడిగేసరికి మంత్రి రమాపతి తెల్లమొహం వేశారు.
అయితే పక్కనున్నవారు...ఆయన పరిస్థితిని అర్థం చేసుకుని గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటూ అబ్రివేషన్ చెప్పినప్పటికీ మంత్రి అర్థం చేసుకుని చెప్పలేక దొరికిపోయారు. అంతేకాకుండా జీఎస్టీ అంటే ఏంటో తనకు తెలుసునని, కానీ ఇప్పుడు గుర్తుకు రావడం లేదని బుకాయించడం విశేషం. పైపెచ్చు జీఎస్టీ అర్థం తనకు తెలుసునని, దాని గురించి మరింత తెలుసుకునేందుకు సంబంధిత పత్రాలు పరిశీలిస్తున్నామని గొప్పలు చెప్పారు.
కాగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రెండు రోజుల క్రితం మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి జీఎస్టీ అమలుతో పాటు లాభ, నష్టాల గురించి చర్చించారు. అలాగే జీఎస్టీ అమలు వల్ల గందరగోళంతో పాటు, దానివల్ల ప్రయోజనాలపై ప్రజలకు మరింత అవగాహన కలిగించేందుకు ప్రయత్నించాలని ఆయన తన మంత్రివర్గ సహచరులతో పాటు అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో జీఎస్టీ అంటే... అంటూ మంత్రి అడ్డంగా దొరికిపోవడం గమనార్హం.