స్త్రీలోక సంచారం | Womens empowerment: Left, right battle it out over allowing women to Sabarimala | Sakshi
Sakshi News home page

స్త్రీలోక సంచారం

Published Wed, Oct 3 2018 1:16 AM | Last Updated on Wed, Oct 3 2018 1:16 AM

Womens empowerment: Left, right battle it out over allowing women to Sabarimala - Sakshi

‘అర్హత ఉండదు కానీ, పెద్ద పెద్ద ఉద్యోగాలు కోరుకుంటారు’’ అని మహిళా సైంటిస్టులపై నోరు పారేసుకున్నందుకు ఒక సైంటిస్టు పరువు పోగొట్టుకున్నాడు. శుక్రవారం జెనీవాలో సి.ఇ.ఆర్‌.ఎన్‌. (యూరోపియన్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ న్యూక్లియర్‌ రీసెర్చ్‌) సదస్సు జరుగుతోంది. ఐరోపాకు ఫిజిక్స్‌ ల్యాబ్‌ వంటిది సి.ఇ.ఆర్‌.ఎన్‌.! సదస్సులో 38 మంది సైంటిస్టులు మాట్లాడారు. వాళ్లలో ఒకరు అలెస్సాండ్రో స్ట్రుమియా. ఇటలీలోని పిసా యూనివర్సిటీ నుంచి సిద్ధాంత పత్రాలు పట్టుకుని వచ్చాడు ఆయన. స్పీచ్‌ మొదలైంది. ‘‘భౌతికశాస్త్రాన్ని నిర్మించింది మగవాళ్లే’’ అన్నాడు. అంతటితో ఊరుకోలేదు. ‘‘ఈ ఆడవాళ్లకు అర్హతలు ఉండవుగానీ, అందలాలు ఎక్కాలన్న కోరికలు మాత్రం ఉంటాయి’’ అన్నాడు. అకస్మాత్తుగా ఏమీ అతడు ఆడవాళ్ల ప్రస్తావన తేలేదు. ‘రిలేషన్‌షిప్‌ బిట్వీన్‌ హై ఎనర్జీ థియరీ అండ్‌ జెండర్‌’ అనే టాపిక్‌ మీద సెమినార్‌ అది. హై ఎనర్జీ థియరీ భౌతికశాస్త్రం లోనిదే. అలస్సాండ్రో తన పరిశీలనను వివరించడానికి తనతో పాటు స్లయిడ్స్, చార్టులు, గ్రాఫులు తెచ్చుకున్నాడు. ప్రధానంగా ఆయన పరిశీలన ఏంటంటే.. భౌతికశాస్త్ర రంగంలో మగవాళ్లు వివక్షకు గురవుతున్నారని! ఆ సంగతినే చాలా ఆవేదనగా చెబుతూ స్క్రీన్‌ మీద స్లయిడ్స్‌ వేస్తున్నాడు. ఒక స్లయిడ్‌లో మహిళలు క్యూలు కట్టి మరీ జెండర్‌ సైన్సెస్‌ తీసుకుంటున్నారు. తర్వాత వాళ్లంతా తమకు మూలకణ పరిశోధనా రంగంలో, కెమిస్ట్రీలో, ఇంజనీరింగ్‌లో ఉద్యోగావకాశాలు లేవని నిరసన ప్రదర్శన జరుపుతున్నారు. అంటే.. వ్యంగ్యం అన్నమాట. వీళ్లు చదివిందొకటి, అడుగుతున్నది ఒకటీ అని.  అక్కడితో అలస్సాండ్రో ఆగలేదు. మగవాళ్ల గొప్పతనం గురించి చెప్పడం మొదలు పెట్టాడు. ‘‘ఫిజిక్సులోకి రమ్మని మగవాళ్లను ఎవ్వరూ పిలిచి ఉద్యోగాలు ఇవ్వలేదు. వాళ్లంతట వాళ్లే ఫిజిక్సును నిర్మించుకున్నారు’’ అని ఇంకో స్లయిడ్‌లో చూపించాడు. ఇలా మహిళల్ని తక్కువ చేసి మాట్లాడ్డం సి.ఇ.ఆర్‌.ఎన్‌.కు కోపం తెప్పించింది. ఆహ్వానం పంపితే ఇంత అనాలోచితంగా మాట్లాడతాడా.. అని అతడిపై నిషేధం విధించింది. సభ్యత్వం నుంచి సస్పెండ్‌ చేసింది. జెనీవా ల్యాబ్‌లో భవిష్యత్తులో జరిగే ఏ కార్యక్రమానికీ అలెస్సాండ్రోకు పిలుపు ఉండదు. ఇలా అని సోమవారం నాడు సి.ఇ.ఆర్‌.ఎన్‌. ఒక అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. అక్కసు వెళ్లగక్కితే అంతే.. ఉన్న అవకాశం కూడా పోతుంది.  

శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల స్త్రీలకు ప్రవేశం కల్పించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చాక, ఆ తీర్పును శిరసావహించి, మహిళా భక్తులకు మెరుగైన వసతులు కల్పించడం కోసం కేరళ ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది. అయితే ఎన్ని సదుపాయాలను కల్పించగలిగినప్పటికీ.. స్త్రీలకు ప్రత్యేకంగా క్యూలు ఏర్పాటు చేయడం మాత్రం సాధ్యమయ్యేలా కనిపించడం లేదట! కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అధ్యక్షతన సోమవారం సమావేశమైన హై–పవర్‌ కమిటీ ‘మహిళా క్యూ’ల ఏర్పాటు విషయమై ‘ఏమి సేతురా..’ అని ఆలోచనలో పడింది. రద్దీగా ఉండే రోజుల్లో శబరిమల భక్తులు అయ్యప్ప దర్శనం కోసం 8 నుంచి 10 గంటల పాటు పొడవాటి క్యూలలో నిరీక్షించవలసి వస్తుంది. మహిళలు అంతసేపు ఉండగలరా అన్నది హై కమిటీ సందేహం. మీటింగ్‌ అయ్యేసరికి కూడా ఈ సందేహానికి సమాధానం దొరకలేదు. అలాగని ప్రత్యేక మహిళా క్యూల ఏర్పాటుకు నిర్ణయమూ జరగలేదు. ‘‘ఇదేదో తలకుమించిన పనిలా ఉంది’’ అనుకుంటూ వెళ్లిపోయారు దేవస్వం మంత్రి కడకంపల్లి సురేంద్రన్‌. మనసుంటే మార్గం ఉండదా మంత్రివర్యా! ప్రభుత్వం తలచుకుంటే ఇదొక సంకటమా? మీదొక సందేహమా?! 

పోర్చుగీసు ప్రొఫెషన్‌ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో (33).. తొమ్మిదేళ్ల క్రితం లాస్‌ వెగాస్‌లోని ఒక హోటల్‌ పెంట్‌హౌస్‌లో తనపై అత్యాచారం చేసినట్లు ప్రముఖ మోడల్‌ క్యాథరీన్‌ మయోర్గా (34) గత నెలలో నెవాడాలోని జిల్లా కోర్టులో 32 పేజీల కంప్లయింట్‌ ఇచ్చిన విషయమై సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ చాట్‌లో రొనాల్డో సమాధానం ఇచ్చాడు. ‘‘వాళ్లు చేసిన ఆరోపణలో వాస్తవం లేదు. అది ఫేక్‌. ఫేక్‌ న్యూస్‌’ అని ఓ అభిమానికి సమాధానం ఇచ్చిన రొనాల్డో ఆ తర్వాత కొద్ది సేపటికే ఆ పోస్టును డిలీట్‌ చేశాడు! 2009 జూన్‌ 13న పెంట్‌హౌస్‌లో రొనాల్డో తనకు ఇష్టం లేకుండా తనను బలప్రయోగంతో లోబరుచుకున్నాడని బాధితురాలు చేసిన ఆరోపణ.. అతడిలా పోస్ట్‌ను డిలీట్‌ చెయ్యడంతో నిజమేనని అనుకోవలసి వస్తోంది.
  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement